టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. దలైలామా నిండు నూరేళ్లూ పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించడంలో, మానవ హక్కుల రక్షణ కోసం దలైలామా చేస్తున్న అద్వితీయమైన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. లోకానికి దయ, అహింస, కరుణ వంటి ఉన్నతమైన విలువలను పరిచయం చేస్తూ.. దశాబ్దాలుగా కోట్లాది మందిలో దలైలామా స్ఫూర్తిని నింపుతున్నారని ప్రశంసించారు. సమాజంలో ద్వేషాన్ని వీడి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలంటూ దలైలామా ఇచ్చిన సందేశాలు ఎప్పటికీ గుర్తిండిపోతాయన్నారు. ఇలాగే మరిన్ని సంవత్సరాల పాటు సమాజానికి మార్గదర్శనం చేయాలని, ఆయనకు దైవ బలం, దీర్ఘాయుష్షు లభించాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా… రియల్‌టైమ్‌లో స్పందించే పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించడంతో పాటు… రాష్ట్రవ్యాప్తంగా జీరో వేస్ట్ పట్టణాల లక్ష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యల పరిష్కారమే అధికారుల పనితీరుకు గీటురాయి అని పేర్కొన్నారు.
ఐదు రోజుల జిల్లా పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వ స్పందన, వివిధ శాఖల సేవలు, పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, పట్టణ పరిశుభ్రత, గంజాయి నిర్మూలన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు రియల్‌టైమ్‌లో స్పందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను శాఖలవారీగా విభజించి… ప్రత్యేక కార్యాచరణతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని సూచించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని… అత్యవసర ఘటనల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖ తీరంలో బోటు ప్రమాదం వంటి సంఘటనల్లో తక్షణ స్పందనే ప్రభుత్వ పనితీరుకు ప్రమాణమని పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మూడు నెలల్లోగా తొలగించాలని ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణ, స్వచ్ఛ రథాల నిర్వహణకు స్పష్టమైన కార్యాచరణ అమలు చేసి… జీరో వేస్ట్ పట్టణాలు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, మహిళలపై నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, ప్రభుత్వ పథకాల ఫలితాల విశ్లేషణపై కూడా సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం టవర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ శాఖల పనితీరులో ఏఐ, డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం… సాంకేతికత ఆధారిత పాలన… పరిశుభ్రమైన పట్టణాలు… సమర్థవంతమైన పరిపాలనే ప్రభుత్వ ప్రాధాన్యత అని మరోసారి స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రతి శాఖ ఫలితాల ఆధారంగా పనిచేసేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
5 రోజుల జిల్లాల పర్యటనను ముగించుకొని అమరావతికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. నాలుగు జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి..ఇవాల్టి నుంచి పరిపాలనపై దృష్టి సారించనున్నారు. ఇవాళ RTGS, ఎకనమిక్ రీజియన్లు అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించారు.
ఈ నెల 1న అమరావతి నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. నెల్లూరు జిల్లా గూడూరులో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని, పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో మెగా ఫర్నిచర్ పార్కు ఏర్పాటు చేయనున్నామని, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడులో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.
ఇక జూలై 2న, తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకం ‘వీబీ జీ రామ్ జీ’ని జాతీయ స్థాయిలో ప్రారంభించారు. అనంతరం తిరుపతిలో ‘ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్’ వర్క్‌షాప్‌లో పాల్గొని, డేటా ఆధారిత పాలన ప్రాముఖ్యతను వివరించారు.
జూలై 3న, రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించారు. రూ.16,350 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంటుతో పాటు, అనుబంధంగా ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్టు పనులనూ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.
అనంతరం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ‘స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక’ కార్యక్రమంలో భాగంగా రూ.9,322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో ప్రఖ్యాత అడిడాస్ ఫుట్‌వేర్ సంస్థ నుంచి విమానాల తయారీ ప్రాజెక్టు వరకు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 40 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. కుప్పంలో రూ.118 కోట్లతో మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, ఆరు దశాబ్దాల కంగుంది భూ సమస్యను పరిష్కరించి రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. చివరి రోజు పౌల్ట్రీ, అభ్యుదయ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఇక రాత్రి కుప్పంలోనే బస చేసిన సీఎం చంద్రబాబు..ఇవాళ నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆర్టీజీఎస్ సమీక్షతో పాటు విశాఖ, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
టీడీపీ యువనేత, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నూతన దంపతులు బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతలను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ రిసెప్షన్ వేడుకకు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం గ్రామంలో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. పంట కాలువలకు నీరు వచ్చి నెల రోజులు దాటినా తమ పొలాలకు నీరు అందడం లేదని రైతులు కాలువలోనే కూర్చొని నిరసన తెలిపారు. చిన్న, కౌలు రైతులైన తమకు సాగునీరు లేక సుమారు 70 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఆకుమడి వేయడానికి కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపిస్తూ, వెంటనే నీరు విడుదల చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
విశాఖపట్నం బీచ్‌లను మరింత పరిశుభ్రంగా మార్చి పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో జీవీఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీచ్‌ల ఇసుకలో చెత్త పేరుకుపోకుండా యంత్రాలతో శుభ్రపరిచే కార్యక్రమాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించనున్నారు. ఆర్కే బీచ్, కోస్టల్ బ్యాటరీ, పెదజాలారిపేట, అప్పూఘర్ వంటి తీర ప్రాంతాల్లో పర్యాటకులు వదిలే ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార ప్యాకెట్లు, బాటిళ్లు ఇసుకలో కలిసిపోతుండటంతో పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వాటి విజయవంతమైన పనితీరు కారణంగా దీర్ఘకాలిక నిర్వహణకు టెండర్లు పిలవడం జరిగింది. ఈ చర్యతో విశాఖ బీచ్‌లు మరింత శుభ్రంగా మారి పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుతాయని అధికారులు భావిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా విశాఖ బీచ్‌లలో పర్యాటకుల రద్దీ పెరగడంతో పాటు చెత్త సమస్య కూడా తీవ్రమైంది. పానీపూరీ, మురీమిక్చర్, ఐస్‌క్రీమ్, నూడిల్స్ వంటి ఆహార పదార్థాల వినియోగం అనంతరం వ్యర్థాలను ఇసుకలో పడేయడం వల్ల బీచ్ అందం దెబ్బతింటోంది. వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్ సీసాలు కూడా ఇసుక తిన్నెల్లోనే పడేయడంతో పర్యావరణ సమతుల్యతపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు జీవీఎంసీ యంత్రాలతో ఇసుక శుభ్రపరిచే విధానాన్ని ప్రారంభించింది. రెండు యంత్రాలు పగటిపూట, ఒక యంత్రం రాత్రిపూట పనిచేస్తూ చెత్తను వేరు చేస్తున్నాయి. ఇప్పుడు వాటి నిర్వహణ కొనసాగింపుకు ఐదేళ్ల టెండర్లు పిలవడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
విశాఖ తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జీవీఎంసీ మరింత పెద్ద ప్రణాళికలను అమలు చేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్కే బీచ్ వరకు, అలాగే పెదజాలారిపేట నుంచి అప్పూఘర్ వరకు వివిధ సమయాల్లో యంత్రాలతో ఇసుక శుభ్రత కార్యక్రమం కొనసాగనుంది. ఈ పనులకు దాదాపు రూ.1.8 కోట్లు, రూ.1.46 కోట్లు వ్యయంతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. బీచ్‌లలో చెత్త సమస్యను పూర్తిగా తగ్గించి పర్యాటకులకు శుభ్రమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ చర్యలతో విశాఖ బీచ్‌లు మరింత ఆకర్షణీయంగా మారి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖ తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఉదంతంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌లతో ఆమె ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి, జిల్లా కలెక్టర్, డీఐజీ, సీపీ, మరియు మత్స్యశాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. నేవీ హెలికాప్టర్లు, మెరైన్ బోట్ల సహాయంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను హోం మంత్రి ఆదేశించారు.
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల ఒకటో తేదీన విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులైన అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్యల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.మత్స్యకారుల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, మత్స్యకారుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ, మెరైన్ పోలీసులు, కోస్ట్‌గార్డ్ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి.గల్లంతైన వారిలో ఆరుగురు భోగాపురం ముక్కాంకు చెందినవారు కాగా, మరొకరు భీమిలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పామర్రు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని చూసి ప్రతిపక్ష నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ఆర్అండ్బీ రోడ్లు, డ్రైనేజీలు, ఎంఎస్ఎంఈ పార్క్‌తో పాటు పలు అభివృద్ధి పనులు పామర్రు నియోజకవర్గంలో జరిగాయని తెలిపారు. చెరువుల మట్టి తవ్వకాలపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు చేపట్టామని స్పష్టం చేశారు. గ్రామాల్లో స్మశానాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాల అభివృద్ధికి మట్టి వినియోగించామని వెల్లడించారు.తన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని మండిపడిన కుమార్ రాజా.. రాజకీయంగా విమర్శలు చేయాలంటే తనను లక్ష్యంగా చేసుకోవాలని, కుటుంబ వ్యవహారాల్లోకి రావొద్దని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను హెచ్చరించారు.
జగన్ వ్యాఖ్యల్లో స్థిరత్వం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. మావిగన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె… స్థిరత్వం లేని వ్యక్తిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఉత్తరాంధ్రలో జగన్ కంటే సీనియర్ నాయకులు ఉన్నారని.. ఆయన నిలకడలేని రాజకీయ వైఖరితో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఇక ఫలించవన్నారు సంధ్యారాణి.





Total views : 199277