రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా జ్యుడిషియల్ జిల్లాలను ఏర్పాటు చేసి, అవసరమైన చోట నూతన కోర్టులను స్థాపించాలని ఏపీ జ్యూడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించింది. పరిపాలనా జిల్లాల పునర్విభజన తర్వాత తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరినట్లు ప్రతినిధులు తెలిపారు. జ్యుడిషియల్ అధికారుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కూడా వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, అధికారుల కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు. వీటితో పాటు సాఫ్ట్ లోన్ పరిమితిని పెంచాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని విన్నవించారు. అసోసియేషన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. జ్యుడిషియల్ జిల్లాల ఏర్పాటు, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబుతో జ్యుడిషియల్ అధికారుల భేటీ.
162