తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో చెత్త సెగలు రేపుతోంది.. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ చెత్త తెలంగాణ సరిహద్దు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది..ఆ చెత్త కంపు వల్ల రోగాల బారిన పడుతున్నామని తెలంగాణ సరిహద్దు గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి.. కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో నెలకొన్న డంపింగ్ యార్డ్ ఇష్యూపై సివిఆర్ న్యూస్ స్పెషల్ ఫోకస్…
తెలంగాణ-కర్ణాటక బోర్డర్‌లోని న్యాల్కల్ మండలం మల్గి గ్రామ సరిహద్దులో గాలి పీల్చాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు..గత కొన్ని రోజులుగా కంటి నిండా నిద్రలేదు.. ఒంటి నిండా రోగాలతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామస్తులు గత కొద్ది రోజులుగా నరకం చూస్తున్నారు.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నగరం నుంచి వందలాది టన్నుల వ్యర్థాలను తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ఆనుకుని ఉన్న సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డ్‌లో పారబోస్తుండటంతో పర్యావరణం కలుషితమవుతోందనీ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కర్ణాటకలోని బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజూ తరలిస్తున్న టన్నుల కొద్దీ చెత్తతో ఈ ప్రాంతం డెత్ జోన్‌గా మారుతోంది.
బీదర్ నగరానికి చెందిన సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డ్ సరిగ్గా తెలంగాణ బోర్డర్ గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. నిబంధనల ప్రకారం రీసైక్లింగ్ చేయాల్సిన మున్సిపాలిటీ.. ఇక్కడ బహిరంగంగా చెత్తను తగలబెడుతోంది..ఆ విషపూరిత పొగ,దుర్వాసన న్యాల్కల్ మండలంలోని గ్రామాలను కమ్మేస్తోంది..ఈగలు, దోమల తాకిడి పెరిగి చిన్నపిల్లలు, వృద్ధులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రతిరోజూ బీదర్ మున్సిపాలిటీ నుంచి సుమారు 40 టన్నులకు పైగా చెత్త సేకరించి సరిహద్దు గ్రామమైన సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. అయితే, ఈ వాహనాలన్నీ తెలంగాణ పరిధిలోని మల్గి గ్రామం మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. తరలింపు సమయంలో వాహనాల నుంచి కుళ్ళిన మురుగునీరు రోడ్లపై కారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు, సుల్తాన్‌పూర్ డంపింగ్ యార్డులో నిబంధనలకు విరుద్ధంగా చెత్తను తగలబెడుతుండటంతో ఆ విషపూరితమైన పొగ మల్గి పరిసర గ్రామాలను పూర్తిగా కమ్మేస్తోంది…
గత వారం రోజులుగా మల్గి గ్రామస్తులు ఈ దారి గుండా ఒక్క చెత్త బండిని కూడా పోనివ్వకుండా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు..బీదర్ మున్సిపాలిటీ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం సుల్తాన్‌పూర్ లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తామని ఏళ్ల క్రితం ప్రకటించినా,అది నేటికీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు..ఫలితంగా పొరుగు రాష్ట్రం చేస్తున్న పర్యావరణ నేరానికి తెలంగాణ సరిహద్దు ప్రజలు బలిపశువులవుతున్నారు. ఇప్పటికైనా సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని, మల్గి గ్రామం మీదుగా చెత్త తరలింపును శాశ్వతంగా అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..



Total views : 92225