ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మరమ్మతు పనులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేస్తున్నట్టు ప్రకటించారు ఆలయ అధికారులు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భక్తుల కోసం కనకదుర్గ నగర్ వైపు నుంచి ప్రత్యామ్నాయ రాకపోకలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఘాట్ రోడ్ మూసివేత దృష్ట్యా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఆలయ ఈవో. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఘాట్‌రోడ్డులో ఉన్న ప్రోటోకాల్ ఆఫీస్‌ను వెంటనే కొండ దిగువన కనకదుర్గ నగర్లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చారు. కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ వద్ద భక్తుల రవాణా కోసం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తగినన్ని బ్యాటరీ వాహనాలను నిరంతరం అందుబాటులో ఉంచుతారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ఘాట్ రోడ్లో ఉన్న టికెట్ కౌంటర్ సిబ్బందిని కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ వద్దకు మార్చారు. కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ నుండి మహా మండపం వరకు అదనపు సెక్యూరిటీ గార్డులను, సూపర్వైజర్లకు విధులు కేటాయించారు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే భక్తుల దర్శనాల కోసం మహా మండపం వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేశారు. నిత్య పూజలు, సేవల కొరకు కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఘాట్ రోడ్ మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఆలయ పరిసరాల్లో మైక్ ద్వారా నిరంతరం అనౌన్స్మెంట్స్ చేయనున్నారు. సీతమ్మవారి పాదాల నుంచి, కుమ్మరి పాలెం సెంటర్ నుంచి, పున్నమి ఘాట్ నుంచి నిరంతరం దేవస్థానం బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
Devotional
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల తమకంపల్లిలో గంగ జాతర వేడుకలు వైభవంగా జరిగాయి. కమతంపల్లిలోని సత్యమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహానికి గ్రామస్తులు ఘనంగా పూజలు నిర్వహించారు.గత వారం రోజులుగా అమ్మవారికి విశేష అలంకరణలు చేపట్టి పొంగిళ్లు పెట్టడం, అంబలి పోయడం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.గ్రామం నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో స్థిరపడిన వారు కూడా ప్రత్యేకంగా స్వగ్రామానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తిరుపతిలో సాధుపరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుమలపై కట్టుకథలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ స్వామీజీలు అలిపిరి వేదికగా మండిపడ్డారు. తిరుమల పవిత్రతను, తిరుపతి ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ నిరంతరం వివాదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం కోట్లమంది ప్రజలు విశ్వసించే వెంకటేశ్వర స్వామి జోలికి రావొద్దని హెచ్చరించారు.
అంతే కాకుండా కరుణాకర్ రెడ్డి ఇంటిని సైతం ముట్టడించేందుకు స్వామీజీలు ప్రయత్నించారు. వారిని శిల్పారామం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. కరుణాకర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో లడ్డూ కల్తీపై ఇతర సమస్యలపై నోరు మెదపని కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. అలిపిరి పరిసరాల్లో ఎప్పుడో దశాబ్దాల క్రితం అసంపూర్తిగా వదిలేసిన శనీశ్వరుడి విగ్రహాన్ని మహా విష్ణువు విగ్రహంగా చిత్రీకరించి భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
యాదగిరిగుట్టలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేశారు. వేదపాఠశాల, కల్యాణ మండపం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ హాజరయ్యారు.
కంచి కామకోటి పీఠాధిపది శ్రీశంకర విజయేంద్ర సర్వస్వతి స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. 43 కోట్ల 79 లక్షలతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేదపాఠశాల భవనం నిర్మించనున్నారు. వచ్చే రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. ఇక 9 కోట్ల 88 లక్షల ఖర్చుతో కొండపై నిత్య కల్యాణం, రంగం మండపం నిర్మాణం, కోటీ 41 లక్షలతో మెట్ల మార్గానికి పైకప్పు, కోటీ 44 లక్షలతో మాఢవీధులకు మెట్లు, 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ‘భద్రగిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని నిర్వహించిన ‘భద్రగిరి ప్రదక్షిణ’ కార్యక్రమం భక్తి పారవశ్యాన్ని నింపింది. స్వామివారికి విశేష పూజలు జరిపారు. భక్త రామదాసు,స్వామివారి చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భద్రగిరి ప్రదక్షిణలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు చంద్రబాబు దంపతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు నేరుగా ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది. ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, విభిన్న కళా సాంస్కృతిక కార్యక్రమాలు, మనోహరమైన పాటకచేరీలతో కుప్పం వీధులన్నీ పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా, పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుప్పానికి భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ సైతం జాతర జరిగే ఎనిమిది రోజుల పాటు అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కుప్పం స్టేషన్లో నిలపాలని నిర్ణయించింది. ఇక జాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. ఇవాళ గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శన మహోత్సవం జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించనున్నారు.
రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా లక్ష్మణ సమేత శ్రీ రఘునాథ స్వామి ఆలయం ఎన్నో శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుంది. సీతమ్మ దాహం తీర్చేందుకు శ్రీరాముడు బాణం సంధించి పాతాళ గంగను వెలికితీశాడని స్థానిక పురాణం చెబుతోంది. ఆలయం ఎదుట ఉన్న బావిలో ఇప్పటికీ ఆ బాణం గుర్తులు కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే సీతమ్మ నార చీరలు ఆరవేసినట్లు చెప్పబడే దోనబండ, రాముడి పాదముద్రలు వంటి ఎన్నో పురాణ చిహ్నాలు ఈ క్షేత్రంలో మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి . కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయానికి రాజులు వేల ఎకరాల భూములను దానంగా ఇచ్చారు. కానీ నేడు అదే దేవాదాయ భూములు అక్రమాల అడ్డాగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తి, చరిత్ర, రాజకీయాలు కలిసిపోయిన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
శ్రీ రఘునాథ స్వామి ఆలయానికి ఒకప్పుడు రాజులు దానంగా ఇచ్చిన 3,355 ఎకరాల భూములు ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువయ్యాయి. అందులో దాదాపు 2,800 ఎకరాల సాగుభూమి ప్రస్తుతం రైతుల ఆధీనంలో ఉంది. ఈ భూముల్లో కోకో, ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరం 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు విలువ పలుకుతున్నా… ఆలయానికి మాత్రం సరైన ఆదాయం రావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1990లో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ భూములను సాగు చేస్తున్న రైతులు ఎకరాకు ఏడాదికి ఒక క్వింటా వేరుశనగ చొప్పున కౌలు చెల్లించాలి. కానీ ఆ తీర్పు అమలుకాక దశాబ్దాలు గడిచిపోయాయి. ప్రస్తుతం సుమారు 1,050 మంది రైతులు సాగు చేస్తున్న ఈ భూములపై చెల్లించాల్సిన కౌలు బకాయిలు 10 కోట్ల రూపాయలు దాటిపోయినట్లు తెలుస్తోంది. కోట్ల విలువైన దేవాదాయ ఆస్తులు ఉన్నప్పటికీ స్వామివారి ఆలయం మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.
దేవుడి ఆస్తులపై జరుగుతున్న అక్రమాలపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వ్యక్తులు కేవలం 100 రూపాయల స్టాంపు పేపర్లపై స్వామివారి భూములను విక్రయిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కూడా సృష్టించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015లో ప్రభుత్వం ఈ భూములన్నీ దేవాదాయ శాఖకే చెందినవని స్పష్టం చేస్తూ స్వామివారి పేరుతో పాసుపుస్తకాలు జారీ చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదని భక్తులు అంటున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నప్పటికీ ఆలయంలో జరిగే వార్షిక కళ్యాణం, రథోత్సవాలకు కూడా నిధుల కొరత వెంటాడుతుంది . కౌలు వసూలు చేయడానికి అధికారులు ప్రయత్నించినా రాజకీయ ఒత్తిళ్లు అడ్డంకిగా మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నోటీసులు జారీ చేయడమే తప్ప భూముల రక్షణలో చర్యలు కనిపించడం లేదని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
శ్రీ రఘునాథ స్వామి ఆలయ భూముల వ్యవహారం ఇప్పుడు కేవలం ఆస్తి వివాదం మాత్రమే కాదు… ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అక్రమాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ఎవరు సాగు చేస్తున్నారు? ఎవరి చేతుల్లోకి భూములు మారాయి? ఎంత భూమి అక్రమంగా విక్రయించబడింది? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాతాళ గంగ, దోనబండ, రాముడి పాదముద్రలు వంటి పురాణ చిహ్నాలతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ఇప్పుడు తన ఆస్తులను కాపాడుకునే పోరాటం చేస్తోంది. కోట్ల విలువైన భూములు స్వామివారికి తిరిగి దక్కాలంటే కఠిన చర్యలు తప్పనిసరి అని స్థానికులు అంటున్నారు. మరి ప్రభుత్వం స్పందించి దేవాదాయ భూములను రక్షిస్తుందా? లేక అక్రమాల వలయంలోనే ఈ పురాతన క్షేత్రం నలిగిపోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..
తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో పాటు కొండపైన భక్తుల సౌకర్యార్థం చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేసి, పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి. పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని దీక్ష విరమణ చేశారు. తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.