అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని రైతులు అవమానాలకు గురయ్యారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతుల త్యాగాలు, భూసమీకరణతోనే అమరావతి నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడిందని తెలిపారు. రాజధాని నిర్మాణం విషయంలో రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh
పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కలిసి ప్రారంభించారు. సబ్ డిపో అందుబాటులోకి రావడంతో ఇకపై రేషన్ సరుకుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సబ్ డిపో లేకపోవడంతో నిత్యావసర సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని.. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. సబ్ డిపో ప్రారంభంతో తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులకు అధికారులు టాయిలెట్ల వినియోగం, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రభుత్వ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని ఎక్కడ నిర్మించాలనే అంశంలో ఒకప్పుడు గందరగోళ పరిస్థితి ఉండేదన్నారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా.. మెజార్టీ ప్రజలు అమరావతిలోనే రాజధాని నిర్మించాలని నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణానికి ముందు తాను సింగపూర్ వెళ్లానని.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని తెలిపారు. ఐకానిక్ భవనాలు, అసెంబ్లీ భవనాల డిజైన్లను కూడా సింగపూర్ రూపొందించిందన్నారు. గతంలో అమరావతిని గ్రాఫిక్స్ రాజధాని అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని ఆయన మండిపడ్డారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు పడింది. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణ కోసం ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈ ఎంఓయూపై ఒప్పందం జరిగింది. తీర రక్షణ గోడకు సంబంధించిన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్ నిర్వహించనుంది. 323 కోట్లతో ప్రతిష్టాత్మక తీర రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా, ఏపీ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా వ్యవహరించనున్నాయి.సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం, తీర కోత తీవ్రతపై శాస్త్రీయ అధ్యయనం చేసి నిర్మాణ డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. అధికారిక ఒప్పంద ప్రక్రియ పూర్తికావడంతో రానున్న నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు
ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా , ఇతర ఉన్నతాధికారులు నేరుగా పాల్గొనగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు , ఎస్ఐలు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. మొత్తం 1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs) సహా దాదాపు 1,650 మంది అధికారులు ఒకేసారి ఈ వర్చువల్ సమావేశంలో పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసులు నమోదు చేసే తీరు , ప్రజలకు వేగంగా న్యాయం అందించే ప్రక్రియపై సీఎం దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణతో పాటు సైబర్ క్రైమ్స్, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి ముఠాల ఆగడాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగాన్ని కఠినంగా ఆదేశించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల పురోగతిని సమీక్షిస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఎలాంటి దాక్షిణ్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తూనే నేరస్థుల పట్ల సింహస్వప్నంగా వ్యవహరించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ తరహాలోనే ఉన్నతాధికారులను హెచ్చరించారు.
ఏపీలో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధమవుతోంది. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడంతో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. 37 భారీ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై బోర్డు సమగ్రంగా చర్చించింది. మొత్తం 2.08 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించేలా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అమరావతి సచివాలయంలో 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయడం, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ సమావేశం ముందుకు వివిధ రంగాలకు చెందిన ఏకంగా 37 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా ఏపీకి సుమారు 2.08 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, ఐటీ రంగాలకు చెందిన ప్రతిపాదనలను సీఎం విస్తృతంగా సమీక్షించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల పెట్టుబడులపైనా ప్రత్యేకంగా చర్చించారు.
పెట్టుబడుల ప్రతిపాదనలకు కేవలం అనుమతులు ఇవ్వడమే కాకుండా.. క్షేత్రస్థాయిలో పనులు వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని స్పష్టం చేశారు. భారీ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
కడప జిల్లా పులివెందులలో రాజకీయ ర్యాలీలకు విద్యార్థులను తరలించడంపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలోని ఓ ప్రైవేట్ కళాశాల వద్దకు చేరుకున్న ఆయన.. నిన్న జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీకి కాలేజీ విద్యార్థులను తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ నాయకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని బీటెక్ రవి ఆరోపించారు. ఎంపీ పిల్లలు హైదరాబాద్‌లో చదువుకోవాలా.. ఇక్కడి విద్యార్థులను మాత్రం రాజకీయ ర్యాలీలకు తీసుకెళ్లాలా అంటూ ప్రశ్నించారు.
ర్యాలీకి జన బలం లేకపోతే తమను అడిగితే ప్రజలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లాలని ఒత్తిడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో డీఎస్సీకి అనుకూలంగా రాజకీయ కార్యకర్తలను కాకుండా ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించాలని బీటెక్ రవి సూచించారు. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆయన కోరారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మత్స్యకారుల భద్రతకు కీలకమైన చర్యలు చేపట్టారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ట్రాన్స్పాండర్లను పంపిణీ చేశారు.ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో ఉన్న పడవల ఆచూకీని ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు.. తుఫాను హెచ్చరికలను ముందుగానే పొందే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్ సందేశాలను పంపేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని.. సబ్సిడీపై వలలు, బోట్లు అందిస్తున్నామని తెలిపారు.వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని.. ప్రమాదాలకు గురైన బోట్లకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి లైఫ్ జాకెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు వేగంగా న్యాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను మరింత తీవ్రతరం చేసింది. డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా మళ్లించి నిలువునా ముంచిన యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల డబ్బుతో బంధువుల పేరిట కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆస్తులను వెంటనే జప్తు చేయాలని హోం శాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అగ్రిగోల్డ్ కంపెనీల జాయింట్ ఎండీగా వ్యవహరించిన అవ్వా హేమ సుందర వరప్రసాద్ తన అత్త ఎల్లా జయలక్ష్మి పేరిట కృష్ణా జిల్లాలోని పోరంకి, పెనమలూరు, ఈదర ప్రాంతాల్లో 6.55 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కొనుగోళ్లన్నీ డిపాజిటర్ల సొమ్ముతోనే జరిగినట్లు నిర్ధారణ కావడంతో వీటి జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అక్రమ పెట్టుబడుల దర్యాప్తు పొరుగు రాష్ట్రాలకూ విస్తరించగా, కర్ణాటకలోని బెంగళూరు జిల్లా అనేకల్ తాలూకా, సర్జాపూర్ హోబ్లీ పరిధిలోని ముత్తనల్లూర్ అమ్మనికేరి గ్రామంలో ఎన్. మమత అనే మహిళ పేరిట ఉన్న 3.32 ఎకరాల భూమిని కూడా గుర్తించారు. ఈ ఆస్తుల జప్తు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని సీఐడీ డైరెక్టర్ జనరల్ ను ప్రభుత్వం ఆదేశించింది.
ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో మీ భూమి–మీ హక్కు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, పట్టాలు పంపిణీ చేశారు.
రైతుల సమస్యలు పరిష్కరించేందుకే తాను ఇక్కడికి వచ్చానని సీఎం చంద్రబాబు న్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అత్యంత ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసుపుస్తకాలేనని.. ఈ సమస్యను పరిష్కరించాలని సంకల్పం తీసుకున్నానని చెప్పారు.
ఇకపై ప్రతి నెల 9వ తేదీన రైతుల వద్దకు వెళ్లి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తానని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని 9,365 గ్రామాల్లో పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉందని, 68 లక్షల మందికి పాసుపుస్తకాలు అందించే వరకు అధికారులను వదిలిపెట్టనని స్పష్టం చేశారు.
కొత్త పాసుపుస్తకాల్లో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు అమలు చేశామని సీఎం తెలిపారు. కరెన్సీ తయారీ తరహాలో పాసుపుస్తకాలను రూపొందించామని, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించామని చెప్పారు. పాసుపుస్తకంలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వారసత్వంగా వచ్చిన భూములను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఏలూరు జిల్లాలో రహదారుల సమస్య కూడా కీలకంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం సూపర్‌హిట్ అయిందని అన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పామని.. అదే విధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను తానే తీసుకుంటానని చెప్పారు. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూపాయిన్నరకే అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తున్నామని తెలిపారు.రౌడీలకు సింహస్వప్నంగా ఉంటామని సీఎం హెచ్చరించారు. గత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. బాబాయిని చంపి నా చేతిలో గొడ్డలి పెట్టారని వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ రాష్ట్రానికి దౌర్భాగ్యమని చంద్రబాబు విమర్శించారు.