వైసీపీని 11 అనే నెంబర్ వదలడం లేదు. ఇప్పటికే 11 అనే అంకె ఆ పార్టీని పీడకలలా వెంటాడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనంలో కూడా అదే నంబర్ ఎదురవ్వడం వైసీపీ ఎంపీలను షాక్‌కు గురిచేసింది. పార్లమెంటులో పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ కార్యాలయం గదులను కేటాయిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీల కోసం మొదటి అంతస్తులో 11వ నంబర్ గదిని కేటాయించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా కంగారుపడ్డారు. బయట ఇప్పటికే 11 అంటూ ఎగతాళి చేస్తున్నారని.. ఇప్పుడు ఇక్కడ కూడా అదే నంబర్ ఉంటే తమ పరిస్థితి ఏంటని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముందు వైసీపీ ఎంపీలు గోడు వెల్లబోసుకున్నారట.
వైసీపీకి కేటాయించిన 11వ నంబర్ గదిని మార్చాలని కోరుతూ ఎంపీలు విజ్ఞప్తి చేయగా, స్పీకర్ తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గది నెంబర్ మార్చడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించగా… ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ అంకె తమకు కలిసి రావడం లేదని, సెంటిమెంట్ పరంగా ఇబ్బందిగా ఉందని వారు వివరించారు. వైసీపీ ఎంపీల విన్నపాన్ని విన్న స్పీకర్, వారి సెంటిమెంట్ తిప్పలు చూసి జాలిపడ్డారు. చివరికి 11వ నంబర్ గదిని మార్చి, పక్కనే ఉన్న 12వ నంబర్ రూమ్‌ను కేటాయించారు. దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ఒకప్పుడు 151 సీట్లతో రికార్డు సృష్టించిన పార్టీ, ఇప్పుడు 11 అనే అంకెను చూసి భయపడటం విచిత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నంబర్ మార్చినంత మాత్రాన తలరాత మారుతుందా అని ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు.