తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్య, సంక్షేమం, యువత, మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను రూపొందించింది. విద్యారంగానికి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించడంతో పాటు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిన విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పాఠశాల విద్య కోసం 44,527 కోట్ల రూపాయల భారీ కేటాయింపులు చేసింది. విద్యా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ‘పెరుంతలైవర్ కామరాజర్ మోడల్ స్కూల్స్’ పేరుతో ఆధునిక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యతో పాటు వసతి, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ పథకం కోసం మౌలిక వసతుల అభివృద్ధికి 125 కోట్లు రూపాయల కేటాయించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల మెరుగుదలకు ‘సూపర్ క్లీన్.. సూపర్ క్యాంపస్’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలి దశలో 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది. అలాగే ఉన్నత విద్యార్థులకు ‘వెట్రి ల్యాప్టాప్’ పథకం కింద ల్యాప్టాప్లు అందించేందుకు 2 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు కూడా నిధులు కేటాయించింది.
సంక్షేమ రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే పథకానికి 560 కోట్లు రూపాయలు కేటాయించింది. అలాగే పెళ్లి రోజు వధువులకు ఎనిమిది గ్రాముల బంగారు నాణెం, పట్టు చీర అందించే పథకానికి 812 కోట్లు రూపాయలను ప్రతిపాదించింది. అయితే గత ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక లోటును తగ్గించేందుకు అదనంగా 16 వేల కోట్ల రూపాయల ఆదాయం సమీకరించడంపై దృష్టి పెట్టినట్లు బడ్జెట్లో వెల్లడించింది.
విద్యకు అత్యధిక ప్రాధాన్యం… విద్యార్థులకు కొత్త పథకాలు… మహిళలు, శిశువుల సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు… ఇవన్నీ తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి బడ్జెట్లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. అయితే భారీ సంక్షేమ పథకాలతో పాటు పెరుగుతున్న రాష్ట్ర అప్పులు, అదనపు ఆదాయ సమీకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఎలా సాధిస్తుందనేది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.