భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది. సంబంధిత ఒప్పంద పత్రాలపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు, అటవీ అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం కమొడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్‌దాస్, సీఎస్ శాంతికుమారి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ పాల్గొన్నారు. వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భూముల కోసం 2010 నుంచి నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఈ విషయం తాజాగా పరిష్కారమైందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలో మొదటి వీఎల్ఎఫ్ కేంద్రం. ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలందిస్తోంది. ఈ అటవీప్రాంతంలో ఉన్న ఆలయానికి భక్తుల రాకపోకలను అనుమతించేందుకు నౌకాదళం అంగీకరించింది.
international news
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నారని.. అలాంటప్పుడు మేం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా తన గన్మెన్లను కుదించడం పట్ల… వారి పనివేళల్లో మార్పుల పట్ల ఇంటెలిజెన్స్ ఐజీని కలిసినట్లు తెలిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రిని కలిశామన్నారు. ఇలా కలవడంలో తప్పేముంది? అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు కలిసినట్లు తెలిపారు. అలాగే ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. సీఎంను కలిసినంత మాత్రాన తమ నలుగురు ఎమ్మెల్యేలపై బురదజల్లడం మానుకోవాలని కోరారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని… మెదక్‌లోను పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో ధరణి పోర్టల్ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది. కలెక్టర్లతో సమావేశమైన కమిటీ.. పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని గుర్తించింది. 35 మ్యాడ్యూల్స్ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది. 18లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా.. 23 లక్షల ఎకరాలు పార్ట్-బిలో ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ… ఈనెల 27న గిరిజన, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది. భూ రికార్డులను కంప్యూటరీకరణ చేసిన గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చింది. సంకల్పం గొప్పదైనా.. ఆచరణలో మాత్రం ఇబ్బందులు వచ్చాయి. ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని.. దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడగానే ధరణి పోర్టల్ వ్యవస్థపై అధ్యయనానికి కమిటీని వేసింది. నాలుగుసార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ అమలులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైంది. కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి తెచ్చారని కమిటీ పేర్కొంది. తెలంగాణలో భూసమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని..చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ధరణి పోర్టల్ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది.
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
భారతమాల, రీజినల్ రింగ్ రోడ్ RRR భూసేకరణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ త్వరిగతిన పూర్తి చేయాలని లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు -RRR భూసేకరణ కోసం NHAI కి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి …సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. RRR భూసేకరణ కోసం నాయ్ కు 50 శాతం నిధులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్ర – కర్ణాటక ప్రభుత్వాలతో కలిపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తానని మంత్రి తుమ్మల రైతులకు హామి ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండలం, అల్లిపల్లి గ్రామంలో ఆంధ్ర పామాయిల్ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి నిర్ణయాల వల్ల పామాయిల్ రైతాంగానికి అపార నష్టం వస్తుందని రైతులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న12 వేల చిల్లర ధర.. గిట్టుబాటు కావడం లేదని లేబర్ కాస్ట్ , ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరిగిపోవడంతో కనీసం 18 వేలకు మద్దతు ధర అయితే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కేంద్రంపై పోరాడితే సరిపోదని తెలంగాణ, కర్ణాటక కూడా సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారని తుమ్మల అన్నారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా విమానం కుప్పకూలింది. అందులో 74 మంది ప్రయాణిస్తున్నారు. ఈ సైనిక రవాణా విమానంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి గల కారణాలను గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి వెళ్తోందని తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి ముందు విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోయింది. తర్వాత విమానం నివాసప్రాంతాల వద్ద నేలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. అయితే ఆ విమానాన్ని తమ రక్షణ బలగాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌లోని స్థానిక మీడియా తెలిపింది. అందులో రష్యా క్షిపణులను తరలిస్తోందని, యుద్ధ ఖైదీలను కాదని పేర్కొంది. కానీ రష్యా మాత్రం అందులో ఉన్నది యుద్ధ ఖైదీలేనని చెబుతుండటం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని.. మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలని అమలు చేయకపోతే బట్టలు విప్పి కాంగ్రెస్ నేతలను నడిరోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల పేరుతో హామీల అమలును వాయిదా వేయాలని చూస్తోందని.. ఎంపీ ఎన్నికలకు ముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పెద్ద ఓటమేమి కాదని.. 39 సీట్లు రావడం చిన్న విషయం కాదని అభిప్రయపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని.. కేసులకు ఎవరూ భయపడొద్దని, తాము అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు.
ఏ లక్ష్యం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో 20 రోజుల్లో మూడేళ్లు అవుతుందని… అప్పటి నుంచి నా రాజీనామా ఆమోదించకుండా.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నా రాజీనామాను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని గంటా మండిపడ్డారు. రాజ్యసభలో నా ఓటు హక్కు వినియోగించుకుంటానని, దీనికోసం న్యాయ పోరాటం చేస్తానన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తున్నాయని మండిపడ్డారు.. నన్ను అడగకుండా రాజీనామాను ఆమోదించారని, కుట్ర కోణంతో వైసీపీ పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ కు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ముందా అంటూ గంటా ప్రశ్నించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు.
అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు తెలిపారు. మా పార్టీకి, అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉందని… కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరేందుకేనని అనడం ఎంతవరకు సమంజసమని కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. మా నియోజకవర్గంలోని ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రిని కలిశామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరో వందసార్లు కలుస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. తాను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలో అని, చనిపోయేంత వరకూ పార్టీలోనే కొనసాగుతానని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తమకు లేవని తేల్చి చెప్పారు.