బంగారం, వెండిపై కేంద్రం కీలక నిర్ణయం
దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15శాతానికి పెంపు
ఏడాదిపాటు బంగారం కొనొద్దని కోరిన ప్రధాని
ఆ ప్రకటన వెలువడిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు
దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6 నుంచి 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందులో 10శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5 శాతం AIDC రూపంలో ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడం, వాణిజ్య లోటు పెరగడంతో దిగుమతులను కట్టడి చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో భారతీయులు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. వాస్తవానికి బంగారంపై సుంకాలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ వర్గాలు తెలిపినప్పటికీ, మారిన పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారుగా, అతిపెద్ద వెండి వినియోగదారుగా ఉన్న భారత్..దేశీయ అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇప్పటికే బంగారం, వెండి ధరలు చుక్కలనంటుతున్న ఈ టైమ్‌లో దిగుమతి సుంకం పెంపుతో వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.