ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషన్ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం.. సాధ్యమైనంత వరకు కమిషన్ వ్యవహారాలు ఏకగ్రీవంగా జరగాలి. సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చట్టం చెబుతోంది.
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని వంశీకృష్ణ అన్నారు. ఓట్ల చోరీపై ప్రజల తరఫున ప్రశ్నిస్తామని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉండేలా పారదర్శకత, సమిష్టి నిర్ణయ ప్రక్రియ ఉండాలని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల కమిషన్ మాత్రం ఇటీవల వచ్చిన అభిప్రాయ భేదాల అంశంపై.. తుది నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే జరిగాయని స్పష్టం చేసింది.
Tag: