పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై అమల్లో ఉన్న తాత్కాలిక ఆంక్షలను జులై 1 నుంచి ఎత్తేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హోర్మూజ్ జలసంధి క్లోజ్ అవడం.. ఇంధన సరఫరాకు ఆటంకాలు తలెత్తడం.. ఇలా పలు కారణాల వల్ల.. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు రిటైల్ ఇంధన కేంద్రాల నుంచి పెట్రోల్, డీజిల్ బల్క్‌లో కొనే విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది కేంద్రం. ఐతే పెట్రోలియం ఉత్పత్తుల ప్రస్తుత సరఫరా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆంక్షలు ఇకపై అవసరం లేదని నిర్ధారణకు వచ్చింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ద్వారా నిర్వహించబడే రిటైల్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించేందుకు జూన్ 12న తాత్కాలిక ఆంక్షలు విధించింది. పెద్ద పెద్ద క్యాన్లు, పీపాల్లో.. పెట్రోల్, డీజిల్ కొట్టొద్దని.. వేల లీటర్లను పీపాల్లో నింపొద్దని.. అలాంటి వాళ్లకు పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అప్పట్లో కఠిన ఆదేశాలు జారీ చేసింది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బైక్స్, కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు ఇలాంటి వాహనాల్లోనే పెట్రోల్, డీజిల్ నింపాలని.. పీపాలు తీసుకొస్తే పోయొద్దని స్పష్టం చేసింది. బల్క్ కొనుగోళ్లపై నిషేధం 90 రోజులు అమల్లో ఉంటుందని ప్రకటించినప్పటికీ.. సరఫరాకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఈ ఆంక్షల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. జులై 1 నుంచి ఈ ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు ప్రకటించింది.