ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు ముంబైలో మంగళవారం భారీ వర్షాలను తీసుకువచ్చాయి. గత రెండు వారాలుగా వాయిదా పడుతూ వచ్చిన నైరుతి రుతుపవనాలు, ఇప్పుడు మహారాష్ట్ర తీరాన్ని తాకడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారత వాతావరణ శాఖ IMD తాజా సమాచారం ప్రకారం..ముంబైలో సగటు వర్షపాతం కంటే 300 శాతానికి పైగా లోటు నమోదైంది. సాధారణంగా జూన్ 11న రావాల్సిన వర్షాలు ఆలస్యం కావడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వర్షపాత లోటును భర్తీ చేసే దిశగా రుతుపవనాలు ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్ర తీరం వెంబడి గాలి వేగం మరియు తేమ శాతం పెరగడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తదుపరి మూడు నుండి నాలుగు రోజుల్లో బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని మిగిలిన భాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని, వాతావరణ అప్డేట్స్ను గమనిస్తూ ఉండాలని పలు సూచనలు పేర్కొన్నారు.
National
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి భవన్లో ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రివర్గం పునర్వ్యస్థీకరణ ఊహాగానాల వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేరళకు చెందిన భాజపా నేత జార్జ్ కురియన్ కేంద్ర సహాయ మంత్రి పదవికి ఈ ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తథ్యమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికితోడు ఇటీవల పలువురు కేంద్రమంత్రులకు వారి వారి రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించడం దీనికి మరింత బలం చేకూరింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష్ మల్హోత్రాను దిల్లీ భాజపా అధ్యక్షుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మే నెలలో నియమించారు.
ఈ ఏడాది పద్మ అవార్డ్స్ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురష్కారాలను ప్రదానం చేశారు. మొదటి విడతలో దివంగత నటుడు ధర్మేంద్ర, ఎన్.రాజంలకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ ప్రధానం చేయగా.. ఇప్పుడు ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ లకు పద్మవిభూషణ్ అందజేశారు.
మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టికి ‘పద్మ భూషణ్’ అవార్డును ప్రధానం చేశారు. అలానే ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్‌తో పాటు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు. రెండో విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి సినీ నటులు మాగంటి మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. వీరితో పాటు సినీ హీరో ఆర్. మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను ప్రధానం చేశారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల కార్యక్రమానికి తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశంలో క్రీడా విప్లవం వచ్చిందని, భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని ఆయన కొనియాడారు. 30 దేశాల నుండి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలు భారత్‌లో ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ విజేతలకు పతకాలు ప్రదానం చేశారు.
మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ కు చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన -యూబీటీలో చీలికపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. పార్టీలో చేరికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే మాట్లాడుతూ.
ఆరు పులులు ఇప్పుడు అసలైన శివసేన ఫ్యామిలీలోకి వచ్చాయి. వారికి స్వాగతం. ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది అని ప్రకటించారు.
శిండే క్యాంప్‌లో చేరిన ఎంపీల్లో ఓం రాజే నింబాల్కర్, సంజయ్ దిన పాటిల్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేష్ పాటిల్ అష్టికర్, బౌసాహెబ్ వక్చౌరే ఉన్నారు. మొత్తం 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే క్యాంప్‌లో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం 2022 జూన్ 22న 40 మంది ఎమ్మెల్యేలు తమతో వచ్చారన్న శిండే.. ఇప్పుడు ఏకంగా ‘సిక్స్’ కొట్టామని పేర్కొన్నారు. శివసేన రెండో విడత విస్తరణ ప్రణాళికగా ఈ చేరికను అభివర్ణించారు.
అప్పట్లో ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా..మళ్లీ దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబాయిలో గత వారం రోజులుగా కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా కోవిడ్-19, స్వైన్ ఫ్లూ , ఇన్ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు గణనీయంగా పెరిగాయి. దీంతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతూ అనేకమంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
దాదాపు నెల రోజుల పాటు స్వైన్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు కాగా, గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పుంజుకున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. బ్రీచ్ క్యాండీ వంటి ఆస్పత్రుల్లోని ల్యాబ్‌లలో ప్రతిరోజూ 7కు పైగా కోవిడ్ లేదా స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకేసారి పలు వైరస్లు వ్యాప్తిలో ఉండటంతో, లక్షణాలు ఒకేలా ఉండటంతో నిర్ధారణ కోసం పీసీఆర్ పరీక్షలు అవసరమవుతున్నాయని సీనియర్ డాక్టర్లు చెప్తున్నారు.
అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం స్వల్ప లక్షణాలతోనే ఉన్నప్పటికీ, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సొంతంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని, లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
తమిళనాడులోని తూత్తుకుడి విమానాశ్రయ మైదానానికి అత్యంత సమీపంలో ఓ అరుదైన సుడిగాలి సుడిగుండం ఏర్పడింది. ఆకాశం నుంచి నేల వరకు పొడవుగా విస్తరించిన ఈ సుడిగుండం కొద్ది సేపు కనిపించి స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఇటువంటి దృశ్యాలు దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సుడిగుండాన్ని అత్యంత సమీపం నుంచి చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత ప్రధాని నౌకాదళానికి మరింత బలం చేకూర్చేలా ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ అనే మూడు యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు. కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధనకు ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రాజెక్ట్–17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దుణగిరి.. 149 మీటర్ల పొడవైన అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. అత్యాధునిక రాడార్లు, సెన్సర్లు, బ్రహ్మోస్ యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులతో ఈ యుద్ధనౌకను సన్నద్ధం చేశారు. సముద్రంలో బహుముఖ ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం దీని ప్రత్యేకత. 110 మీటర్ల పొడవున్న ఐఎన్ఎస్ సంశోధక్‌ను సముద్ర సర్వేలు, నావిగేషన్ అధ్యయనాలు, పోర్టుల అభివృద్ధి, సముద్ర మార్గాల మ్యాపింగ్ కోసం రూపొందించారు. ప్రత్యేక హెలికాప్టర్ సదుపాయంతో పాటు విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.
77.6 మీటర్ల పొడవున్న ఐఎన్ఎస్ అగ్రయ్‌ను యాంటీ సబ్‌మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్‌గా అభివృద్ధి చేశారు. తీర ప్రాంత జలాల్లో జలాంతర్గాములను గుర్తించడం, శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం, దాడులు నిర్వహించడం వంటి విధులకు ఇది అనువుగా ఉంటుంది. 88 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో 30 ఎంఎం నేవల్ గన్, వాటర్ జెట్ ఆధారిత డీజిల్ ఇంజిన్ వ్యవస్థను అమర్చారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ మూడు యుద్ధనౌకల చేరికతో భారత నౌకాదళం మరింత ఆధునికంగా, మరింత శక్తివంతంగా మారనుంది.
కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన ఆరోపించారు. కావేరి జలాల పంపిణీపై ఇప్పటికే ఉన్న నిబంధనలను ఉల్లంఘించే విధంగా కర్ణాటక వ్యవహరిస్తోందని విమర్శించారు. కర్ణాటక చేపడుతున్న చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మేకెదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని తమిళనాడు అసెంబ్లీ కోరింది.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో యాత్రికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ధల్లి… సంజౌలి బైపాస్కు దూరంగా ఉండాలని సిమ్లా పోలీసులు ప్రజలకు సూచన జారీ చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.




Total views : 196456