నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆమె చేస్తున్న సేవలను అభినందించిన ఎమ్మెల్యే..ఆమెకు తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందేనని చాటుతోంది మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డుకు చెందిన అంగవైకల్య యువతి సుంకోజు శివాని. ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదనే లక్ష్యంతో ఆమె స్వయంగా ఇంటింటికి వెళ్లి SIR దరఖాస్తు ఫారాలను నింపుతూ అవగాహన కల్పిస్తోంది.ఈరోజు పట్టణంలో SIR కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..శివాని సేవలను చూసి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు.ఇప్పటికే 200 ఫారాలు నింపిన శివాని సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శమన్నారు.ఆమె పీజీ చదివిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే..వెంటనే జిల్లా కలెక్టర్‌తో వీడియో కాల్ లో మాట్లాడి.. శివానికి తగిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.నియోజకవర్గంలోని BLO,BLAలు, ప్రజాప్రతినిధులు అందరూ శివానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
Latest News
సిరియా రాజధాని డమాస్కస్‌లో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆ దేశ పర్యటనలో ఉండగా.. ఆయన బస చేసిన హోటల్ వద్దే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో సమావేశమయ్యేందుకు అధ్యక్ష భవనంలోకి మెక్రాన్ వెళ్లిన వెంటనే సమీపంలోని ఫోర్ సీజన్స్ హోటల్ వద్ద పేలుళ్లు సంభవించడం గమనార్హం. సుదీర్ఘ కాలంగా అంతర్యుద్ధంతో నలిగిపోయిన సిరియా.. ఇటీవల అక్కడ పాలకులు మారిన తర్వాత పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో పలు దేశాలు విధించిన అనేక ఆంక్షలను ఎత్తివేయడానికి పాశ్చాత్య దేశాలను ఒప్పించడంలో కీలక పాత్ర వహించిన మెక్రాన్.. అల్-షరా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆ దేశంలో కీలక పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతినిధుల బృందంతో కలిసి డమాస్కస్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్లోనే బస చేశారు.
వివిధ రంగాల్లో ఇండోనేసియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదపడనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.ఇరుదేశాల మధ్య బలమైన సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేసియా రాజధాని జకార్తాకు చేరుకున్న ప్రధాని మోదీకి..ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో, నలుగురు మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం జకార్తా గగనతలంలోకి ప్రవేశించగానే ఎఫ్-16 , సుఖోయ్-30 విమానాలు ఎస్కార్టుగా ఏకకాలంలో ప్రయాణించి వినూత్న రీతిలో స్వాగతించాయి. ఇదిలా ఉండగా.. తమ దేశానికి విచ్చేసిన ప్రధాని మోదీని ఇండోనేసియా ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ పురస్కారంతో గౌరవించింది.. ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో.. ఈ మెడల్‌ను మోదీకి అందజేశారు
తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ .. ఇండోనేసియాలో దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం దిశగా పలు ఒప్పందాలు జరిగాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రబోవో..మోదీ పై ప్రశంసలు గుప్పించారు.రామాయణ కాలం నుంచి భారత్-ఇండోనేసియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. మొత్తంగా భవిష్యత్ లో ఇరుదేశాల బంధం మరింత బలోపేతం చేసే దిశగా ప్రబోవో..మోదీ చర్చలు సత్ఫలితాస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగతనాల కేసుల్లో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మొత్తం 105 కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రయ్యను ఎనిమిది నెలలపాటు ప్రత్యేక నిఘా అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఇళ్లు ఖాళీగా ఉంచే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సచివాలయంలో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మార్చడమే ధ్యేయంగా సాగిన ఈ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసే దిశగా అడుగులు పడ్డాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆయా శాఖల ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సచివాలయంలో 19వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు వీలుగా పలు కీలక రంగాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.ముఖ్యంగా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడమే లక్ష్యంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా.. మొత్తం 9 వేల 76 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 11 మెగా ప్రాజెక్టులపై ఈ ఎస్ఐపీబీ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఆమోద ముద్ర వేశారు.
బ్యాంకులను భారీ ఎత్తున మోసగించి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియ తుది దశకు చేరింది. తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు యూకే కోర్టుల్లో అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను కోల్పోయిన తరువాత.. ఆయన ‘యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ను ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో నీరవ్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియను యూకే ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2019 మార్చి నుంచి లండన్ జైలులో ఉన్న నీరవ్ మోదీపై పీఎన్బీ రుణ మోసం, మనీలాండరింగ్ కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల్లో ఆయనను భారత్‌కు తీసుకురావాలని సీబీఐ, ఈడీ చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తీసుకురావాలనుకున్న యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదాస్పద ఫీచర్ పై స్పందించేందుకు వాట్సప్ మాతృసంస్థ మెటాకు మరో మూడురోజులు గడువిచ్చింది కేంద్రం. అయితే..ఈ ఫీచర్ పై ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా ముగిసేంతవరకూ భారత్‌లోకి అందుబాటులోకి తీసుకురాబోమని మెటా ప్రతినిధులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకరితో ఒకరు చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. అయితే వాట్సప్..ఈ ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసేలా కొత్త ఫీచర్ ను డిజైన్ చేసింది. ఐతే దీనివల్ల ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కాములు, ఒకరిపేరుతో మరొకరు చలామణి అయ్యే ముప్పు విపరీతంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.
దీనిపై వివరణ ఇచ్చిన వాట్సాప్..సైబర్ నేరాలను అడ్డుకునేందుకు బలమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో నకిలీ ఐడీలు క్రియేట్ చేయకుండా..ఆయా పేర్లను ముందే హోల్డ్ లో ఉంచినట్లు తెలిపారు. అలాగే ఇందులో లిమిటెడ్ సెర్చ్ ఉంటుందని, ఒకరి యూజర్ నేమ్ పూర్తిగా తెలిస్తేనే మెసేజ్ చేయగలరని, ఊహాజనితంగా పేర్లను టైప్ చేసి వెతికే ప్రయత్నాలను సిస్టమ్ బ్లాక్ చేస్తుందని తెలిపింది. ఎవరైనా కొత్త వ్యక్తి యూజర్‌నేమ్ ద్వారా మొదటిసారి మెసేజ్ చేస్తే.. ఆ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయింది? వారు ఏ దేశానికి చెందినవారు? మనతో ఏవైనా మ్యూచువల్ గ్రూప్స్ ఉన్నాయా? అనే వివరాలను వాట్సాప్ యూజర్‌కు చూపిస్తుందని వివరించింది.
ఇదిలా ఉంటే..కేవలం వాట్సాప్ మాత్రమే కాదు..ఇప్పటికే యూజర్‌నేమ్ ఫీచర్‌ను రన్ చేస్తున్న టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా కేంద్రం నోటీసులు పంపింది. ఈ ఫీచర్ల ద్వారా జరుగుతున్న మోసాలను, నకిలీ అకౌంట్లను ఎలా అరికడుతున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు, పైరసీ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నందుకు టెలిగ్రామ్‌కు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్‌లో చైల్డ్ అబ్యూస్ మెటీరియల్‌పై మెటాకు కేంద్రం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.
కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా వయనాడ్‌లో భారీ విపత్తు సంభవించింది. మేప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వయనాడ్ – మలప్పురం జిల్లాలను కలుపుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న‘టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్’ సైట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయ కంటైనర్లు, కార్మికుల బస్సులు, కార్లు, జేసీబీలు వంటి భారీ యంత్రాలు పూర్తిగా మట్టి దిబ్బల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో పనుల్లో ఉన్న సుమారు 30 నుంచి 50 మంది వరకు కార్మికులు మట్టి శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని రెస్క్యూ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురు కార్మికులను ప్రాణాలతో కాపాడగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘోర ప్రమాదం పై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌తో పాటు కోజికోడ్ నుండి NDRF బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, భారీ వృక్షాలు కూలిపోవడం, మీనాక్షి బ్రిడ్జ్ సమీపంలోని చిన్న నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరోవైపు ఈ ప్రాంతంలో కొన్ని ఇళ్లతో పాటు హోమ్‌స్టేలు కూడా ఉండటంతో, వర్షాల సీజన్ కారణంగా ఎవరైనా పర్యాటకులు కూడా మట్టి శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
దక్షిణకొరియాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన..ఆ దేశ రాజధాని వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ అండ్ ఎల్జీ ఓవర్సీస్ హోల్డింగ్ కంపెనీస్ హెడ్ యున్-జు కోహ్ తో భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. మూలపేటలో ఎస్ఏఎఫ్, బయో-ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించి, జీవ ఇంధనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.ప్లాస్టిక్ రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం అందించిన తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారుఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్-జు కోహ్.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కాసులు కురిపించుకుంటున్న అగాపే హోలిస్టిక్ క్లినిక్ బాగోతం వెలుగులోకి వచ్చింది. చట్టబద్ధమైన వైద్య అర్హతలు లేకుండానే, డాక్టర్ బోర్డు తగిలించుకోకుండానే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ వైద్య దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగర కేంద్రంగా సుబ్రమణ్యం అనే వ్యక్తి ఎలాంటి సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్లు లేకుండా అగాపే హోలిస్టిక్ క్లినిక్ పేరుతో పెద్ద ఎత్తున వైద్య సేవలు నిర్వహిస్తున్నాడు. కైరోప్రాక్టిక్, ఆక్యుపంచర్, ఫిజియోథెరపీ, స్పైన్ థెరపీ, హోలిస్టిక్ మెడిసిన్ అంటూ రకరకాల పేర్లతో హైటెక్ వైద్యం ముసుగులో అమాయక ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. వరంగల్‌తో పాటు ఖమ్మం జిల్లాలో కూడా బ్రాంచీలు ఏర్పాటు చేసి ఈ నకిలీ సామ్రాజ్యాన్ని విస్తరించడం చూస్తుంటే ఇతని వెనుక ఉన్న శక్తులెవరో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక క్లినిక్ నడపాలంటే సంబంధిత వైద్య మండళ్లు, ఆరోగ్య శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ ఈ క్లినిక్‌కు ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్లు లేవని సమాచారం. పేరుకు ముందు డాక్టర్ అని వేసుకోకపోయినా.. లోపల మాత్రం రోగులకు హై-లెవల్ ట్రీట్మెంట్లు ఇస్తూ చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. సరైన డిగ్రీ, కనీస అర్హత లేకుండా స్పైన్ థెరపీ లాంటి సున్నితమైన వైద్యం చేయడం రోగుల ప్రాణాలకే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఇంతపెద్ద దందా సాగుతున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. ఇప్పటివరకు ఈ క్లినిక్‌పై ఎలాంటి విచారణ జరపకపోవడం, చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమాయక రోగుల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ఈ అగాపే హోలిస్టిక్ క్లినిక్‌పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి సదరు వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల విచారణ అనంతరమే ఈ దందా వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






Total views : 194569