Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home International ఆఫ్రికాలో ఎబోలా కలకలం..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..

by CVR NEWS
ఆఫ్రికాలో ఎబోలా కలకలం

ఆఫ్రికా ఖండంలో ఎబోలా పంజా విసురుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కాంగోలో 88మంది మృతి చెందగా…మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO..గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేకపోయినా.. కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితి కొవిడ్-19 లాంటి మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాల్సిన అవసరం లేదని సూచించింది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వ సారి వ్యాప్తి చెందడమని వెల్లడించింది. ప్రాథమిక నమూనాలలో అధిక పాజిటివిటీ రేటు.. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరంగా మారిందని పేర్కొంది.

ప్రస్తుత ఉద్ధృతికి ‘బుండిబుగ్యో’ అనే అరుదైన ఎబోలా వైరస్ వేరియంట్‌ కారణమని అధికారులు గుర్తించారు. ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి చికిత్సలు, వ్యాక్సిన్లు లేవు. ఈ వేరియంట్‌ తొలిసారి 2007-2008లో ఉగాండాలో కనిపించింది. అప్పట్లో ఈ వైరస్ బారిన పడి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి 2012లో కాంగోలోని ఇసిరోలో 29 మంది మరణించారు. ఈ వైరస్‌కు ప్రత్యేకంగా అమోదించిన చికిత్సలు, వ్యాక్సిన్‌లు లేకపోవడం వల్ల దీనిని వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. అదే సమయంలో వైరస్‌ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని.. ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని కోరింది. వైరస్‌ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది. వ్యాధి నిర్ధరణ అయిన వారిని వెంటనే క్వారంటైన్‌ చేసి.. వారితో సంబంధం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: