హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్‌రంజన్‌రే భార్య హత్య, దోపిడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘోరానికి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కల్పన అనే నేపాలీ మహిళ తన ప్రియుడు వికాస్ వేసిన క్రిమినల్ స్కెచ్‌ను అమలుచేసినట్టు దర్యాప్తులో తేలింది. నమ్మకంగా ఇంట్లో చేరి, యజమానురాలి ప్రాణాలు తీసి, కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్‌వర్క్ గుట్టును రట్టు చేశారు పోలీసులు.
నేపాల్‌కు చెందిన కల్పన కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని పుణెకు వచ్చింది. అక్కడ కొన్ని ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగించేది. ఆ సమయంలోనే ఆమెకు వికాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వికాస్ ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో పెద్ద ఎత్తున దోపిడీకి ప్లాన్ చేశాడు. గత 8 నెలల క్రితం వరకు వినయ్‌రంజన్‌రే ఇంట్లో మరో నేపాలీ మహిళ పనిచేసేది. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల తన బంధువుల ఇంటికి వెళ్తూ, నమ్మకస్తురాలంటూ కల్పనను ఈ ఇంట్లో పనికి కుదిర్చింది. యజమానుల దగ్గర చాలా నమ్మకంగా ఉన్న కల్పన..ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు, భద్రతా లోపాలను తన ప్రియుడు వికాస్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే చోరీకి ప్లాన్ చేసిన వికాస్, ఒక ముఠాను రంగంలోకి దించాడు. దోపిడీకి కొద్దిరోజుల ముందే పుణె, ముంబయి, బెంగళూరు నగరాల్లో వేర్వేరుగా నివసిస్తున్న ఎనిమిది మంది నేపాలీ యువకులను హైదరాబాద్‌కు రప్పించాడు. ఐతే ఈ ఎనిమిది మందికి ఒకరికొకరు అంతకుముందు ఎలాంటి పరిచయం లేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాతే వీరంతా వికాస్ ద్వారా ఒక ముఠాగా ఏర్పడ్డారు. కల్పన, వికాస్, ఈ 8 మంది కలిపి మొత్తం 9 మంది సభ్యులు ప్రశాసన్‌నగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఏ సమయంలో ఇంట్లో ఎవరు ఉంటారు, ఎలా లోపలికి ప్రవేశించాలి, ఏ మార్గం ద్వారా పారిపోవాలనే విషయాలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు.
పథకం ప్రకారం కల్పన..ఇంట్లో ఇతర సభ్యులు లేని సమయం చూసి ముఠా సభ్యులను లోపలికి పిలిచింది. అడ్డువచ్చిన యజమానురాలు తనూజను దారుణంగా హత్య చేసి, ఇంట్లోని భారీ సొత్తును దోచుకున్నారు. నేరం చేసిన తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వీరు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. జూబ్లీహిల్స్ నుంచి నేరుగా ఒక ఆటో ఎక్కి నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి కాజీపేటలో దిగారు. రైల్వే స్టేషన్ దాటి బయటకు రాగానే, టెక్నాలజీ ఆధారంగా పోలీసులు తమను ట్రాక్ చేయకుండా ఉండేందుకు అందరి సెల్‌ఫోన్లను పగలగొట్టి పక్కన పడేశారు. ఆ తర్వాత కొట్టేసిన బంగారు నగలు, నగదును అందరూ సమానంగా పంచుకున్నారు.