తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, మంత్రులకు మధ్య పలు అంశాలపై తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండేళ్లు దాటినా హామీలు అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పి సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని..కానీ ఇప్పుడు ఆ ఫైలు ఎటు పోయిందని ప్రశ్నించారు. తొలి కేబినెట్ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏమైందని అడిగారు. మాయమైన ఆరు గ్యారంటీల ఫైలును వెతికి కనిపెట్టేందుకు ఒక సిట్ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అయితే కేటీఆర్ విమర్శలకు మంత్రి శ్రీధర్‌బాబు ఘాటుగా స్పందించారు. కేటీఆర్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని.. కానీ ఆయన ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ దగ్గరకు కేటీఆర్ ఎన్నిసార్లు వెళ్లారో లెక్క తీయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతామని.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్లా తాము ఢిల్లీకి వెళ్లడం లేదని అన్నారు. కేటీఆర్ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయింది బీఆర్ఎస్ అంటూ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.





Total views : 78927