అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతీకరమైన లడ్డూలను అయోధ్య రామయ్య సన్నిధికి టీటీడీ అధికారులు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి తిరుపతికి లక్ష లడ్డూలు తరలించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. అయోధ్య లో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఉదయం ఈ విమానం ప్రారంభమవుతుందని. సాయంత్రంలోగా అయోధ్యకు చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.
Devotional#
ఆధునిక నగరమైన బెంగళూరు నగరంలో ఆశ్చర్యపరిచే మిస్టరీలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇక్కడ బయటపడిన 7వేల సంవత్సరాల నాటి నంది తీర్ధంలో నంది నోటి నుంచి నిరంతరం నీరు రావడం విశేషం. బెంగళూరు నగరంలో దాదాపు 7 వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ దక్షిణముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం ఉంది. భారతదేశంలో ఇటీవల కనుగొన్న మర్మ దేవాలయాల్లో ఇది ఒకటి. బెంగళూరు సిటీకు వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని నంది తీర్ధ, నందీశ్వర తీర్ధ, బసవ తీర్ధ లేదా మల్లేశ్వరం నంది గుడి అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మహా శివుడు శివలింగ రూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయానికి కేంద్ర బిందువుగా నంది విగ్రహం ఉంటుంది. ఇది దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే దీనికి దక్షిణ ముఖ నంది అనే పేరు వచ్చింది. ఈ నంది నోటి నుంచి నిరంతరం జలం రావడం ఇక్కడ ప్రత్యేకత. దీన్ని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు. నంది నోటి నుంచి వచ్చిన నీరు ఆలయం మధ్యలో ఉన్న కళ్యాణి అనే మెట్ల తొట్టెలోకి వెళ్తుంది. క్షేత్రం అంటే కన్నడలో స్థలం అని అర్ధం. కొన్ని సందర్భాల్లో చారిత్రక, మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను లేదా ప్రాంతాలను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే పైన చెప్పబడిన ఈ ప్రత్యేకతలు అన్నీ కలిపి ఈ ఆలయానికి అధికారిక నామంగా మారాయి.
ఆలయం చరిత్ర:
1997లో బెంగళూరు నగరంలోని కడు మల్లేశ్వర ఆలయానికి అభిముఖంగా ఉన్న ఖాళీ స్థలంలో ఓ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే తవ్వకాలు చేస్తున్న సమయంలో కార్మికులు ఇక్కడ ఓ ఆలయం ఉన్నట్లు గుర్తించారు. ఇంకాస్త లోతుగా తవ్వగా ఈ శివాలయం బయటపడినట్లు చెబుతారు. భారత పురాతత్వ పరిశోధన శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఆలయం మధ్యలో ఉన్న కొలను, గ్రానైట్ మెట్ల నిర్మాణాలను, మండప స్తంభాలను కనుగొన్నారు. ఈ ఆలయంలో నంది విగ్రహం నోటి నుంచి నిరంతరం వచ్చే జలం ద్వారా శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతుంటుంది. ఈ ఆలయ వయస్సుపై విరుద్దమైన నివేదికలు ఉన్నాయి. ఇది 400 సంవత్సరాల క్రితం నాటిదని కొన్ని నివేదికలు చెబితే, కొన్ని ఆధారాల ప్రకారం ఇది 7000 సంవత్సరాల పూర్వందని చెబుతున్నారు.
ఎందుకంత ప్రత్యేకం:
ఈ ఆలయంలో ప్రత్యేకమైన నంది విగ్రహాన్ని పురావస్తు పరిశోధన శాఖ వారు పరిశీలించారు. నంది నోటి నుంచి నిరాటంకంగా జలం రావడాన్ని గుర్తించారు. ఈ నీరంతా ఆలయం మధ్య భాగంలో ఉన్న కళ్యాణి అనే ప్రదేశానికి వెళ్లి శివలింగంపై పడుతున్నట్లు నిర్ధారించారు. అయితే నంది నోట్లో నుంచి వస్తున్న నీరు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో పరిశోధకులు కనుగొనలేకపోయారు. వృషభావతి నదికి దీనిని జన్మ స్థానంగా భావిస్తారు. చరిత్రలో నంది తీర్ధ ఆలయం చాలా కాలం వినియోగంలో లేకుండా క్రమంగా భూ గర్భంలో కలిసినట్లు చెబుతారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సాధారణ భూస్థాయి కంటే ఈ ఆలయం తక్కువ ఎత్తులో ఉంటుంది. దీనికి తోడు ఆలయంపై గోపుర శిఖరం కూడా లేకపోవడంతో ఇది కాల క్రమంలో ప్రజల దృష్టి నుంచి దూరమైనట్లు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ప్రజలు నివసించారనడానికి, ఈ ఆలయం ప్రజల నుంచి పూజలు అందుకుందని చెప్పడానికి ఆలయంలో ఉన్న కళ్యాణి ప్రదేశం ఒక జ్ఞాపకంగా, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. కాలక్రమంలో బెంగళూరు నగరంలో మల్లేశ్వరం ప్రాంతం నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ప్రముఖమైనదిగా అభివృద్ధి చెందింది. దీంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 1997లో నగరంలో కాస్త ఖాళీగా స్థలంగా ఈ ఆలయం ఉన్న ప్రదేశం కనిపించడంతో ఇక్కడ నిర్మాణాలకు పనులు మొదలయ్యాయి. అయితే ఈ ప్రదేశంలో పురాతన ఆలయం బయట పడడంతో స్థానికుల ఆందోళనల మేరకు దీనిని బయటకు తీసే ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే మట్టి, బురద నుంచి దక్షిణ ముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం బయటపడినట్లు చెబుతారు.
ఈ ఆలయం స్తంభాలతో కూడిన కళ్యాణి ప్రాంగణం చుట్టూ నిర్మించబడింది. సాధారణంగా అన్ని శివలింగ క్షేత్రాల్లో శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం నంది పైన, శివలింగం కింద ఉండడం విశేషం. శివలింగానికి ఎడమ వైపు మూలన చిన్న గణేశుని విగ్రహం ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రధాన విగ్రహానికి కుడి వైపు నవగ్రహ మండపం ఉంటుంది. శివాలయం కావడంతో ఇక్కడ శివుడికి సంబంధించిన ప్రతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసం, మహా శివరాత్రి సమయాల్లో భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. బెంగళూరు ప్రధాన నగరం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయ ప్రాచుర్యం, ప్రత్యేకతలు రోజురోజుకూ విస్తరించడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన మరణించి వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం. భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా. అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
రామానుజాచార్యుల గొప్పదనం:
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు. కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.
ప్రాచుర్యంలోకి రాని రహస్యం:
క్రీస్తు శకం 11 – 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. అయితే రామానుజాచార్యుల మాదిరిగానే 15వ శతాబ్ధంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్ధివ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ అనే చర్చిలో భద్రపరిచారు. గోవాను పోర్చుగీసు వారు పాలిస్తున్న సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మతస్తుడు ఇక్కడ సువార్త వ్యాప్తికి కృషి చేశాడు. ప్రజలకు సహాయం అందిస్తూ క్రైస్తవ మతంపై నమ్మకాన్ని కలిగించాడు. ప్రపంచ వ్యాప్త పర్యటనల్లో భాగంగా మకావూలో క్రైస్తవ మత ప్రచారాలకు వెళ్ళిన ఆయన అక్కడ మరణించడంతో ఆ శరీరాన్ని గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ చర్చికి తరలించారు. క్రైస్తవ మత వ్యాప్తిలో జేవియర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన శరీరాన్ని ఓ గాజు పెట్టెలో ప్రత్యేక మూలికలతో కుళ్లిపోకుండా భద్రపరిచారు. దీంతో ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. గోవా పర్యాటకంలో ఇది ఒక ముఖ్యమైన సందర్శనీయ స్థలంగా పేరుగాంచింది. అయితే ఈ ప్రదేశానికి వచ్చిన ప్రాచుర్యం దీనికి ముందే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం లభించలేదు. అందుకే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి.
Read Also..
Read Also..
భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు. సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి, అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాధున్ని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు.
ప్రాణ వాయు శివలింగం:
శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణ వాయులింగంగా పూజాలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరున్ని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు.
శ్రీకాళహస్తి విశేషాలు:
శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కధనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తిక్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహా భాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరున్ని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతిపురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకూ అడుగడుగునా ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.
Read Also..
Read Also..
కాకులు వాలని కోటప్ప కొండ ఎక్కడుందో తెలుసా.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటి. శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం విశేషం. ఒక కొత్త ప్రదేశం గురించి తెలుకున్నప్పుడు, అక్కడి విశేషాలను అందరి నోటా విన్నప్పుడు అక్కడికి ఒక్కసారైనా వెళ్లాలని అనిపించక మానదు. ఆ విన్న మాటలు అక్కడికి వెళ్లి చూశాక నిజమే అనిపిస్తే ఆ ఆశ్చర్యానికి అవధులు ఉండవు. మన చుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. కానీ వాటిని గుర్తించడం, వాటి గురించి తెలుసుకోవడంలోనే కొంత ఆలస్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ అద్భుతమైన ప్రాంతం గురించి ఆలస్యం లేకుండా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును! ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ గుంటూరు జిల్లా నరసరావు పేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు. ఇప్పటి వరకూ ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి.
కోటప్ప కొండ చరిత్ర:
దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞాన బోధ చేయమని కోరుతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్లి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలవబడుతుంది. కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామి వారిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు. త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరున్ని దర్శించి సేవిస్తాడు. ఆ తరువాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు. ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది. అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. ఆమె రోజూ రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్ధనలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించ దలచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్నా పరమేశ్వరున్ని కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావడం మానేది కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కధనం. ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు. గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరున్ని ఓ కోరిక కోరుతుంది. తాను కొండ ఎక్కలేకపోతున్నాని, నీవే కిందికి రావాలని కోరడంతో పరమ శివుడు సరే అంటాడు. కానీ నీవు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు. కొంత దూరం వెళ్లిన తరువాత భీకరమైన శబ్ధాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగందేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది. గొల్లభామ ఆలయం కొండ కింది భాగంలో చూడవచ్చు.
కోటప్ప కొండ విశేషాలు:
మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్లి త్రికుటేశ్వరున్ని సేవించాలని అంటారు. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి.
ఎలా చేరుకోవాలి:
కోటప్ప కొండ గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరంలో, నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి కారు, బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు గుంటూరు రైల్వే స్టేషన్ లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్ప కొండకు వెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటిగా నిలుస్తుంది.
మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది. కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మధనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం విశేషం. ఎన్నో అరుదైన ప్రదేశాలకు, విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఇక్కడి అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి. ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం ‘శ్రీకూర్మం’. మహావిష్ణువు కూర్మ రూపంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాధస్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకూ ఇక్కడ ప్రతీదీ ప్రత్యేకమే. అసలు శ్రీకూర్మం యొక్క చరిత్ర ఏమిటి? అక్కడి విశేషాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకూర్మం చరిత్ర:
శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. కానీ పురాణాల కధనం ఈ విధంగా ఉంది. పూర్వం శ్వేతచక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురమనే పట్టణంను పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. ఓ వైపు భర్త.. మరో వైపు భక్తి.. ఈ సంకట స్థితి నుంచి తనను బయట పడేయాలని విష్ణువును వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మరూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆడుకోమని ప్రార్ధిస్తుంది. ఆమె మొర విన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజు వైపు రావడంతో అతడు భయంతో పరుగిడి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణ్యమని దుఖిఃస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు. ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటూ విష్ణువును పూజించగా ఓ రోజు మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్ధ గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగము చేసి ఓ వటవృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కూర్మగుండంను సృష్టిస్తాడు. చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్ష్యమైన శ్రీమహాలక్ష్మితో కలిసి లక్ష్మి సమేత శ్రీకూర్మనాధునిగా స్వామి వారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు.
ఆలయానికి శాపం:
ద్వాపర యుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన బైరవుడు ఆయనను లోనికి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు.
ఆలయ విశిష్టతలు:
శ్రీకూర్మంలో స్వామి వారి విగ్రహం పడమటి ముఖంగా ఉండడం విశేషం. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్ధానికి ముందే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. కళింగ, ఆంధ్ర, చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. 7వ శతాబ్ధం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు. గాంధర్వ శిల్ప సంపాద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు, కీర్తిని చాటిచెబుతాయి. ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. అద్భుతమైన వాస్తు కళతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏక శిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటికి ఒక దానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం. ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాధస్వామి దర్శనమిస్తారు. అడుగు ఎత్తు, ఐదడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో స్వామి వారి విగ్రహం ఉంటుంది. నిత్యం స్వామి వారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పూతతో కనిపిస్తుంది. ఆలయ పరిసరాల్లో శ్రీవరదరాజ స్వామి, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉంటాయి.
ఆలయ ప్రత్యేకతలు:
విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాశికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఎలా వెళ్లాలి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది. ఇతరాల రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి విమానమార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. విశాఖ నుంచి శ్రీకూర్మం 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళం పట్టణం నుంచి ప్రతి 15 నిమిషాలకు ఇక్కడికి బస్సు రవాణా సౌకర్యం కలదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. బస్సు, ఆటోలు, ట్యాక్సీల ద్వారా పర్యాటకులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చెన్నై నుండి సుమారు 400 కి.మీ ల దూరంలో వుంది. తమిళనాడులోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం మదురై లో కల వేగాయి నది ఒడ్డున కలదు. మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైనవాటికి నిలయంగా వుంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు తమ తమ కళాభిరుచులకు తగినట్లు నిర్మించారు. ఈ పట్టణం అనేక చారిత్రక కధలు కలిగి ఎంతో ప్రాధాన్య సంతరించుకొన్నది. భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. ఇంతటి గొప్పదైన మదురై పట్టణం లోని కొన్నిపర్యాటక ఆకర్షణలు పరిశీలించండి.అలగిర్ కోవిల్ అలగిర్ కోవిల్ అనే ఈ దేవాలయం నగరానికి సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు. మదురై లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఎత్తైన గోపురాలు అనేక ప్రేమ మరియు మానవతల దృశ్యాల శిల్పాలు కలిగి ఆకర్షణీయంగా వుంటాయి. కళలకు సంస్కృతికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ టెంపుల్ యొక్క ప్రధాన గోపురం ఎల్లపుడూ మూసి వుంచి, సంవత్సరానికి ఒక సారి తెరుస్తారు. ప్రవేశ ద్వారాన్ని మాత్రమే భక్తులు పూజిస్తారు. మీనాక్షి దేవత అసలు ఎవరు ? మీనాక్షి మాత, రాజు మలయద్వాజ పాండ్య కుమార్తె. ఆమె ఒక యజ్ఞం చేయగా అగ్ని నుండి ఆవిర్భవించినది. ఆమె పుట్టినప్పుడు మూడు స్థనాలు కలిగి వుందని, అందుకు రాజు చిన్తిన్చ గా ఆమెకు వివాహం అయిన వెంటనే, మూడవ స్థనము మాయం అవుతుందని ఆకాశవాణి పేర్కొని, ఆమెను ఒక యువ రాణి వలే కాక, ఒక రాజ కుమారుడిగా పెంచవలసినది గా కోరింది. ఆ రకంగా మాత మీనాక్షి యుద్ధ విద్యలు నేర్ప బడి పట్టాభిషేకం చేయబడి రాజ్యం అప్పగించబడినది. ఆమె అనేక యద్ధాలు గెలిచింది. చివరకు శివుడితో యుద్ధానికి సనద్ధమై, యుద్ధ భూమిలో ఆయనే తన భర్తగా గుర్తించినది. ఎత్తైన గోపురాలు ఈ టెంపుల్ గురించి పురాతన తమిళ సాహిత్యంలో కూడా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత టెంపుల్ మాత్రం క్రీ. శ. 1623 – 1655 ల మధ్య నిర్మించబడి నట్లు చరిత్ర చెపుతోంది. ఈ దేవాలయానికి 14 గోపురాలు కలవు. ఇవి సుమారుగా 45 – 50 మీటర్ల ఎత్తులో వుంటాయి. ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు ఈ దేవాలయంలో ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు. ఈమెను పార్వతి అవతారంగాను ఈమె సహచరుడైన సుందరేస్వరుడిని శివుడిగాను కొలుస్తారు. సుమారు 2,500 సంవత్సరాల కిందటిదిగా చెప్పబడే మదురై పట్టణానికి ఈ దేవాలయం ప్రధానమైనది.
Read Also..
Read Also..
కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి.కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి. ఆ గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఉండేవారు. వారు పుట్టుకతో మూగ చెవుడు గుడ్డివారు. ఇన్ని వైకల్యాలున్నా చక్కగా వ్యవసాయం చేసేవారు. స్వయంగా బావి తవ్వి మోట కొట్టి సాగుచేసుకునేవారు.ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీళ్లు తగ్గాయి. దీంతో బావి మరింత తవ్వాలని నిర్ణయించుకున్నారు. తవ్వుతున్నప్పుడు ఠంగ్మనే శబ్దం వినిపించింది. పరిశీలిస్తే బావిలో పెద్ద రాయి. దానిని తొలగించడానికి గడ్డపార దెబ్బ వేయగా దాంట్లో నుంచి రక్తం పైకి ఎగిసింది. రక్తం ఆ ముగ్గురి స్నేహితులపై పడగానే వారి వైకల్యం పోయిందట. ఆ నోటా ఈ నోటా విషయం ఊరంతా తెలియడంతో బావిని మరింత లోతుకు తవ్వారు. అప్పుడు గణనాథుడి విగ్రహం బయల్పడింది. భక్తి పారవశ్యంతో ప్రజలు కొబ్బరికాయలను సమర్పించారు. వీటిలో విశేషంగా పగిలిన కొబ్బరికాయల నీటి ద్వారా ఆ ముగ్గురు సోదరులు నిలుచున్న భూమి అంతా ప్రవహించింది. అలా ఈ స్థలానికి కాణి పారడం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే కాణిపాకంగా మారింది. కులోత్తుంగ చోళుడనే రాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇక అప్పటి నుంచి బావిలోని వినాయకుడు పెరుగుతున్నాడని భక్తులు అంటున్నారు. దీనికి సాక్ష్యం వినాయకుడు ధరించిన వెండి కవచాలు సరిపోకపోవడమే. ఇప్పటికి మూడుసార్లు వెండి కవచాలు మార్చినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ఈ ఆలయం సత్యప్రమాణాలకు నెలవుగా భాసిల్లుతున్నది. వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎలాంటి వివాదాలు వచ్చినా.. నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వ నిరూపణకు ఈ క్షేత్రమే కేంద్రం అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేసే ఆనవాయితీ కొనసాగింది. ప్రతియేటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వినాయకచవితి రోజే ప్రారంభమవుతాయి. అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మాది దేవతలు వచ్చి ముద్దుల గణపతిని దర్శించుకొని వెళ్తారని భక్తుల నమ్మకం.
అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం, కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ, అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై, కావల్సినవన్నింటినీ సమకూర్చి, మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి, పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు. అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి,వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి,చివరికంటా గమ్యం చేరుస్తారు. తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు. ఇప్పుడు ఆ మహనీయుడు చేసిన ఒక అద్భుతమైన లీలను స్మరించుకుందాం. పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమంగా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకములైన మందులను వాడాడు, ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని ” ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు” అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు. అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు. అందుకు నానా ” అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే” అని సమాధానమిచ్చాడు. అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మశిదులో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు. ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బాబా ఖచ్చితంగా చేప్పేసారు.ఆ మాటలకు హతాశుడైన భీమాజీ తనకు వెరే దిక్కు లేదని, సాయి కల్పించుకోకపోతే ఇక మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరుగా సాయిని ప్రార్ధించాడు. అతని పరుశుద్ధమైన ప్రార్ధనకు బాబా హృదయం కరిగింది. అపుడు భీమాజీతో సాయి” ఊరుకో. నీ అతృతలను పారద్రోలుము. నీకష్టముల్లనీ గట్టెక్కే సమయం వచ్చింది. ఎంతటి బాధలునవారైనా తల్లి వంటి ఈ మశీదు మెట్లెక్కితే వారి కష్టములనీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీస్తాయి. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయామయుడు. నీ రోగమును తప్పక బాగు చేయును” అని ప్రేమపూర్వక పలుకులను పలికారు. ఆ కమ్మని పలుకులతో భీమాజీకి కొండంత ఊరట కలిగినట్టయ్యింది. అప్పటి వరకూ ప్రతీ అయిదు నిమిషాలకూ రక్తం కక్కుతున్న అతను సాయి సుముఖంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. సాయి వానికి నిన్ను కాపాడుతాను అని దయతో అభయం ఇచ్చినప్పటినుండి భీమాజి జబ్బు నయమవడం ఆరంభించింది. అతనిని భీమాభాయి అను వారి ఇంట వుంచమని సాయి సలహా ఇచ్చారు. ఆ ఇంటికి గాలీ, వెలుతురూ సరిగ్గా వుండక ఏమంత సౌకర్యంగా వుండదు. క్షయ రోగంతో బాధపడు వారికి ఆ ఇల్లు అసలు పనికిరాదు. కాని సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. ఆ రాత్రి అతనికి రెండు స్వప్నములు వచ్చాయి. మొదటి స్వప్నములో భీమాజి ఒక పాఠశాల విద్యార్ధిగా వున్నాడు. టీచరు చెప్పిన పద్యములను కంఠస్తం చేయకపోవడం వలన టిచరు గారు అతడిని తీవ్రంగా దెబ్బలు కొట్టారు.రెండవ స్వప్నంలోగుర్తు తెలియని వ్యక్తులు కొందరు భీమాజి చాతిపై పెద్ద బండను వేసి కిందకూ, మీదకు తొక్కడం వలన చాతిలో నొప్పి ఎక్కువగా వచ్చి భీమాజీ తీవ్రమైన బాధను అనుభవించాడు. కలలో పడిన ఈ బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది. కొద్ది రోజులలోనే శ్రీ సాయి యొక్క ఊదీ ప్రసాదాలను తీసుకొని ఆనందంగా తన బంధువులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. సాయినాధులు తనకు చేసిన ఈ మేలును మరువక ప్రతీ నెలా శ్రీ సాయి సత్య వ్రతం అనే వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోసాగాడు. ఈ విధంగా శ్రీ సాయినాధుల తమదైన శైలిలో తన భక్తుని వ్యాధిని తగ్గించి వేసారు. సాయి తాను తన భక్తులకు చేసిన మేలుకు ప్రతిఫలముగా ఏమీ ఆశించేవారు కాదు.వార్కి కావలసింది భక్తులు తాము పొందిన మేలును గుర్తుంచుకొని తనపై అచంచలమైన నమ్మకం కలిగి వుండడమే ! తనకు సర్వస్య శరణాగతి చేసిన భీమాజీ యొక్క కిందటి జన్మలో చేసుకున్న ప్రారబ్ద కర్మలను సైతం తప్పించి,మందులు ఆపరేషన్ లు లేకుండా కేవలం స్వప్నానుభవములతో అతి దుర్లభమైన అతని వ్యాధిని తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని గావించి తదనంతరం సుఖవంతమైన నూతన జీవితం ప్రసాదించిన కరుణా మూర్తి శ్రీ సాయి. సాయి కరుణను, అపారమైన అనుగ్రహమును పొందాలంటే ఆడంబరమైన భజనలు, ఆర్భాటమైన పూజలు, యజ్ఞ యాగాదులు అవసరం లేదు. పరిశుద్ధమైన మనస్సు, ఇచ్చేది, పుచ్చుకునేది ఆ సాయియే అన్న ధృఢమైన నమ్మకం చాలు.
Read Also..
Read Also..
ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనమాల దీక్ష ఈరోజు నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 41 రోజులు, అలాగే 32 రోజుల దీక్ష తీసుకునే వారికి జనవరి ఆరో తారీకున ముగిస్తుందని, ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ మరియు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా స్వామివారి భక్తులు చందనమాలను వేసుకోవడానికి భారీగా తరలివచ్చారు. స్వామి వారి దీక్ష తీసుకున్న వారందరికీ ప్రత్యేక దర్శనం, బిక్ష ఏర్పాటు చేశామని, అలాగే దీక్ష తీసుకున్న వారికి స్వామి వారి కండువా ప్రతిమ, పంచ మహిళలకు చీరా, రవికా అందిస్తూ స్వామివారి దీక్షని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామంటున్న సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
Read Also..
Read Also..





Total views : 90144