ఛత్తీస్‌గఢ్‌లో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. శనివారం కవార్ధాలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. యూపీలో లవ్ జిహాద్ పూర్తిగా నిషేధంచామన్నారు. దీనికి వ్యతిరేకంగా చట్టం చేశామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కూడా లవ్ జిహాద్, గోవుల అక్రమ రవాణా, మైనింగ్ మాఫియాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌ను ఇంటికి పంపి..బీజేపీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు.
National
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల సాధిస్తున్న విజయాలతో ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ పేరు మార్మోగుతోంది. అయితే, ఆయన రాసిన ఓ పుస్తకం వివాదంలో చిక్కుకుంది. ఆ పుస్తకం పేరు ‘నిలవు కుడిచ్చ సింహంగళ్’… ఇది మలయాళ పుస్తకం. ఆ పేరుకు అర్థం ‘వెన్నెలను తాగిన సింహాలు’. సోమనాథ్ తన పుస్తకంలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్ పై కొన్ని విమర్శలు చేశారంటూ తాజాగా వివాదం తలెత్తింది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి వచ్చింది. దీనిపై సోమనాథ్ స్పందించారు. తాను పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. సాధారణంగా స్పేస్ కమిషన్ లో సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి ఖాయమని ఓ అభిప్రాయం ఉందని, కానీ, ఇస్రో నుంచి మరో డైరెక్టర్ ను నియమించడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయని మాత్రమే తాను పుస్తకంలో పేర్కొన్నానని సోమనాథ్ వివరణ ఇచ్చారు. ఈ వివాదం కారణంగా తన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు సోమనాథ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 గంట సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు ఎన్ఎస్సీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ నమోదు కాలేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 1 గంట 7 నిమిషాలకు ఇది సంభవించిందని, అక్షాంశం: 28.73, పొడవు: 82.26, లోతు: 10 కి.మీ అని వివరాలు వెల్లడించింది. కాగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం నేపాల్‌ను వణికించిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రకంపనలు భారత్‌లోని ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన విషయం తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన విషయం బయటపెట్టింది. ఈ నేపథ్యంలో సీఎం బఘేల్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల సాయంతోనే కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తోందని స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రచారం కోసం నిధులు సమకూర్చేందుకు హవాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని స్మృతి ఇరానీ ఆరోపించారు. సీఎం ప్రచారానికి బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన అక్రమ డబ్బును వినియోగించడం ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. దేశ ఎన్నికల చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. అధికారంలో ఉండగా ఆయన బెట్టింగ్ గేమ్ ఆడారని స్మృతి ఇరానీ అన్నారు.
ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని ఏఎస్ఐని కోరింది. ఆగ్రాలోని తాజ్‌మహల్ నిర్మాణం 1631-48 మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజ్‌మహల్‌కు సంబంధించి చరిత్ర పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దాలంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతమున్న తాజ్‌మహల్ ఒకప్పుడు రాజామాన్ సింగ్ ప్యాలెస్ అని, దానికి షాజహాన్ తన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశాడని పేర్కొంది. ఈ మేరకు చరిత్ర పుస్తకాల్లో తప్పులను సరిదిద్దాల్సిన అవసరం కోరింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ తుషార్ గెడెలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంలో ఏఎస్ఐ ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంపై దృష్టిసారించాలని తాజాగా ఏఎస్ఐని కోరింది.
దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి యోగ మరియు వాస్తు శాస్త్రం తెలిసి ఉంటే మనము ఆరోగ్యంగా …సంతోషంగా ఉండగలమని ప్రముఖ వాస్తుశాస్త్రియుడు డాక్టర్ రవి రావు అన్నారు. రవి రావు రచించిన వాస్తు శాస్త్ర ఫార్ ఎవరీ వన్ అనే పుస్తకం ఈరోజు నగరంలోని లాక్ డికా పూల్ లోని ఓ హోటల్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల నుండి నేను వాస్తు శాస్త్రంలో ఉన్నాను. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది. ఈ పుస్తకంలో 12 చాప్టర్లు ఉంటాయి ఇవి సామాన్య ప్రజల జీవితాలకు సంబంధించి ఉంటుంది. ఈ పుస్తకం త్వరలో తెలుగు.. హిందీ.. రష్యన్ భాషలో కూడా వస్తుందని వారు వెల్లడించారు.
తూత్తు కుడి లోని మురుగేషన్ నగర్ ప్రాంతానికి చెందిన వసంతకుమార్ కుమారుడు మారిసెల్వం చిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత మూడు రోజుల క్రితం దేవరజయంతి నాడు కార్తీక ఇంటి నుంచి వెళ్లి మరీసెల్వంను పెళ్లి చేసుకుంది. దీంతో ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా ఇంట్లో ఉన్న మరిసెల్వం, కార్తీకలను హత్య చేసి పారిపోయారు. దీంతో జిల్లా సూపరింటెండెంట్ బాలాజీ శరవణన్ రూరల్ డీఎస్పీ సురేష్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహిళ బంధువులే ఈ హత్యలకు పాల్పడ్డారని తేలింది. ప్రస్తుతం పోలీసులు హంతకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాయుకాలుష్యం కారణంగానే సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే టైంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్ నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకల్ని నిషేధించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3లో భాగంగా శీతాకాలంలో వాయుకాలుష్యాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 402 పాయింట్ల వద్ద ఉంది.
పుదుచ్చేరి వద్ద సముద్రం నీరు ఎర్రని రంగులోకి మారడం స్థానికులు, పర్యాటకులకు ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగైదు రోజులుగా సముద్రపు నీటిలో రంగుమార్పుతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎందుకిలా జరుగుతోందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు. ఈ మార్పులపై కొందరు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగుమారిన సముద్రపు నీటి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల విశాఖపట్నం బీచ్ వద్ద కూడా సముద్రపు నీరు నల్లగా మారడంతో కలకలం రేగింది. తమిళనాడులోని పలు బీచ్‌ల్లోనూ సముద్రపు నీటి రంగు మారడం చర్చనీయాంశంగా మారింది. శాస్త్రవేత్తల ప్రకారం, నీటిలో ఆల్గే వంటి సూక్ష్మజీవులు ఉన్నా లేదా ఇతర పరార్థాలు ఉన్నా రంగు మారే అవకాశం ఉందని అంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కూడా సముద్రపు నీటి రంగు మారే అవకాశం ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో తేలిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 283 పాయింట్లు నష్టపోయి 63,591 వద్ద స్థిరపడింది. 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 18,989 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ బ్యాంక్ 109 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఆటోషేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్లలో ఉన్న ప్రతికూల సంకేతాలు ఇక్కడి మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఫలితంగా మార్కెట్ల ఆరంభంలో కాస్త లాభాలు కనిపించినా ఇంట్రాడేలో నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్లు ముగిసే వరకు అదే పరిస్థితి కొనసాగింది. అదానీకి చెందిన పలు కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఆసియన్ పెయింట్స్, అదాని పోర్ట్స్ ఎక్కువగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజిలో జిందాల్ స్టీల్ అండ్ పవర్, నాట్కో ఫార్మా, కేర్ రేటింగ్స్, డీసీఎం శ్రీరాం, స్టార్ హెల్త్ బాగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఇంత నష్టాల్లో కూడా కొన్ని కంపెనీ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలో సన్ ఫార్మా, భారత్ పెట్రోలియం, హిండాల్కో, బజాజ్ ఆటో, రిలయన్స్ లాభపడ్డాయి. బీఎస్ఈలో గ్రీన్లాం, క్రెసాండా సొల్యూయన్స్, వొడాఫోన్ ఐడియా, బ్లూస్లార్, గ్రావిటా కంపెనీలు లాభాలను ఆర్జించాయి.




Total views : 194146