ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇస్కాన్‌టెంపుల్ ఆధ్వర్యంలో జులై 16న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. రాఘవకల్యాణ మండపం షార్ బస్టాండ్ నుంచి మొదలై రాత్రి 9 గంటలకు శ్రీనగర్ కాలనీకి చేరుకుంటుంది. ఇస్కాన్ స్వాములు ముఖ్య అతిథిగా పాల్గొని వారి సందేశాన్ని అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి సూళ్లూరుపేట పుర ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాధుని కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు తెలిపారు.
Devotional
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వైభవానికి తగిన విధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను అధికారికంగా ప్రారంభించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో చేపట్టనున్న విస్తరణ, అభివృద్ధి పనులకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం దేవస్థానం రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని ఎమ్మెల్యే వెంకట్రావు అన్నారు. ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమన్వయం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన చోటుచేసుకుంది.భీమవరం మండలం వెంప గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.హోమాలు కొనసాగుతున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ వానరం నేరుగా ఆలయంలోకి ప్రవేశించింది. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా గర్భగుడి ముందు ప్రశాంతంగా కూర్చుని హోమాలు పూర్తయ్యే వరకు పూజా కార్యక్రమాలను తిలకించింది.ఈ దృశ్యాలను చూసిన భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక హోమాలకు స్వయంగా ఆంజనేయస్వామి విచ్చేశారంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చూస్తున్నంతలోనే మళ్లీ వినాయక చవితి వచ్చేస్తోంది. గణేష్ మహరాజ్‌కీ జై అనే నినాదాలతో మార్మోగేందుకు భాగ్యనగరం సన్నద్ధమవుతోంది. ప్రధాన మంటపాల్లో కొలువుదీరేందుకు భారీ వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. భాగ్యనగర గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖైరతాబాద్ గణేషుడి రూపం కూడా ఖరారైంది. ఈ ఏడాది కొలువుదీరే 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్ బడా గణేశుడు దర్శనమివ్వనున్నాడు. విగ్రహానికి ఓ వైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్‌లో బడా గణేశుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తికానున్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుడి కర్ర పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామాలయం విరాళాల్లో గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ హుండీ కానుకల లెక్కింపు, భద్రత, సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు జరిగినట్లు నిర్ధారించింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని దొంగిలించిన సొమ్మును రికవరీ చేయాలని సిట్ సిఫార్సు చేసింది.
ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సిట్ బృందం, ఈ నివేదికను యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు అందజేసింది.
ఆలయ హుండీ కానుకల లెక్కింపు, భద్రత, సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. విరాళాల లెక్కింపు, నిర్వహణతో సంబంధం ఉన్న దాదాపు 150 మంది ట్రస్టు సిబ్బంది, బ్యాంకు అధికారులు, ప్రైవేట్ ఉద్యోగులు సిట్ ప్రశ్నించింది. బంగారం, వెండి, వజ్రాల వంటి విలువైన కానుకల లెక్కలపై కొందరు ఆఫీస్ బేరర్లు ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని తేలింది. గత ఏడాది జరిగిన మహా కుంభమేళా సమయంలో రోజుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు రావడంతో, భారీగా వచ్చిన నగదు విరాళాలను మళ్లించడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు అక్రమాలకు బాధ్యులైన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అనుమానితుల నుంచి రూ. 2 కోట్ల నగదు, ఒక ఎస్యూవీ వాహనం, 3 ఐఫోన్లను రికవరీ చేశారు. అలాగే, గతంలో విరాళాల లెక్కింపులో ఉన్న పాత సిబ్బంది అందరినీ విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ నివేదిక సమర్పించబడగా.. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో పూర్తి స్థాయి తుది నివేదికను అందజేస్తామని సిట్ సభ్యుడు విజయ్ విశ్వాస్ పంత్ తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా దోషులపై సీఎం యోగి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. పాఠశాలలు ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. భక్తులు వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనార్థమై క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా స్వామిని దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు అల్పాహారంతో పాటు బిస్కట్లు అందిస్తున్నారు.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వరస్వామి దేవస్థానాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.వాడపల్లి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అన్నదాన భవనం పనుల పురోగతిని సమీక్షించిన కమిషనర్, 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ‘శ్రీనివాసం’ వసతి భవనం ప్రతిపాదనలను, స్థల పరిస్థితులను పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వరస్వామి దేవస్థానంలో సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అభిషేక మండపం, అన్నదాన భవనం పనులను పరిశీలించారు. గోదావరి పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనుల కారణంగా స్వామివారి ప్రత్యక్ష దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయగా, స్వామివారికి ఏకాంత సేవలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. భక్తుల ఆధ్యాత్మిక భావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేసి భక్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నారు.
ఆలయ ఈవో, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ పనుల పురోగతిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం భక్తులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శన వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపారు. త్వరలోనే రాజరాజేశ్వర స్వామివారి దర్శనాలు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రాజన్న దర్శనాలను పునఃప్రారంభించే దిశగా పనులు కొనసాగుతున్నాయి.
శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. మూడ్రోజుల క్రితం అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం విరాళం కోరినట్లు చెప్పారు. శ్రీకాళహస్తి దేవస్థాన అభివృద్ధికి 10 కోట్లు, ఆలయంలో సెంట్రల్ ఏసీ ఏర్పాటుకు 3 కోట్లు, దేవస్థానం అనుబంధ గోశాల అభివృద్ధికి 5 కోట్లు విరాళంగా అందించేందుకు అంబానీ అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే… గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం అభివృద్ది కోసం 25 కోట్ల విరాళం ప్రకటించారని… అవసరమైతే మరో 10 కోట్ల వరకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనంత్ అంబానీ పేర్కొన్నారని చెప్పారు. శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం ఆలయ అభివృద్ధి కోసం 48 కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీకి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విరాళాన్ని త్వరలోనే శ్రీకాళహస్తి దేవస్థానానికి అధికారికంగా అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. ఆలయంలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. అమ్మవారి ఆలయంలో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నా… కేవలం కంప్యూటర్ ఆపరేటర్లను మాత్రమే తీసుకోవడంపై యువకులు ఆలయ అధికారులను ప్రశ్నించారు. జీతం లేకుండా ట్రేనింగ్ కోసం మాత్రమే వారిని పెట్టుకున్నామని… వారు ఉచితంగా సేవలు చేస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఐదుగురు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అయింది. జీతంతో పాటు 19 వేల 500 అంటూ ఉన్న పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా పోస్టుకు అధికారులు చెబుతున్న దానికి ఎక్కడా పొంతన లేకపోవడంతో ఆలయంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో అమ్మవారి భక్తులు ఉన్నారు. ఇక దేవాదాయశాఖ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఈవో అంజనీ దేవి చెప్పడంతో మరింత గందరగోళానికి గురి అవుతున్నారు భక్తులు.