విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి. కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి. రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ వెళ్లనున్నారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11.30 కు సంఘటన స్థలానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్నారు. మరో వైపు. రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
Andhra Pradesh
ఆర్టీసీ డ్రైవర్లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కోసం గాలిస్తున్నామన్నారు. నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. నిందితులంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందిన వారని, ప్రజలను బెదిరించడం, మోసం చేయడం. ఈ ముఠా నైజమని తెలిపారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఠాపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. హారన్ కొట్టారనే నెపంతో కావలి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు బి.ఆర్.సింగ్, శ్రీనివాసరావులపై 14 మంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. డ్రైవర్లపై వైసీపీ మూకలు రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టడం దారుణమని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. దొడ్డిపల్లిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిపై ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మండల సర్వేయర్ పైన ఒత్తిడి తెచ్చారు. సర్వేయర్ రెడ్డప్ప ఈ భూమి కోర్టులో ఉన్నందువల్ల సర్టిఫికెట్ ఇవ్వలేనన్నారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ కార్యాలయానికి వచ్చి నాయకులు కంభం అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి దాడికి ప్రయత్నించారు. దీంతో సర్వేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ సమాధి అవుతారని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. తన వ్యాఖ్యలు టీడీపీ వాళ్లకు తప్పుగా అనిపిస్తున్నాయని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… “2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు భగ్గుమన్నాయి. చంద్రబాబును అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పడానికి ఎంపీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. తాను అన్న వ్యాఖ్యలను మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉచ్చారణ దోషం వల్ల టీడీపీ వాళ్లకు అలా అనిపించి ఉండొచ్చని తెలిపారు. చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుగా ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
ఏలూరు జిల్లా నూజివీడులో ఎగ్జిబిషన్ ను అనధికార అనుమతులతో నిర్వహిస్తున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. దీంతో వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నూజివీడు లాంటి చిన్న పట్టణంలో సామాన్య కుటుంబం ఎగ్జిబిషన్ వెళ్లాలంటే మూడు వేల వరకు జేబులకు చిల్లు పడాల్సివస్తుంది. తాము అన్నిశాఖల అధికారులకు ముడుపులు చెల్లించామని..తమకు ఎలాంటి నిబందనలు వర్తించవని బాహాటంగానే ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెబుతున్నారు. ఎగ్జిబిషన్ అనుమతులకు మున్సిపల్ శాఖకు నిర్వాహకులు నామమాత్రపు చెల్లింపులతో సరిపెట్టారు. విద్యుత్ శాఖ అధికారులు మామూళ్ళ మత్తులో తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కు అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు వేలమంది సందర్శిస్తున్నప్పటికీ, అరకొర సౌకర్యాలతోనే ఎగ్జిబిషన్ నడుస్తోంది.
ఒక వేళ ప్రమాదవ శాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే నివారించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడ్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 51 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. అయితే చంద్రబాబుకు మద్దతుగా వివిధ వర్గాల వారు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు, బిల్డింగ్స్ వద్ద ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా ఆందోళన నిర్వహించారు. బ్లాక్ డ్రెస్‌లతో ఆఫీసులకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఇటు మెట్రో రైల్లో కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బ్లాక్ డ్రెస్‌లతో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా ఐటీ ఉద్యోగులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబుకు కృతజ్ఞతగా భారీ సభను ఏర్పాటు చేశారు. సాయంత్ర 4గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ సభ జరగనుంది. సభకు సంబంధిచి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. దాదాపు లక్ష మందిపైగా ఈ సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఐటీలో తాము చేస్తున్న ఉద్యోగాలు నాడు చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేయడం వల్లే వచ్చాయని టెక్కీలు తెలిపారు. దీనికి చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఓ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు. అయ్యన్నకుంటిపల్లెకి చెందిన గేరా సందీప్ గ్రామంలోని పరమేశ్వర సాయి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. వివాహితతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన సందీప్ అదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. తలుపులు తెరిచి చూసేసరికి సందీప్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అయితే సందీప్ ది ఆత్మహత్య కాదు… హత్య చేసారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా రైలు ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు. పాలకోడేరు మండలం శ్నంగవ్నక్టంలో గేట్ మెన్ కొట్టు ప్రకాశరావు గేట్ క్యాబిన్ లో మద్యం సేవించి డ్యూటీకి హాజరయ్యారు. మద్యం మత్తులో రైల్వే గేట్ తెరిచేందుకు గంటకు పైగా హైడ్రామా నడిపినా, రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో అర్ధరాత్రి గంట పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గేట్ మేన్ కు తాగింది ఎక్కువ అవ్వడంతో మాటకూడా సరిగా రాలేదని, స్థానికులు గట్టిగా నిలదీయడంతో తాను మద్యం తాగి వచ్చానని ఒప్పుకున్నాడు. బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే గేట్ మేన్ ను విధులనుంచి తప్పించాలని ప్రజలు కోరుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వైఎస్సార్ సెంటర్, జాతీయ రహదారిపై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నది. రెండు వర్గాలు వారు ఒకరిపై ఒకరు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ వైనం ఆకివీడు తెలకపాముల సామాజికవర్గం, సంత మార్కెట్ ముఠా వర్కర్స్ సభ్యుల మధ్య జరిగింది. మద్యం దుకాణం వద్ద చెలరేగిన వివాదమే ఘర్షణకి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇరువర్గాలు వారు కర్రలతో కొట్టుకోవడంతో, పదిమంది తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాని, వీరిని ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆకివీడు ఎస్ఐ నాగబాబు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామంలో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర కార్యక్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన చిన్న వివాదం విదితమే. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి టిడిపి నాయకులను వెంటబెట్టుకుని నిన్న ఉదయం శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై విరుచుకు పడ్డారు. ఈ తరుణంలో పోలీసులు 26 మంది పై ఆరు రకాల సెక్షన్లో కేసులు బనాయించారు.




Total views : 203117