Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

by CVR NEWS
పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు

గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరినప్పుడు గోదావరి ప్రవాహం వెనక్కి తన్నే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో గోదావరిలో కలిసే కిన్నెరసాని, ముర్రేడువాగు వంటి ఉపనదుల నీరు బయటకు వెళ్లక బూర్గంపాడు పరిసరాల్లోనే నిలిచిపోతుందని అంచనా. భారీ వరదల సమయంలో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలు, పోలవరం పూర్తి స్థాయిలో నిండితే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని చెబుతున్నారు. కేవలం 150 అడుగుల కాంటూర్ వరకే కాకుండా, వరద ఉధృతి కారణంగా 160 అడుగుల ఎత్తు వరకు కూడా ముంపు ప్రభావం ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. దీని వల్ల పంట పొలాలు, నివాస గృహాలు, గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది.

ముంపు ముప్పు నుంచి బూర్గంపాడు మండలం ను రక్షించేందుకు అధికారులు భారీ కరకట్టల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 51 మీటర్ల ఎత్తుతో, 11.64 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మాణానికి రూ.789 కోట్ల అంచనాతో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కానీ నిధుల మంజూరు, భూసేకరణ, నిర్మాణ ప్రక్రియలపై ఇంకా స్పష్టత లేకపోవడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. మరోవైపు ముంపు గ్రామాలపై క్షేత్రస్థాయి సర్వే కూడా పూర్తిగా జరగలేదని స్థానికులు చెబుతున్నారు. మ్యాపుల్లో గీసిన కాంటూర్ లైన్లకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఏయే గ్రామాలు ముంపులోకి వస్తున్నాయో భౌతిక గుర్తులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల తమ భవిష్యత్తుపై ప్రజల్లో అయోమయం నెలకొంది . తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు , పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కలిసి సంయుక్త సర్వే చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మరో వైపు పోలవరం ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజల పునరావాసం కూడా ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది. పూర్తిగా నీటిలో మునిగే లోతట్టు గ్రామాల ప్రజలకు మెరక ప్రాంతాల్లో శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, విద్యుత్, వైద్యం, విద్య , ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకో వైపు రైతులు తమ పంట భూములు కోల్పోయే ప్రమాదం ఉందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చట్టప్రకారం సరైన నష్టపరిహారం చెల్లించి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. గోదావరి వరదల సమయంలో ఉపనదుల నీటిని బయటకు పంపేందుకు భారీ మోటార్ పంపింగ్ వ్యవస్థలు సిద్ధం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలానికి ముందే బఫర్ స్టాక్ కేంద్రాల్లో ఆహారం, మందులు, అత్యవసర వస్తువులు సిద్ధంగా ఉంచి ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు ను రెండు దశల నీటి నిల్వ సామర్థ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల వరకు నీటి మట్టాన్ని పెంచే ప్రణాళిక ఉంది. అయితే మొదటి దశ నుంచే బూర్గంపాడు మండలం పై ముంపు ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యపై తగిన శ్రద్ధ చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల సమయంలో తాత్కాలిక సహాయక చర్యలకే పరిమితం కాకుండా, శాశ్వత రక్షణ ప్రణాళికను అమలు చేయాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా కరకట్టల నిర్మాణం, పంపింగ్ స్టేషన్లు, పునరావాస కాలనీలు, అత్యవసర హెచ్చరిక వ్యవస్థలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముంపు తీవ్రత ఎంత ఉంటుందో స్పష్టత లేక ప్రజలు ప్రతీ వర్షాకాలంలో భయాందోళనల మధ్య జీవిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి శాస్త్రీయ అధ్యయనాలతో కూడిన సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: