Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Latest News అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా.

అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా.

by CVR NEWS
అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా

ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తున్నదని.. ఇకపై అత్యాధునిక విమానాలు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఏరోమార్ట్ హైదరాబాద్-2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నదని.. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా అని స్పష్టం చేశారు. సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు ప్రత్యక్ష అనుభవం ఉన్నదన్నారు. చిన్న విడిభాగం లోపం సైతం మిషన్‌ మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని.. అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు తెలంగాణలోనే తయారవుతున్నాయని తెలిపారు.

మేడ్ ఇన్ తెలంగాణ అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతున్నదని పేర్కొన్నారు. స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఎయిరో, కెనడాకు చెందిన ఎఫ్‌టీజీ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఫ్రాన్స్, ఇటలీ సహా 25కిపైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్‌లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 15 వందలకు పైగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్‌ఎంఈలు పనిచేస్తున్నాయని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక పార్కులు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు. డీఆర్‌డీఓ, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రైవేట్ పరిశ్రమలు ఒకే నగరంలో ఉండటం హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని కల్పించిందన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: