నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల ప్రభుత్వ పోరంబోకు భూమిపై నిమ్మల కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు చట్టబద్ధమైన హక్కులు లేకపోయినా తమదేనంటూ క్లెయిమ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సదరు భూమి తమదేనంటూ వారు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే, విచారణ అనంతరం అక్టోబర్ 2025లో వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.కోర్టులో చుక్కెదురైనప్పటికీ, నిందితులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ఈ భూమిని తమకు క్రమబద్ధీకరించిందంటూ ఏకంగా ఐదు నకిలీ జీఓలను (Fake GOs) సృష్టించారు. ఈ ఫేక్ జీఓలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తూ ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ భారీ భూ మోసం వెలుగులోకి వచ్చింది.
()హైదరాబాద్‌లో గండిపేట భూకబ్జా యత్నం కేసు దర్యాప్తు వేగవంతమైంది. నకిలీ పత్రాలు, నకిలీ జీవోలను సృష్టించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.నకిలీ పత్రాలు, నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టించి భూమిపై హక్కులు పొందేందుకు ప్రయత్నించారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసులో ఇప్పటికే నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయికిరణ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, సునీల్, రాధాకృష్ణ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.





Total views : 90578