పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు, గ్యాస్ రిఫైనరీలే లక్ష్యంగా దాడులు, హర్మూజ్ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మనదేశంపైనా పడింది. ఐతే క్రమక్రమంగా ఎల్పీజీ కష్టాలకు బ్రేక్ పడుతోంది. తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు చేరింది.. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఒక కార్గో నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పిక్సిస్ పయనీర్ నౌక 16 వేల 714 టన్నుల ఎల్పీజీని మోసుకొని మంగళూరు పోర్టుకు చేరుకుంది. వచ్చే వారంలో ఇంకా 72 వేల 700 టన్నుల ఎల్పీజీ రానుంది. ఈనెల 25న 26వేల 687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్..ఈనెల 29న 30 వేల టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత్‌కు చేరనుంది. అంతే కాదు..గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నౌకలు, నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన టైమ్‌లో నౌక భారత్‌కు చేరడం గర్వకారణంగా చెబుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఇంధన సరఫరాలను నిర్ధారించడానికి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం బిగ్ రిలీఫ్‌గా మారింది.
National
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. దేశంలో ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 8 వేల 931 రోజులుగా ఆయన పాలకుడి హోదాలో ఉన్నారు. ఇందులో గుజరాత్ సీఎంగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. నిన్నటి వరకు ఈ రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. 2001 లో గుజరాత్ మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ… వరుసగా 13 ఏళ్లు అదే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2014 లో అనూహ్యంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన ఆయన… అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి కూడా మోదీనే కావడం విశేషం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించి, ఎక్కువకాలం ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేత కూడా మోదీయే. అలాగే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వ్యక్తుల్లో మోదీ రెండో స్థానంలో ఉన్నారు.
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరా దెబ్బతింటోంది. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. భారత్ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎల్పీజీ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ DME డైమిథైల్ ఈథర్ అనే కొత్త ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారించింది. ఇది ఎల్పీజీకి సమానంగా ఉపయోగించగల వాయువు. రసాయన పరంగా కూడా ఇది ఎల్పీజీకి దగ్గరగా ఉండటంతో వంట గ్యాస్‌గా సులభంగా ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దీనిని ‘ప్లాన్-బి’గా ప్రభుత్వం పరిగణిస్తోంది. డీఎంఈను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు దేశంలోనే లభిస్తాయి. బయోమాస్, బొగ్గు, మిథనాల్, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ వంటి వనరులతో దీనిని తయారు చేయవచ్చు. అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరులతోనే గ్యాస్ తయారు చేసే అవకాశం ఉంటుంది.
డీఎంఈను నేరుగా వంట గ్యాస్‌గా వాడవచ్చు. అలాగే ఎల్పీజీతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. దీన్ని బ్లెండింగ్ అంటారు. మొదటి దశలో ఎల్పీజీలో కొంత శాతం డీఎంఈ కలిపి వినియోగించే ప్రణాళికను పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతమైతే క్రమంగా పూర్తిగా ప్రత్యామ్నాయ ఇంధనంగా మారే అవకాశం ఉంది. డీఎంఈ వినియోగంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్తగా స్టవ్‌లు లేదా సిలిండర్లు కొనాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇళ్లలో ఉపయోగిస్తున్న ఎల్పీజీ సిలిండర్లు, రెగ్యులేటర్లు, పైపులు, బర్నర్ స్టవ్‌లు ఇదే విధంగా పనిచేస్తాయి. అందువల్ల వినియోగదారులకు అదనపు ఖర్చు ఉండదు.
ఈ ప్రాజెక్టుపై CSIR – Council of Scientific and Industrial Research శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి డీఎంఈ ఉత్పత్తి విధానాన్ని పరీక్షిస్తున్నారు. దీనిని తక్కువ ఖర్చుతో తయారు చేయడం ఎలా అనే దానిపై ప్రత్యేకంగా పరిశోధనలు సాగుతున్నాయి. డీఎంఈను స్వచ్ఛమైన ఇంధనంగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని కాల్చినప్పుడు సాధారణంగా తక్కువ కాలుష్యం ఉత్పత్తి అవుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.
ప్రీమియం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే, బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరను పెంచాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటర్‌పై రూ.22 పెరిగింది. సాధారణ డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసేంత వరకు… సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి.హరీష్ ఈ అంశంపై మాట్లాడారు. పాకిస్తాన్‌ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పేర్కొన్నారు. 1960లో మంచి ఉద్దేశంతో ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసినప్పటికీ, గత ఏడాది జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారత్ దీనిని నిలిపివేసింది. దీనిపై పాకిస్థాన్ పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టినప్పటికీ భారత్ మాత్రం తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూనే ఉంది. తాజాగా మరోసారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్ ఈ అంశంపై అక్కసు వెళ్లగక్కింది. అయితే భారత్ కూడా అదే స్థాయిలో దాయాదికి దీటుగా జవాబిచ్చింది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రఖ్యాత స్కైట్రాక్స్ సంస్థ నుంచి ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఏషియా 2026’ అవార్డును గెలుచుకుంది. ఈ విమానాశ్రయానికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం ఇది ఐదోసారి. లండన్‌లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2026 కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు. ఈ అవార్డుతో పాటు శంషాబాద్ విమానాశ్రయం మరికొన్ని ఘనతలను కూడా సాధించింది. భారత్, దక్షిణాసియాలో ‘రెండో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా, మూడో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది.
ప్రజాస్వామ్య విలువల పరరక్షణే ధ్యేయమని మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై వేసిన సస్పెన్షన్ రద్దయ్యింది. ఇవాళ ఎంపీల సస్పెన్షన్ రద్దు చేస్తున్నట్లు లోక్ సభ ప్రకటించింది. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నివాళులర్పించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రజల గొంతుకను సభలో వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
లోక్ సభ సజావుగా సాగేందుకు స్పీకర్ ఓం బిర్లా చేసిన సూచనలను ప్రస్తావించారు. సభలోకి ప్లకార్డులు తేవద్దని, వెల్‌లోకి రాకూడదని స్పీకర్ కోరారని, సభా మర్యాదలను తాము గౌరవిస్తామని తెలిపారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించడానికి స్పీకర్ తగిన అవకాశం ఇవ్వాలని ఎంపీ చామల విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షం నుండి అడ్డంకులు కలగకుండా, ఆయన మైక్రోఫోన్ కట్ చేయకుండా స్పీకర్ తటస్థంగా వ్యవహరించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇండియా పోస్టల్ లో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం.. 24 గంటల్లో ఫాస్ట్ డెలివరీ సేవలు ప్రారంభం
ఇండియా పోస్ట్ వినియోగదారుల కోసం సరికొత్త, వేగవంతమైన సేవల్ని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విప్లవాత్మకమైన మార్పుతో ఇకపై ఉత్తరాలు, పత్రాల కోసం రోజులతరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కేంద్ర సమాచారశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి న్యూఢిల్లీలోని గ్యారెంటీడ్ నెక్స్ట్ డే డెలివరీ సేవల్ని ప్రారంభించారు. ఇండియా పోస్ట్ తన నెట్ వర్క్ ను ఈ కొత్తసేవలతో మరింత బలోపేతం కానుంది. ఇందులో మూడు కేటగిరీలను వినియోగదారులకు పరిచయం చేసింది. ఉత్తరాలు, పత్రాల కోసం 24 స్పీడ్ పోస్ట్, వస్తువుల ఫాస్టెస్ట్ డెలివరీ కోసం 24 స్పీడ్ పోస్ట్ పార్శిల్, నిర్ణీత సమయంలో డెలివరీ చేసే సేవల కోసం 48 స్పీడ్ పోస్ట్ కేటగిరీలను తీసుకొచ్చింది. తొలివిడతలో ఆరునగరాల్లో ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా వంటి నగరాల్లో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.
ఇండియా పోస్టులో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 24 గంటల్లో ఇండియా పోస్ట్ డెలివరీ సేవలు ప్రారంభించడం ద్వారా 30 కోట్లమంది ఈ-కామర్స్ వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కొత్తగా వచ్చే సేవలతో గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. లాజిస్టిక్స్ లో 60 శాతం వాటా ఈ ప్రాంతాల నుంచే వస్తోందని పెమ్మసాని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ ట్రాకింగ్, ఓటీపీ డెలివరీ, జియో ట్యాగింగ్ విధానాలను ఇండియా పోస్ట్ డెలివరీల్లోనూ అమలు చేస్తున్నామని, 24-48 గంటల్లో 98 శాతం డెలివరీలు పూర్తిచేయాలన్నదే ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రైవేట్ కొరియర్లతో పోలిస్తే తపాలాశాఖలో ధరలు తక్కువగా ఉంటాయన్నారు. అలాగే బిజినెస్ కస్టమర్లకు బుక్ నౌ – పే లేటర్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇది కేవలం చిన్న మార్పు మాత్రమే కాదని, వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణ అని అభివర్ణించారు. ఇండియాపోస్టులో ఆర్థిక అభివృద్ధి కీలకమని పెమ్మసాని వెల్లడించారు.
అసెంబ్లీలో స్పీకర్ అంటే నిస్పక్షపాతంగా వ్యవహరించారు. అధికార, విపక్షాలన్న భేదభావం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అందరి హక్కులను కాపాడాలి. కానీ దురదృష్టవశాత్తూ.. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అయితే కర్ణాటక స్పీకర్ U.T.ఖాదర్ మాత్రం ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి, అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు..
నిజానికి కొంతకాలంగా ఈ అంశంపై సీరియస్‌గా ఉన్న ఆయన… ఎప్పటికప్పుడు అధికారపక్షాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. సభ్యులు వందల సంఖ్యలో ప్రశ్నలు అడిగితే.. పదుల సంఖ్యలో కూడా సమాధానాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అధికారపక్షం బాధ్యత అని గుర్తు చేస్తూనే ఉన్నారు. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఇదే సమయంలో హోం మంత్రి పరమేశ్వర మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్లు… 230 ప్రశ్నలకు గానూ, ఎనభై నాలుగింటికి సమాధానం ఇచ్చాం అని ఘనంగా చెప్పుకున్నారు. దీనిపై విపక్ష నేత ఆర్. అశోక్ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. దీంతో స్పీకర్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభ నిర్వహించేది మంత్రుల కోసం కాదు… సభ్యుల కోసమే అని చెప్పారు. పదేపదే చెబుతున్నా మంత్రులు, అధికారులేం చేస్తున్నారని నిలదీశారు. అధికారులు, మంత్రులు సమావేశమై ఈ సమస్యను పరిష్కరించేంత వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఖాదర్ పీఠం నుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి నచ్చ చెప్పారు. సీఎస్‌ను పిలిచి.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీరియస్‌గా ఆదేశాలిచ్చారు…
తమిళనాడు కరూర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. రైల్వే లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించిన కాలేజీ బస్సును గూడ్సు రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తాంతోణి సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు..నిన్న సాయంత్రం..కుళత్తూర్‌లోని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వేగంగా వచ్చిన గూడ్సు రైలు ఆ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం ధ్వంసం కావడంతో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో కరూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిని కరూర్ ఎంపీ జ్యోతిమణి, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తదితరులు పరామర్శించారు. దిండుక్కల్ జిల్లా కరికాళిలోని రాళ్ల క్వారీ నుంచి..పులియూర్‌లోని ప్రైవేటు సిమెంట్ కర్మాగారానికి కంకర లోడును తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమేంటి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యముందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.