చార్ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నెల 22న కేదార్నాథ్ ఆలయం, 23న ఉదయం 6.15కు బద్రీనాథ్ ఆలయాలను ఓపెన్ చేస్తారు. ఈ యాత్ర నవంబర్ వరకు కొనసాగనుంది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 22 నుంచి హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభం కానుండటంతో యాత్ర మరింత సులభంగా మారనుంది.
Devotional
రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్..
రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దేవస్థానం అర్చక బృందం స్వాగతం పలికిన అనంతరం, వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ మరియు ఈవో శ్రీ వీకే శీనా నాయక్ కలిసి అమ్మవారి చిత్రపటం మరియు ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం, హరిజవహర్ లాల్ దంపతులు దేవస్థాన అన్నప్రసాద వితరణ కేంద్రానికి చేరుకున్నారు. భక్తులతో కలిసి కూర్చుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాదం యొక్క రుచి, నాణ్యత మరియు వడ్డన తీరుపై స్వయంగా భక్తులను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం పై వారు హర్షం వ్యక్తం చేశారు. అన్న ప్రసాదం స్వీకరిస్తున్న వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు, పురుషుల పేరు వివరాలను డాక్టర్ హరిజవహర్ లాల్ అడిగి సంతృప్తి స్థాయి తెలుసుకున్నారు.అన్నప్రసాదశాల పరిశీలన అనంతరం, ఆలయ ఈవో మరియు చైర్మన్లకు హరిజవహర్ లాల్ పలు కీలక సూచనలు చేశారు. అన్నప్రసాద వితరణ జరిగే ప్రాంతంలో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని, వంటశాలలో నిరంతరం పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. వంటల తయారీలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, తాజా కూరగాయలు మరియు నాణ్యమైన దినుసులను మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. వంటశాలలో పనిభారాన్ని తగ్గించి, నాణ్యతను పెంచేందుకు అత్యాధునిక పరికరాలను వినియోగించాలని సూచించారు.అన్న ప్రసాదం స్వీకరించే భక్తుల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి రోజు పరిశీలన చేయాలని ఆదేశించారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్‌కు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఇద్దరి భేటీలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి వివరాలపై సమీక్షించారు..అలాగే గోదావరి పుష్కరాల నిర్వహణపై కూడా దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు మంత్రి దుర్గేశ్.
2027 జూన్ 26 నుండి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించినట్లు తెలిపారు. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా ఉత్సవానికి దాదాపు10 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు. రాజమండ్రితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. భక్తుల కోసం అన్ని ఏర్పా్ట్లు చేసినట్లు వెల్లడించారు.
పుష్కర ఏర్పాట్లపై త్వరలోనే రాజమండ్రిలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ భేటీలో క్షేత్రస్థాయి సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర గౌరవం ఇనుమడించేలా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం..ఈ గోదావరి పుష్కరాలను నిర్వహించబోతోందని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు.
చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఈవో రామాంజనేయులు సస్పెన్షన్..
చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కే రామాంజనేయులును సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అవకతవకలు గుర్తించి ఈవోను వెంటనే సస్పెండ్ చేశారు. అలాగే దేవాలయానికి దాతలు ఇచ్చిన బంగారు, వెండి ఆభరణాలపై సరైన జవాబుదారీతనం లేకపోవడాన్ని తనిఖీల్లో హనుమంతరావు గుర్తించారు. ఓ భక్తుడు స్వామివారికి సమర్పించుకున్న 2.30 కిలోల వెండి కిరీటానికి సంబంధించి రసీదు ఆయనకు ఇవ్వకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. సదరు కిరీటాన్ని మార్పు చేయడం కోసం కంసాలికి ఇచ్చి నాలుగేళ్లు గడిచినా తిరిగి తీసుకురాలేకపోయినట్లు గుర్తించారు . సదరు భక్తుడు ఆ కిరీటం గురించి అడిగితే నేను నీకు రసీదు ఇవ్వలేదు కాబట్టి నాకు బాధ్యత లేదు అంటూ ఈవో రామాంజనేయులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు విచారణ సందర్భంగా తేలింది.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆన్లైన్లో బుక్ చేసిన విఐపీ బ్రేక్ దర్శనాలు రెండు విడతలుగా అనుమతిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ రికార్డు స్థాయిలో లడ్డూలను విక్రయించి భారీ ఆదాయాన్ని ఆర్జించింది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో మొత్తం 13 కోట్ల 95 లక్షలా 43 వేల 231 లడ్డూలను భక్తులకు విక్రయించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 12 కోట్ల 18 లక్షాల 53 వేల 535గా ఉంది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే అదనంగా 1.76 కోట్ల లడ్డూల అమ్మకాలు పెరిగాయి. ఈ అమ్మకాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో టీటీడీకి సుమారు రూ. 567 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. అదనంగా లడ్డూలు కావాలనుకునే వారికి ఒక్కో లడ్డూను రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదం విక్రయాలు కూడా కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి.
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది. అక్షయ తృతీయ పర్వదినాన ఈ నెల 20న జరగనున్న చందనోత్సవానికి సింహగిరి ముస్తాబవుతోంది. లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. అడుగడుగునా నిఘా, పకడ్బందీ వసతులు కల్పిస్తున్నారు. సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తూనే.. ప్రత్యేక దర్శనాల కోసం టిక్కెట్ల ధరలను ఖరారు చేశారు. 300, 1000 మరియు 1500 రూపాయల ధరలతో ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులోకి తెస్తున్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. మౌలిక వసతులు, వైద్య సేవలు మరియు నిరంతర రవాణా సౌకర్యాలను సిద్ధం చేశారు. రేపు జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో.. ఏర్పాట్లపై తుది మెరుగులు దిద్దనున్నారు. భక్తి పారవశ్యంలో మునిగిపోనున్న సింహగిరిపై మరిన్ని వివరాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు.
పెద్దపల్లి జిల్లాలో శ్రీ గణపతి మహా రుద్ర సహిత సుదర్శన చండీయాగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు..
పెద్దపల్లి జిల్లాలో శ్రీ గణపతి మహా రుద్ర సహిత సుదర్శన చండీయాగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి మండలం పెద్ద కలువలలో శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రం 11వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ గణపతి మహా రుద్ర సహిత సుదర్శన చండీయాగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహా యాగ కార్యక్రమానికి వివిధ పీఠాధిపతులైన జగద్గురు శ్రీ శ్రీ డాక్టర్ శ్రీకాంత్యేంద్ర స్వాములు, శ్రీమద్ నందికొండ జగద్గురు కాళహస్యతచార్యా సంస్థానం, శ్రీ గాయత్రి పీఠం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.లోక కళ్యాణం కోసం చేసే ఈ చండీయాగం రైతులకు రాష్ట్ర ప్రజలకు గ్రామ ప్రజలకు సకల శుభాలు ఇస్తుందంటూ పీఠాధిపతులు పేర్కొన్నారు.
సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన, దక్షణ కాశి గా పేరుగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఈవో కార్యాలయం లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య అంత్యపుష్కరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.శాఖల వారీగా హాజరైన ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పిఆర్ ఇంజినీరింగ్, విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య, ఆర్టీసి అధికారులతో శాశ్వత, తాత్కాలిక పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ తాత్కాలిక మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. గత సంవత్సరం జరిగిన సరస్వతి పుష్కరాలలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా ఉండాలని ఎలాంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 540 మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్ లో సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
కలియుగ వైకుంఠం తిరుమలలో దళారుల ఆటకట్టించేందుకు టీటీడీ నడుం బిగించింది. ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేస్తూ.. సామాన్య భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కుల గుట్టు రట్టు చేసేందుకు హైటెక్ అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఇకపై కేవలం కార్డు చూపిస్తే సరిపోదు.. మీ ముఖం, మీ వేలిముద్ర కూడా ఆధార్ డేటాతో మ్యాచ్ కావాల్సిందే.ఇందుకోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సేవలను టీటీడీ వినియోగించుకోనుంది. ఇప్పటికే ఇరు విభాగాల మధ్య చర్చలు సఫలమయ్యాయి. టీటీడీని ‘అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ’గా రిజిస్ట్రేషన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండేళ్ల కాలానికి గాను రూ.20 లక్షల రుసుము చెల్లించేందుకు టీటీడీ సిద్ధమైంది.”
ఈ కొత్త విధానంలో ఆధార్ నిర్ధారణతో పాటు ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ కీలకం కానుంది. ఒకరు తీసుకున్న టికెట్‌పై మరొకరు వెళ్లే ఛాన్స్ లేకుండా టెక్నాలజీ నిఘా పెడుతుంది. ప్రతి ఈ-కేవైసీ లావాదేవీకి కొంత మొత్తాన్ని ఉడాయికి చెల్లిస్తూ.. పక్కాగా భక్తుల వివరాలను సరిపోల్చనున్నారు అధికారులు. అయితే ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో.. ఇప్పటికే టీటీడీ సంప్రదింపులు మొదలుపెట్టింది. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపులో పారదర్శకత పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. సామాన్య భక్తులు నేరుగా సేవలు పొందేలా ఈ వ్యవస్థ దోహదపడనుంది. ఈ విప్లవాత్మక మార్పుతో తిరుమలలో దళారుల దందాకు శాశ్వతంగా అడ్డుకట్ట పడనుంది.