ఒకప్పుడు అమరావతికి జై కొట్టారు.. తర్వాత రూటు మార్చి మూడు రాజధానులు అన్నారు. మూడు ముక్కలాట ఆడారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖే మా ముద్దుబిడ్డ అన్నారు. ప్యాలెస్ తప్ప మూడు బిల్డింగ్‌లు కూడా కట్టలేదు. కట్ చేస్తే..వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇప్పుడు సడన్‌గా మావిగన్ అంటున్నారు. అధికారం పోయినా, జనాలు 11 సీట్లకే పరిమితం చేసినా జగన్‌కు తత్వం బోధపడలేదు. ఒక చేత్తో అమరావతి రైతులపై సానుభూతి చూపిస్తూనే.. ఇంకో చేత్తో అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ అజెండాతో వెళ్తామంటున్నారు. మొత్తానికి మావిగన్ స్లోగన్‌తోనే వచ్చే ఎన్నికల్లో తలపడతామంటున్నారు. అయితే ఓవైపు అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో.. జగన్ తెచ్చిన ఈ సరికొత్త ప్రతిపాదన అటు ప్రజల్లోనే కాదు.. ఇటు సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికలలోపు అమరావతి రాజధానికి ఓ రూపు వచ్చేస్తుంది. ఇప్పటికే నిర్మాణ పనులు ఫ్లడ్‌లైట్ల వెలుగులతో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. మరి అన్ని పనులు పూర్తయితే ఇంకో రాజధాని అవసరం ఏముంటుంది అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇంతకీ అసలు మావిగన్ కథ ఏంటి..? జగన్ మైండ్‌లో ఏముంది. అధికార కూటమి ఏమంటోంది..?
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీకి రాజధాని అంశం ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నాడు ప్రతిపక్ష నేతగా అమరావతికి జై కొట్టిన జగన్మోహన్ రెడ్డి.. 2019లో అధికారంలోకి రాగానే మాట మార్చారు. మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఐదేళ్ల పాటు కాలయాపన చేసి.. చివరకు ఉత్తరాంధ్రా ప్రజలు కానీ, కృష్ణా-గుంటూరు ప్రజలు కానీ జగన్ నిర్ణయాన్ని స్వాగతించలేదు. మొన్నటి ఎన్నికల్లో విద్యాధికులు, తటస్థులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఓట్ల రూపంలో వైసీపీకి గట్టి బుద్ధి చెప్పారు. అయినా సరే జగన్ గతాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు పేరును తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అనే ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని నిర్వీర్యం చేస్తాం అని జగన్ చెప్పకనే చెప్పారంటున్నారు టీడీపీ నేతలు. ఎన్ని భవనాలు కట్టినా నేలమట్టం చేసి.. మావిగన్ ను అభివృద్ధి చేస్తాం అన్నది జగన్ మాట. మరి రాజధానికి వేలకు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల మాట ఏంటి? 50 వేల కోట్ల రూపాయల రుణం మాట ఏంటి? అంటే తెలియని పరిస్థితి. దాదాపు 15 సంవత్సరాల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం అంటే దాని వెనుక జగన్ వైఫల్యమే కనిపిస్తోందని.. ఆయన ప్రజల్లో ఒక రకమైన విభజన రేఖ తేవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.
అమరావతిని వ్యతిరేకించినందుకే ఆ పార్టీ గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైందని అన్నారు సీఎం చంద్రబాబు. జగన్ పాలనలో రాజధాని రైతులపై దాడులు జరిగాయని, కుల, మత, ప్రాంతీయ రాజకీయాలతో ప్రజలను విడదీయాలని ప్రయత్నించారని ఆరోపించారు. రాజధానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర సహకారంతో చర్యలు తీసుకున్నామని, అయినప్పటికీ జగన్ అమరావతిని అంగీకరించడం లేదని విమర్శించారు.
రాజకీయ లబ్ధి కోసం జగన్ తెరపైకి తెచ్చిన ఈ మావిగన్ అనే సరికొత్త వ్యూహం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటో ఆయన ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు దశాబ్దాలుగా ఉన్నవే. పైగా కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న అమరావతి సైతం భౌగోళికంగా ఈ విజయవాడ-గుంటూరు పరిధిలోనే ఉంది. అలాంటప్పుడు అమరావతికి భిన్నంగా జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ ప్లాన్ ఏంటో, దాని స్వరూప స్వభావాలు ఏమిటో కనీస రోడ్ మ్యాప్ లేకుండా కేవలం నినాదాలకే పరిమితం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
ఏదైనా ప్రతికూల అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ ఈ విషయంలో జగన్ వెనుక పడ్డారనే టాక్ వినిపిస్తోంది. అమరావతిని వ్యతిరేకించడం వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ రాజకీయంగా భారీగా నష్టపోయింది. విద్యాధికులు, తటస్థులు ఓట్ల రూపంలో తమ తీర్పును స్పష్టంగా ఇచ్చారు. అయినప్పటికీ జగన్ తన పంథా మార్చుకోకపోవడం గమనార్హం. ఇప్పుడు ఆయన కొత్తగా జపిస్తున్న మావిగన్ మంత్రానికి అటు విజయవాడ, గుంటూరు ప్రజల నుంచి కానీ, ఇటు మచిలీపట్నం నుంచి కానీ కనీస స్పందన కరువైంది. ఒకవైపు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు శరవేగంగా సాగుతుంటే.. ఈ తరుణంలో అమరావతి కావాలా? మావిగన్ కావాలా? అంటూ ప్రజలను ప్రశ్నించడం ఆయనలోని రాజకీయ విధ్వంసక ఆలోచనను బయటపెడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు రాజధాని విషయంలో వైసీపీ అధినేత ఒకసారి అమరావతి, మరోసారి మూడు రాజధానులు, ఇప్పుడు సడన్‌గా మావిగన్ అంటూ పదే పదే మాట మారుస్తుంటే.. రేపు జనాల్లోకి వెళ్తే తమ పరిస్థితి ఏంటని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు భయపడుతున్నారు. మొన్నటికి మొన్న అమరావతి రైతులకు మద్దతుగా పరామర్శకు వెళ్లిన వైసీపీ నేతలకు స్థానికంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినా సరే, అధినేత ఏం చెప్పినా దానికి తలూపడం మినహా మరో ప్రత్యామ్నాయం లేక.. వచ్చే ఎన్నికల నాటికి వీరంతా మావిగన్ స్లోగన్‌తో ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి అమరావతి రాజధాని విషయంలో వైసీపీపై వ్యతిరేకముద్ర పడిందని.. ముఖ్యంగా విద్యాధికులతో పాటు న్యూట్రల్‌గా ఉండే వాళ్లు కూడా దీనిని తప్పుపడుతూ ఓట్ల రూపంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారట. అయినా ఎందుకో జగన్ వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారట.