అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా చెబుతుంటే… మరోవైపు ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ ఖండిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తుండగా… ఇరాన్ మాత్రం ఒత్తిడికి లొంగేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి…?
హార్ముజ్ జలసంధి… ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచ సముద్ర మార్గంలో తరలే ముడి చమురులో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండా వెళ్తుంది. అలాంటి వ్యూహాత్మక ప్రాంతం చుట్టూ అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.
హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే పరిస్థితులు స్పష్టమవుతాయని… లేకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. హార్ముజ్ అంశంపై చర్చలు చివరి దశలో ఉన్నాయని… ఇరాన్‌కు ఇదే చివరి అవకాశమని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ట్రంప్ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని… అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో… సమావేశం కావాలని కోరుతూ… మరోవైపు చర్చలే లేవని చెప్పడం ఇరాన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
అయితే అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మినహా చర్చల బృందంలోని సభ్యులంతా దేశంలోనే ఉన్నారని… అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు.
అయితే ఒమన్‌తో మాత్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత… నౌకల రాకపోకలకు తాత్కాలిక ఏర్పాట్లపై మాత్రమే చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ చర్చల్లో అమెరికా లేదా ఇతర దేశాలు భాగస్వాములు కావని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే… గల్ఫ్ ప్రాంతంలో వరుస దాడుల ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి. అమెరికా తన సైనిక బలగాలు, నౌకాదళాన్ని అప్రమత్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ కూడా తన నౌకాదళాన్ని హై అలర్ట్‌లో ఉంచింది. గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే చర్యలను పలు దేశాలు ముమ్మరం చేశాయి.
హార్ముజ్ జలసంధి మూసివేత భయం ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే… ఆసియా, యూరప్ దేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు మాటల యుద్ధం… దౌత్య ప్రయత్నాలు… సైనిక హెచ్చరికలు… ఇవన్నీ ఒకేసారి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా–ఇరాన్ సంబంధాలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి వివాదం దౌత్య చర్చలతో ముగుస్తుందా…? లేక మరోసారి గల్ఫ్ ప్రాంతంలో ఘర్షణలకు దారితీస్తుందా…? అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.