హమాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పెను నష్టాన్ని కలిగిస్తున్న ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది. గాజాపై భూతల దాడులను తీవ్రం చేసిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు నో చెప్పింది. హమాస్ అంతం చూసి యుద్ధంలో విజయం సాధించే వరకు వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు నిన్న మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. విజయం సాధించే వరకు యుద్ధం చేస్తామని పేర్కొన్నారు. అమెరికా, దాని మిత్ర పక్షాలు కూడా కాల్పుల విరమణను వ్యతిరేకిస్తున్నాయి.
ఇజ్రాయెల్
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్ చేసింది. గత ఆదివారం రాత్రి ఓసారి భూతల దాడి చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ .. మళ్లీ బుధవారం అర్థరాత్రి కూడా ఉత్తర గాజా బార్డర్ ఏరియాలపై స్వల్ప స్థాయిలో ఎటాక్స్ నిర్వహించింది. ఇందులో భాగంగా హమాస్‌కు సంబంధించి మొత్తం 250 స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈసందర్భంగా హమాస్ కమాండ్ సెంటర్లు, సొరంగాలు, రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ క్షిపణి ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఉత్తర గాజాలోని నివాసాల మధ్యే రాకెట్ లాంచర్లు ఉన్నాయని గుర్తించామని ఆరోపించింది. గాజాలో ఇంధన వనరులు పూర్తిగా అయిపోయాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ఎటాక్ చేయడం గమనార్హం. అయితే ఈ దాడుల్లో ఇరువైపులా ఎంతమేర ప్రాణ నష్టం జరిగిందనే వివరాలు తెలియరాలేదు. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంలో 75 మంది ఉంటున్న ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ గగనతల దాడి చేసింది. ప్రాణనష్టం గురించి తెలియరాలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన గాజా పౌరుల సంఖ్య 6500 దాటింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలాన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారితో తన సంభాషణ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో ఆమె షేర్ చేసింది. ఇజ్రాయెల్ లో తాజా పరిస్థితులపై ఆమె ఆ దేశ రాయబారితో చర్చించింది. ఇజ్రాయెల్ కు తన పూర్తి మద్దతు పలికింది. ‘‘నా హృదయం ఇజ్రాయెల్ చుట్టూనే తిరుగుతోంది. మా హృదయాలూ రక్తమోడుతున్నాయి’’అంటూ వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది. ‘‘ఇజ్రాయెల్ కు, యూదులకు నా మద్దతు విషయమై నేను ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడుతుంటాను. హిందువులు శతాబ్దాలుగా మారణ హోమం ఎదుర్కొంటున్న మాదిరే యూదులకూ అదే పరిస్థితి ఎదురవుతోంది. భారత్ హిందులకు ఎలా ప్రత్యేకమే, యూదులకు కూడా ప్రత్యేక దేశం ఉండాల్సిందే’’అని పేర్కొంది. హమాస్ ను నేటి రావణాసురగా కంగనా అభివర్ణించింది. ‘‘నేడు ఇజ్రాయెల్, భారత్ ఉగ్రవాదంపై పోరాడుతున్నాయి. రావణ దహనం కోసం నేను నిన్న ఢిల్లీకి రాగా, ఇజ్రాయెల్ ఎంబసీకి వెళ్లి, నేటి కాలపు రావణ, హమాస్ వంటి ఉగ్రవాదులతో పోరాడుతున్న ఇజ్రాయెలీలో భేటీ అవ్వాలనుకున్నాను. చిన్నారులు, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం హృదయాలను పిండేస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది’’అని కంగనా రనౌత్ తన అభిప్రాయాలను పంచుకుంది.
ఇజ్రాయెల్ దాడులతో గాజా గజగజా వణికిపోతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులతో ఒక్క రోజే ఏకంగా 700 మంది మృత్యువాతపడ్డారు. హమాస్ వైద్యవిభాగం ఈ మేరకు ప్రకటన చేసింది. రెండు వారాలుగా దాడులు కొనసాగుతున్నప్పటికీ రోజువారీగా చూస్తే మంగళవారం నమోదయిన మరణాలే అత్యధికమని వెల్లడించింది. దయానక పరిస్థితులు నెలకొన్నాయని, సాయం అందాల్సిన ఆవశ్యకత ఉందని హమాస్ విచారం వ్యక్తం చేసింది.
మొత్తం 400 హమాస్ లక్ష్యాలపై దాడులు చేశామని, డజన్ల కొద్ది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. అయితే ఈ ఇస్లామిక్ గ్రూప్‌ను తుద ముట్టించడానికి మరింత సమయం పడుతుందని పేర్కొంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మానవ సంక్షోభం ఏర్పడుతోందని అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తన మద్ధతు ప్రకటించేందుకు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు