Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Crime ఛత్తీస్‌గఢ్‌ గుండర్‌దేహి గ్రామంలో దారుణం.

ఛత్తీస్‌గఢ్‌ గుండర్‌దేహి గ్రామంలో దారుణం.

by CVR NEWS
ఛత్తీస్‌గఢ్‌ గుండర్‌దేహి గ్రామంలో దారుణం

ఛత్తీస్‌గఢ్‌లో సినిమాను తలపించేలా హైడ్రామా నడిచింది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్కు డ్రైవర్, 11 ఏళ్ల బాలికను ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. ఐతే ఆ బాలికను ఢీకొట్టిన డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు దాదాపు 60 కిలోమీటర్ల దూరం..రెండు గంటల పాటు ఛేజింగ్‌ చేసి మరీ చివరకు అతడిని అరెస్ట్ చేశారు. రాజ్‌నంద్‌గావ్-మాన్‌పూర్ రహదారిపై ఉన్న గుండర్‌దేహి గ్రామంలో జరిగింది ఈ దారుణ ఘటన. వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు పూనమ్ అనే 11 ఏళ్ల బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే, డ్రైవర్ ట్రక్కును ఆపకుండా, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మోహ్లా వైపు వేగంగా పారిపోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మోహ్లా పోలీస్ స్టేషన్ వెలుపల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, డ్రైవర్ అక్కడే ఆగి ఉన్న మరో ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టి, పోలీసు బ్యారికేడ్లను బద్దలు కొట్టుకుని ముందుకు దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు మాన్‌పూర్‌లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం వద్ద మరోసారి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. డ్రైవర్ వాటిని కూడా ఢీకొట్టి, బారికేడ్లలోని కొన్ని భాగాలను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సమయంలో పోలీసులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

దాదాపు 60 కిలోమీటర్ల ఉత్కంఠభరితమైన ఛేజింగ్ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్కోట్టి గ్రామ సమీపంలో ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి, చికిత్స కోసం మాన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంతో ఆగ్రహానికి గురైన గుండర్‌దేహి గ్రామస్థులు, బాలిక మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రెండు గంటల పాటు రాకపోకలను అడ్డుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: