తిరుమల శ్రీవారిని తెలంగాణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బిఆర్ఎస్ బరిలో దిగుతుందన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు. ప్రజా తీర్పుకు శిరసా వహిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కుల గురించి, నది జలాల్లో రావాల్సిన వాటాపై పోరాడేది కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకను మాత్రమే పార్లమెట్ కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. కృష్ణానది జల వాటాపై పోరాడే పార్టీ కేవలం బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనంపై బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. ఆపరేషన్ మ్యానువల్ ప్రకారమే నీటి విడుదల ఉంటుందని తెలిపిన ఆయన…. నాగార్జున సాగర్., శ్రీశైలం ప్రాజెక్ట్ లను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ ఆధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
Brs
పదవులు వస్తాయి పోతాయి… పదవులు శాశ్వతం కాదు… పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని సర్పంచ్లు విజయవంతంగా అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో సర్పంచ్ల ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ సర్పంచ్ల కృషి వల్లే తెలంగాణలోని ఎన్నో గ్రామాలకు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయన్నారు. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులను ఇప్పించేందుకు ప్రతిపక్షంలో ఉన్నందున పోరాడుతామని చెప్పారు. రాజకీయాల్లో ఎదురుదెబ్బలు సహజమన్నారు. గోడకు కొట్టిన రబ్బర్ బంతి తరహాలో మళ్లీ తప్పకుండా తిరిగి వస్తామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో త్వరలో పదవీకాలం ముగియనున్న సర్పంచ్ ల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. అనంతరం, సర్పంచ్ లకు చేసిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశాం. పదవులు వస్తాయి, పోతాయి అంతేకాని శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యం. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే, ప్రజలు కెసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారు. ఓ కవి రాసిన పాట, పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసింది. తెలంగాణ లో లాగా ప్రతి పల్లెలో డంప్ యార్డ్, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాలు, ట్యాంకర్ లు, ట్రాక్టర్లు, నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని చాలెంజ్ చేశానన్నారు. సర్పంచ్ లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్ రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నానన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రానికే 82 అవార్డులు వచ్చాయి. దేశంలోనే 30 శాతం అవార్డులు మన రాష్ట్రానికే వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకం లో దేశంలోనే టాప్ ట్వంటీ లో 19 గ్రామాలు మనవే కావడం గొప్ప విషయమని సర్పంచ్ ల పనితీరును కొనియాడారు. పెండింగ్ బిల్లుల సమస్య పై మీ తరుపున ప్రభుత్వం తో మాట్లాడడానికి, గొంతు విప్పడానికి నేను సిద్దంగా ఉన్నానని ధీమాను ఇచ్చారు. దేశంలో చెక్ పవర్ ఉన్నది సర్పంచ్ లకు, రాష్ట్రపతికి మాత్రమే అన్నారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కలియుగ వెంకటేశ్వర స్వామి అన్ని కోర్కెలను తీర్చాడని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలు కోరుకున్నట్లు గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా పాలన జరగలేదని ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా పాలనను కోరుకుంటున్నారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ప్రజా పాలన, ప్రజలు మెచ్చే పాలన కొనసాగే విధంగా నడుచుకుంటుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూరాబాద్ లో శ్రీవారి దేవాలయం నిర్మాణం చేయాలని టీటీడీని కోరాలని భావించాను. టిటిడి ఈఓ చైర్మన్ అందుబాటులో లేని కారణంగా అడగలేదని హుజూరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థల సమీకరణ చేస్తామని టీటీడీ ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రిని కూడా అడుగుతామని అన్నారు. విభజన సమయంలో… విభజన అనివార్యమైనప్పుడు కచ్చితంగా ఏపీని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది దానికి కట్టుబడి ఉంటుందని, కచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారనడం సరికాదని… ఇక నుంచి బీఆర్ఎస్ నేతలు అలాంటి మాటలు మాట్లాడవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారని ఆ పార్టీ నేతలు వివిధ సందర్భాలలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక నుంచి మన నాయకులు ఎవరూ అలా మాట్లాడవద్దని సూచించారు. తెలంగాణ వచ్చాక రెండుసార్లు మనల్ని గెలిపించింది అదే ప్రజలు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి, మనకు ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే అన్నారు. పద్నాలుగు చోట్ల అతి స్వల్ప తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.
తాము ఓడిపోయినంత మాత్రాన ప్రజలను వదిలేసేది లేదని… వారి పక్షాన పోరాడతామని… ప్రజలే తమకు దేవుళ్లని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని… తెలంగాణ నుంచి కేసీఆర్ను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి… చావునోట్లో తల పెట్టి తెలంగాణను సాధించారన్నారు. తెలంగాణ రావడం వల్లే మనకు నీళ్లు… నిధులు.. నియామకాలు వచ్చాయన్నారు. మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ రావడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు వచ్చాయన్నారు. వీటన్నింటికి కారణం కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. అయితే ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పని చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read Also..
కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మన పార్టీ అభివృద్ధి ఓడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనం పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పని చేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని… కానీ ఆరు లక్షలకు పైగా ఇచ్చామని వెల్లడించారు.
దేశంలో అత్యధిక ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వేతనాలను 73 శాతం వరకు పెంచామన్నారు. 29 లక్షల పెన్షన్లను 46 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అయితే వీటిని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ప్రజలను ఎప్పుడూ క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల సౌకర్యం కోసం చూసిందే తప్ప రాజకీయ ప్రయోజనం కోసం ఆలోచించలేదన్నారు. అయినా ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదన్నారు. మూడోవంతు సీట్లను గెలుచుకున్నామని గుర్తు చేశారు. 14 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయామన్నారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఓట్ల తేడా కేవలం 1.85 శాతమేనని చెప్పారు.
స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ… లోక్ సభ వరకు బీఆర్ఎస్కు బలమైన నాయకత్వం ఉందని కేటీఆర్ అన్నారు. అన్నింటికి మించి మనకు కేసీఆర్ వంటి నేత ఉన్నారని పేర్కొన్నారు. ఎవరూ నిరుత్సాహపడవద్దని… అందరినీ కలుపుకొని ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలను చేపడదామని తెలిపారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు… పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అందించినా ఆ ప్రాంతాల్లో ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వలేదన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా రసవతరంగా మారాయి. మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. రేపు శుక్రవారం రోజున మున్సిపల్ అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ 19 మంది అధిష్టానికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కౌన్సిలర్లు ప్రకటించడం రాజకీయ ప్రకంపణలు రేపుతుంది.
Read Also..
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని.. ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటోందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. విద్యాసంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్కు తగదన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలిపారు. సరస్వతి దేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉందని, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జిల్లాల పర్యటనలో సైతం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారని తెలిపారు. హైదరాబాదులో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించామన్నారు. నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తీర్చేందుకు ముందుండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బి ఆర్ ఎస్ పార్టీదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూషించడం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.





Total views : 92849