ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో క్రితంసారి కన్నా 454శాతం ఎక్కువగా నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్, కానుకలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ అంజనీకుమార్తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో సీజ్చేసిన దానికన్నా ఈసారి 248 శాతం ఎక్కువగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇక, 559 శాతం అధికంగా మద్యం, 5,472 శాతం అధికంగా బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు, 5,252 శాతం అధికంగా డ్రగ్స్, 31,440 శాతం అధికంగా కానుకలను సీజ్‌చేసినట్టు వివరించారు. స్వాధీనం చేసుకున్న వీటన్నిటి విలువ 469.63 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.
Cvr telugu news
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రేపు వైన్ షాపులు, బార్లను మూసేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు. విజయోత్సవ ర్యాలీల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈవోతో భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై ఢిల్లీలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. నాలుగు అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. భూ రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ రికార్డులు మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు. సీఈవోను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, ఉత్తమ్, పొంగులేటి ఉన్నారు.
మాజీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాన్నారు. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, తర్వాత దర్గాకు కూడా వెళతానన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని కోరానని తెలిపారు. తన శేష జీవితం ప్రజలకు అంకితమిస్తున్నానన్నారు. నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారన్నారు. తన బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారని.. కొంతమంది ప్రాణ త్యాగాలు కూడా చేశారన్నారు. నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని.. ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా.. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకునన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేట 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర షురూ చేశారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని… ఇక సూట్ కేస్ సర్దుకోవడమేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు హైప్ రావడం వల్ల కేసీఆర్ ను దించే అవకాశం ఆ పార్టీకి వచ్చినందువల్ల ఆ పార్టీకి తాము మద్దతుగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆత్మహత్యా సదృశం అయినప్పటికీ… కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు కాబట్టి… తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అయినా కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలనుకున్నానని తెలిపారు. కేసీఆర్ పై ఎంతో పోరాటం చేసిన తర్వాత మళ్లీ ఆయనతో ఎందుకు కలిశారని ప్రశ్నించారు.
ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల వారిగా ఎలక్షన్ కమీషన్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరగనున్న 49 కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రేపు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
ఇక పోలింగ్ సందర్భంగా రేపు ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశ నిర్దేశం చేశారు. ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 500 పోస్టల్ ఓట్లకు ఒక టేబుల్.. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 లక్షల మంది పోస్టల్ ఓటింగ్ చేయడం జరిగింది. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పఠాన చెరువు, నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేర్లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.రేపు జరుగనున్న కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్… ఎగ్డ్ పోల్స్ ఏం చెబుతున్నా… ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయే తెలియాలంటే రేపు మధ్యాహ్నం వరకూ ఆగాల్సిందే. నవంబర్ 30న జరిగిన ఎన్నికల కౌంటింగ్ రేపు ఉందయం 8 గంటలకు ప్రారంభమౌతాయి….10 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్రెండ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉందనేదానిపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుండగా..అసలైన ఫలితం కోసం నేతలు, రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
గెజిటెడ్ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే బహిరంగ వేదికపై దుర్భాషలాడారు. ఎవడ్రా నువ్వు ఏం తమాషాలు చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. ఇదీ అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆయన ఇలా చిందులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ‘ఆంధ్రప్రదేశకు జగనే ఎందుకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కృష్ణాపురం, పాండ్రంగి తదితర గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాల ఫొటోలు ఎందుకు అప్లోడ్ చేయలేదంటూ మండల వైకాపా అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు ఎంపీడీవో విజయ్ కుమార్ ను ప్రశ్నించారు. ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనకపోవడంతో వాటికి సంబంధించినవి అప్లోడ్ చేయలేదని ఎంపీడీవో సమాధానమిచ్చారు. దాంతో ఎమ్మెల్యే బహిరంగ సభ అని కూడా చూడకుండా అందరి ముందూ ఎంపీడీవో ను నోటికొచ్చినట్లు మాట్లాడారు! ఒక దశలో ఎంపీడీవోపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు వారించారు.
ఇటీవల పాండ్రంగిలో కార్యక్రమం రసాభాస కావడంతో సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారన్నారు. తర్వాత సర్పంచి దాన్ని ఆవిష్కరించడంతో ఆ ఫొటోను సిటిజన్ అవుట్ రీచ్ యాప్‌లో అప్లోడ్ చేశామని, ఆ విషయం సభలో వివరిస్తుండగా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహించారని చెప్పారు.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి దే అని అన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త , అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో కలెక్టర్ గిరీషా పిఎస్ తోపాటు ఉమ్మడి కడప జిల్లాల జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, మునిసిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా ఇతర వైకాపా నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ జాబ్ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి 100 కు పైగా కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం పొందేందుకు నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున తమ అర్హత ప్రమాణాలతో కూడిన సర్టిఫికెట్స్ తో హాజరయ్యారు. జాబ్ మేళాకు హాజరైన వారికి ఎంపి ఎమ్మేల్యే అద్వర్యంలో అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజే ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిలేవుల సుదర్శన్ రెడ్డి, రాయచోటి జడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజు రెహ్మాన్, వ్యవసాయ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు,తో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.





Total views : 90593