దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామాలయం విరాళాల్లో గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ హుండీ కానుకల లెక్కింపు, భద్రత, సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు జరిగినట్లు నిర్ధారించింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని దొంగిలించిన సొమ్మును రికవరీ చేయాలని సిట్ సిఫార్సు చేసింది.
ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సిట్ బృందం, ఈ నివేదికను యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు అందజేసింది.
ఆలయ హుండీ కానుకల లెక్కింపు, భద్రత, సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. విరాళాల లెక్కింపు, నిర్వహణతో సంబంధం ఉన్న దాదాపు 150 మంది ట్రస్టు సిబ్బంది, బ్యాంకు అధికారులు, ప్రైవేట్ ఉద్యోగులు సిట్ ప్రశ్నించింది. బంగారం, వెండి, వజ్రాల వంటి విలువైన కానుకల లెక్కలపై కొందరు ఆఫీస్ బేరర్లు ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని తేలింది. గత ఏడాది జరిగిన మహా కుంభమేళా సమయంలో రోజుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు రావడంతో, భారీగా వచ్చిన నగదు విరాళాలను మళ్లించడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు అక్రమాలకు బాధ్యులైన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అనుమానితుల నుంచి రూ. 2 కోట్ల నగదు, ఒక ఎస్‌యూవీ వాహనం, 3 ఐఫోన్లను రికవరీ చేశారు. అలాగే, గతంలో విరాళాల లెక్కింపులో ఉన్న పాత సిబ్బంది అందరినీ విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ నివేదిక సమర్పించబడగా.. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో పూర్తి స్థాయి తుది నివేదికను అందజేస్తామని సిట్ సభ్యుడు విజయ్ విశ్వాస్ పంత్ తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా దోషులపై సీఎం యోగి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది.