ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని మోదీ సోమనాథ్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్ షోలో వేలాది మంది ప్రజలు పాల్గొని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో ప్రజలు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఈ రోడ్ షోలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ కూడా ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో కుంభాభిషేకం చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని స్వయంగా జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ జరిపించారు. ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు.
1951లో పునర్నిర్మించిన ఈ ఆలయాన్ని భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ చారిత్రక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అమృత్ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Devotional
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్ మట్టి కోటలో ఉన్న పురాతన శివాలయాన్ని అధికారులు కూల్చివేశారంటూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ ఆలయానికి 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో చారిత్రక సంపదను ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆరోపించారు. పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించలేదని విమర్శించారు. కూల్చివేతకు కారణమైన కాంట్రాక్టర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, అదే ప్రదేశంలో అదే శిల్పకళతో ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆలయ భూములను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి భక్తుల కు సత్వర దర్శనం కల్పించడమే పరమావధిగా టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జులై 15వ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. తిరుమల ఆధ్యాత్మిక శోభను పెంచేలా అక్కడి వీధులకు కొత్త పేర్లు పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.ఆధ్యాత్మిక సేవే కాకుండా కళలకు, ఉద్యోగుల సంక్షేమానికి టీటీడీ అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శోభారాజ్‌ని టీటీడీ ఆస్థాన విద్వాంసురాలుగా నియమించింది. ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన బోర్డు టీటీడీ హెల్త్ స్కీమ్ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది. ఇక ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోరికను సైతం నెరవేర్చింది.ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా అధికారిక ఐడీ కార్డులు, స్వామివారి దర్శనం, లడ్డూ కార్డులు మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయాల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందిలో నూతనోత్సాహం నింపడమే కాకుండా సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలందించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.
టీటీడీ పాలక మండలి సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. తిరుమలలోని ఆళ్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణాలకు 4.54 కోట్ల రూపాయల నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు 6 కోట్ల రూపాయలతో పైపు లైన్లు, 44.2 కోట్ల రూపాయాల వ్యయంతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ సంస్థల నుంచి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జీ- స్క్వేర్ సంస్థ తితిదే పేరిట రిజిస్టర్ చేసిన 19.49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి 36.9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నారు. పాలక మండలి తీసుకున్న ఈ సమగ్ర నిర్ణయాలు అటు భక్తుల నుంచి ఇటు సిబ్బంది నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది.ఇక కొండక్రింద వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్టించిన స్వామివారి పాదాల పూజలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా..నేడు ఉదయం 8 గంటలకు పాతగుట్ట ఆలయంలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. యాదగిరిగుట్ట, పాతగుట్టతో పాటు అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి టెంపుల్ లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఈఓ భవాని శంకర్ తెలిపారు.
యాదగిరిగుట్టలో తిరువేంకటపతి అలంకార సేవ, నేడు కాళీయమర్దన అలంకార సేవ, 28న గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ, 29న శ్రీరామావతార అలంకార సేవ, 30న జరిగే నృసింహ అలంకార సేవ, నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. జయంతి ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే లక్ష్మీనరసింహస్వామి హవనం..హోమం, 26న చేపట్టే లక్ష కుంకుమార్చన, 27న చేపట్టే లక్ష పుష్పార్చనలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక టికెట్లను ఆలయ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. లక్ష్మీనరసింహస్వామి హవన పూజకు రూ.2 వేలు, లక్ష కుంకుమార్చనకు రూ.2 వేలు, లక్ష పుష్పార్చనకు రూ.2 వేలుగా టికెట్ ధరను నిర్ణయించారు. ఒక్క టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్–మే నెలల్లో వడక్కున్నథన్ ఆలయంలో జరిగే ఈ వేడుక రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందింది. సుమారు 36 గంటల పాటు కనులవిందుగా సాగే ఈ ఉత్సవాల్లో బంగారు ఆభరణాలతో అలంకరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏనుగులపై నుంచి రంగురంగుల గొడుగులను వేగంగా మార్చే ప్రత్యేక కార్యక్రమం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లో దశావతార–అష్టలక్ష్మి మండపాన్ని భూలోక వైకుంఠాన్ని తలపించేలా అద్భుతంగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గజవాహనంపై మలయప్ప స్వామివారు దర్శనమిచ్చి, పల్లకిపై మండపానికి వేంచేపు చేశారు. మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ వంటి కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు, వస్త్ర బహుమతులు అందజేయగా, ఉత్సవాలు ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్నాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆలయం తెరిచిన మొదటి మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రారంభ రోజుల్లో భక్తుల్లో భారీ ఉత్సాహం కనిపించిందని.. అధికారిక గణాంకాల ప్రకారం తొలి రోజైన ఏప్రిల్ 22న అత్యధికంగా 38 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని రుద్రప్రయాగ్ ఎస్పీ నిహారికా తోమర్ తెలిపారు. రెండో రోజు 25 వేల మందికి పైగా, మూడో రోజు మరో 30 వేల మందికి పైగా యాత్రికులు కేదార్నాథ్ చేరుకున్నారని ఎస్పీ అన్నారు. భక్తుల భారీ తాకిడి నేపథ్యంలో ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. జనసందోహాన్ని నియంత్రించేందుకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారని.. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఫైర్ సర్వీస్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను కూడా సిద్ధంగా ఉంచామని ఎస్పీ నిహారిక తెలిపారు.
జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ మిశ్రా, ఎస్పీ నిహారికా తోమర్‌తో కలిసి ఆలయ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యాత్రికులకు వారు కీలక సూచనలు చేశారు. ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం కేవలం పోలీసులు, జిల్లా యంత్రాంగం తాలూకు అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారాన్ని నమ్మి ఇబ్బందులు పడొద్దని సూచించారు.
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యదేవుని వార్షిక కళ్యాణోత్సవాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. దేవస్థానం ఈఓ ఎన్.ఎస్. చక్రధరరావు ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగనున్న ఈ ఉత్సవాల్లో 27వ తేదీ రాత్రి సత్యదేవుని ధివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరుకానున్నారు.భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, విద్యుత్ అలంకరణ, వైదిక కార్యక్రమాలు, రథోత్సవం వంటి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని.. భక్తులందరికీ సౌకర్యాలు కల్పించేలా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణలు, శంఖారావాల మధ్య బాబా కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈ మేరకు ఆలయాన్ని దాదాపు 51 క్వింటాళ్ల వివిధ రకాల స్వదేశీ, విదేశీ పూలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ద్వారాలు తెరుచుకున్న సమయంలో వేలాది మంది భక్తులు చేసిన ‘హరహర మహాదేవ్’, ‘జై కేదార్’ నినాదాలతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగిపోయాయి.
ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. కేదార్‌నాథ్‌తో పాటు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి దర్శనం కోసం ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కేదార్నాథ్ మార్గంలో ఇంకా మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంది. అలాగే యమునోత్రి, గంగోత్రి ధామ్‌ల దర్శనం కూడా ప్రారంభమవడంతో ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర సందడి నెలకొంది.