బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ముంబైలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఇది ఆమిర్ ఖాన్‌కు మూడో వివాహం. ఈ వేడుకలో ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ క్రీమ్, లేత గోధుమ రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. వివాహ పత్రాలపై ఆమిర్ సంతకం చేస్తున్న ఫోటోను ఆయన ప్రతినిధి విడుదల చేశారు. ఈ పెళ్లికి ఆమిర్ మొదటి భార్య పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్‌తో పాటు, రెండో భార్య కుమారుడు ఆజాద్ రావు ఖాన్ కూడా హాజరయ్యారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా, దర్శకుడు అశుతోష్ గోవారికర్, నటుడు వీర్ దాస్, రాజకీయ నాయకుడు రాజ్ థాకరే వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ ఏడాది మార్చిలో తన 60వ పుట్టినరోజున గౌరీతో పెళ్లి విషయాన్ని ఆమిర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. జులై 5న ఇంట్లోనే చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నామని… ఇరు కుటుంబాలు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరవుతారు అని ఆయన అప్పుడు తెలిపారు. ఆమిర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకుని, 2002లో విడిపోయారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకుని, 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక గౌరీ స్ప్రాట్ ఫ్యాషన్ రంగంలో పనిచేశారు. గతంలో ఆమెకు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. గౌరీ, తాను 25 ఏళ్లుగా స్నేహితులమని, ఇటీవలే ప్రేమలో పడ్డామని అమీర్ కొంతకాలం కిందట వెల్లడించారు.





Total views : 193125