గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. వేసవి తాపంతో, అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో చల్లదనాన్ని ఇచ్చింది. అయితే, బలమైన ఈదురు గాలుల కారణంగా పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచి భారీ వర్షం కురిసింది.కొన్ని రోజులుగా ఉన్న ఉక్కపోతకు ఉపశమనం లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఈదురుగాలులు, వడగండ్ల వర్షం షాక్ ఇచ్చాయి. నరసరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.భారీ ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురవడంతో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ప్రజలు షాపులు, భవనాల వద్ద ఆశ్రయం పొందారు.ఈదురు గాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండగా, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అర్ధరాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలాయి. అలాగే విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.రోడ్లపై చెట్లు పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ, మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి రహదారులపై పడిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.భారీ గాలులు, వర్షంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నెల్లూరు జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. భారీ గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.




Total views : 89163