విజయవాడ ధర్నా చౌక్‌లో తాగునీటి పథకాల కార్మికులు ఆందోళనకు దిగారు. CPWS, సత్యసాయి ఫ్రెష్ వాటర్ స్కీమ్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది వాల్వ్ ఆపరేటర్లు, పంప్ ఆపరేటర్లు, మెకానిక్స్, ఎలక్ట్రిషియన్లు, ఇతర సిబ్బంది తాగునీటి సరఫరా సేవలు అందిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల ప్రకారం జీతాలు చెల్లించడం లేదని, కాంట్రాక్టర్లు తక్కువ మొత్తాలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. కొన్ని జిల్లాల్లో 10 నుంచి 20 నెలల వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. EPF, ESI సదుపాయాలు అమలు చేయాలని, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, జీతాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం తీసుకురావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు.
Latest News
హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని’ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మరియు నేత అజారుద్దీన్ కలిసి సచివాలయంలో ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకం కింద హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఒక్కో టవర్‌లో 10 అంతస్తులు.. ప్రతి అంతస్తుకు 12 ఫ్లాట్లు ఉండేలా ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో మొత్తంగా లక్ష ఫ్లాట్లను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. ఇందుకోసం చార్మినార్, బహదూర్ పురా, ముషీరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో స్థలాలను ఇప్పటికే గుర్తించారు.పేదవాడి చిరు కోరిక సొంత ఇల్లు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఇది సాకారం అవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా స్థలం ఉన్న వారికి 4.50 లక్షల ఇండ్లు ఇచ్చాం. ఆగస్టు నాటికి 2 లక్షల పైగా ఇండ్లు పూర్తి కాబోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరం వెలుపల 30 కిలోమీటర్ల దూరంలో ఇండ్లు కట్టడం వల్ల ఉపాధి లేక పేదలు అక్కడ ఉండలేకపోయారు. కానీ మేము క్యూర్ పరిధిలోనే, గజం రూ. 2 నుంచి 3 లక్షల విలువైన ప్రాంతాల్లో కూడా స్థలాలు సేకరించి ఇండ్లు కట్టిస్తున్నాం.
చివరి లబ్ధిదారుడి వరకు ఇల్లు అందేలా చూస్తామని, పేదలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా ఈ గృహాలను అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన పేదలందరికీ ఈ ఇందిరమ్మ ఇండ్లు వరంలా మారబోతున్నాయి.
కృష్ణా జిల్లా గుడివాడలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం వెంటనే జీవో 396ను వెనక్కి తీసుకోవాలని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెన్‌డౌన్ కార్యక్రమానికి ప్రజలు, సంబంధిత వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు.కాగా పెన్‌డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు, అయోధ్య రామ మందర విరాళాల వివాదం, పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. అయితే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాం రచిస్తోంది. అలాగే మరో కొత్త 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు 2026, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026, జనన, మరణాల నమోదు సవరణ బిల్లు 2026, జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే బిల్లు 2026, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026లు ఉండే అవకాశం ఉంది.
ఫిఫా వరల్డ్ కప్–2026లో స్పెయిన్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అంతా స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా, అర్జెంటీనా ఒక్క షాట్ కూడా లక్ష్యంపై నమోదు చేయలేకపోయింది. స్పెయిన్ ఆటగాళ్లు వరుసగా దాడులు చేస్తూ మొత్తం 12 ప్రయత్నాలు చేయగా, అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ 11 అద్భుతమైన సేవ్‌లతో జట్టును నిలబెట్టాడు. అయితే ఎక్స్ట్రా టైమ్ 106వ నిమిషంలో నికో విలియమ్స్ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను ఫెర్రాన్ టోర్రెస్ గోల్‌గా మలచడంతో స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ గోల్ ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయే క్షణంగా అభిమానులు అభివర్ణిస్తున్నారు.
న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య స్పెయిన్ జట్టు ప్రపంచ కప్‌ను ముద్దాడింది. నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాలనే లియోనెల్ మెస్సీ బృందం ఆశలకు అడ్డుకట్టు వేసిన స్పెయిన్, ఏకంగా 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫుట్‌బాల్ విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల రక్షణ శ్రేణులు అత్యంత పటిష్టంగా నిలబడటంతో నిర్ణీత 90 నిమిషాల పూర్తి సమయం ముగిసేసరికి ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి, దీనితో మ్యాచ్ 0-0 తో డ్రాగా నిలిచి ఎక్స్ట్రా టైమ్‌కు దారితీసింది. ఫెర్నాండేజ్ రెడ్ కార్డ్ వల్ల బయటికి వెళ్లినా అర్జెంటీనా కీపర్ మార్టినెజ్ వీరోచితంగా స్పెయిన్ దాడులను అడ్డుకున్నప్పటికీ, ఎక్స్ట్రా టైమ్‌లో స్పెయిన్ తన వ్యూహాలకు పదును పెట్టింది. మ్యాచ్ 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్.. లభించిన అద్భుత అవకాశాన్ని గోల్‌గా మలచడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ ఏకైక గోల్‌తో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించిన స్పెయిన్ ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి, సరికొత్త ఫుట్‌బాల్ రాజ్యాంగాన్ని లిఖించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ చెందిన రెబల్ ఎంపీల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇక, ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలతో ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా కి సమావేశానికి ఆహ్వానం ఇవ్వడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీలు సమావేశం నుంచి ప్రతీకాత్మకంగా వాక్ అవుట్ చేశాయి. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సమావేశానికి హాజరయ్యాయి. టీఎంసీకి చెందిన సుమారు 20 మంది తిరుగుబాటు ఎంపీలు జూన్‌లో ఎన్సీపీఐలో విలీనం అయినట్లు ప్రకటించారు. అయితే ఆ విలీనాన్ని లోక్‌సభ స్పీకర్ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. అయినప్పటికీ ఎన్సీపీఐని అఖిలపక్ష సమావేశానికి పిలవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ వెబ్సైట్లో కూడా పేరు లేని, అధికారిక గుర్తింపు లేని పార్టీని ఎలా సమావేశానికి పిలుస్తారు? అని ప్రశ్నించారు. మరోవైపు.. ఎన్సీపీఐ పార్లమెంటరీ పక్ష నాయకురాలు కాకోలి ఘోష్ దస్తిదార్ మాత్రం తమకు సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్‌కు అవసరమైన పత్రాలన్నీ సమర్పిస్తామని, విలీనానికి సంబంధించిన నిర్ణయం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు పలు కీలక అంశాలను ప్రస్తావించాయి. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారం, నీట్ పేపర్ లీక్, వ్యవసాయ సమస్యలు, పెట్రోల్‌లో ఈ20 ఇంధన మిశ్రమం, అలాగే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) వంటి అంశాలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశాయి. దీంతో, వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్సీపీఐకి ఇచ్చిన గుర్తింపుపై మొదలైన వివాదం.. పార్లమెంట్ సమావేశాల్లోనూ అధికార–విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.
తిరుపతి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలంలో నెన్నూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు సిద్దముని రెడ్డి, గిరిధర్ రెడ్డి.. అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది.
తిరుపతి జిల్లాలో వైసీపీ నుంచి పార్టీలో చేరిన సిద్దముని రెడ్డి, గిరిధర్ రెడ్డి సహా అనుచరులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 40 ఏళ్లకు పైగా ఒకే పార్టీలో ఉన్న సిద్దముని రెడ్డి కుటుంబం టీడీపీలో చేరడం శుభపరిణామమని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. టీడీపీపై విశ్వాసంతో పార్టీలోకి వచ్చిన సిద్దముని రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందరూ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.2024 ఎన్నికల తర్వాత పలువురు నాయకులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపారని,అయితే పార్టీలో చేరికల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.నాధముని రెడ్డి,గిరిధర్ రెడ్డి కుటుంబాలు పార్టీలో చేరతాయని ఊహించని మంచి పరిణామమన్నారు. వారి చేరిక పార్టీ బలోపేతానికి మరింత ఊతమిస్తోందన్నారు.
ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబం పార్టీలోకి రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తిరుపతి టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీ రెడ్డి కొనియాడారు. 80 ఏళ్లు దాటిన వయస్సులోనూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న కుటుంబానికి తాను అండగా నిలిచి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.సీనియర్ నేతల చేరికతో చంద్రగిరి నియోజకవర్గం లో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌తో ఓ ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐడీ జరిపిన లోతైన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను నటి కాదంబరి జెత్వాని బ్లాక్మెయిల్ చేసినట్లు సీఐడీ తన చార్జ్‌షీట్‌లో అధికారికంగా పేర్కొంది. సీఐడీ చార్జ్‌షీట్ ప్రకారం.. కుక్కల విద్యాసాగర్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలకు సంబంధించిన ఫొటోలను చూపించి కాదంబరి జెత్వాని ఆయనను బెదిరింపులకు గురిచేసింది. ఈ ఫొటోలను బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి, విద్యాసాగర్ నుంచి ఆమె రూ. 1.32 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ స్పష్టం చేసింది. ఈ బ్లాక్‌మెయిలింగ్, డబ్బు వసూళ్లకు సంబంధించిన పక్కా ఆధారాలను కూడా సీఐడీ తన చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. గతంలో ఈ కేసు రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జెత్వాని ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, ఈ కేసులో విచారణ సరిగా జరపలేదనే ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయితే, ఇప్పుడు సీఐడీ సమర్పించిన చార్జ్‌షీట్‌లో విద్యాసాగర్‌ను జెత్వాని బ్లాక్మెయిల్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలతో పేర్కొనడంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దశాబ్ద కాలంగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాకారం కావడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాల్లో భారీ మార్పులకు ఈ విమానాశ్రయం కేంద్ర బిందువుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఆలోచన 2014లో రూపుదిద్దుకుంది. విశాఖపట్నం విమానాశ్రయంపై పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని నిర్ణయించారు. భూసేకరణ, అనుమతులు, నిర్మాణ పనులు పలు దశల్లో కొనసాగగా… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగం పుంజుకుని ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం… విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కీలక కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది. విమాన రాకపోకలు ప్రారంభమైన తర్వాత పెట్టుబడులు పెరగడంతో పాటు పరిశ్రమలు, ఐటీ, సేవా రంగ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు మరింతగా ఆకర్షితమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భోగాపురం విమానాశ్రయం కేవలం ఆధునిక మౌలిక వసతులకే పరిమితం కాకుండా… ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర కళలు, హస్తకళలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా టెర్మినల్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు.ఆగస్టు 1న జరిగే ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలు గర్వపడేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. విద్యార్థులు, యువత, ప్రజల భాగస్వామ్యంతో ఈ వేడుకను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో మన ప్రతిభను చాటిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కేంద్రం అవార్డులతో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి, అవార్డు గ్రహీతలందరికీ ప్రత్యేక అభినందనలు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ సాధించిన అద్భుత విజయాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో టాలీవుడ్ ప్రతిభను చాటిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అలాగే సాంకేతిక నిపుణుల అసాధారణ కృషి తెలుగువారందరికీ ఎంతో గర్వకారణంగా నిలిచిందని ఆయన కొనియాడారు. కళలు, సంస్కృతితో పాటు చలనచిత్ర రంగం అనేది మన సమాజ అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి అత్యంత బలమైన మూలస్తంభాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అవార్డుల పర్వంలో చంద్రబాబు చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన తన సందేశంలో మమ్ముట్టి, యామీ గౌతమ్, కార్తీక్ ఆర్యన్ వంటి బాలీవుడ్, మాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు సుకుమార్, నటి నిహారిక కొణిదెల తదితరులను ట్యాగ్ చేయడం విశేషం. దీనితో పాటు ఇటీవల సంచలనం సృష్టించిన ప్రతిష్ఠాత్మక చిత్రాలైన ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాల హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ముఖ్యమంత్రి తన పోస్టుకు జతచేశారు. తెలుగు చిత్రాలు గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతున్న తరుణంలో ఈ జాతీయ పురస్కారాలు మరింత బూస్ట్ ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారని, ఈ అభినందనలు చిత్ర బృందాల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే నంది అవార్డుల వంటి ప్రోత్సాహకాలు తిరిగి పుంజుకుంటాయని సినీ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




Total views : 221094