కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇంతవరకు జరిగిన పరీక్షలు, ఫలితాలు, చేపట్టాల్సిన పనులపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ నేడు దిల్లీలో సమావేశం కానుంది. చేయాల్సిన పనులపై రోడ్‌మ్యాప్ సహా ఆరు అంశాలపై కమిటీ చర్చించనుంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ సిఫార్సు మేరకు పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ చేసిన పరీక్షలు, వచ్చిన ఫలితాలపై కమిటీ చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్డీఎస్ఏలోని మెంబర్ టెక్నికల్ ఛైర్మన్‌గా జూన్ 30న ఏర్పాటైన ఈ కమిటీలో నీటిపారుదలశాఖ సంయుక్త కార్యదర్శి, ఇంజినీర్ ఇన్ చీఫ్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్, సీడబ్ల్యూసీలోని గేట్ల విభాగం డైరెక్టర్, దిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త షాహిద్ నూర్, సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తలు హనుమంతప్ప, పి.ఎస్.కుంజీర్, నీటిపారుదలశాఖ హైడ్రాలజీ విభాగం ఎస్ఈ సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి తీసుకున్న చర్యలపై నీటిపారుదలశాఖ మొదట ప్రజంటేషన్ ఇస్తుంది. ఇందులో చేసిన పరీక్షలు, ఫలితాలు, జియో టెక్నికల్, జియో ఫిజికల్, స్ట్రక్చరల్ ఇన్వెస్టిగేషన్స్, వీటి ఫలితాలతోపాటు సీకెంట్ పైల్స్ గురించి చర్చిస్తారు. ప్రతిపాదించి చేయని క్రాస్‌హోల్ సెస్మిక్ టెస్టింగ్‌పై కూడా సాంకేతికంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీ పాత్ర, రోడ్‌మ్యాప్ గురించి చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం కూడా ఉంది.
Tag: