పశ్చిమాసియాలో భీకరంగా జరుగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరాన్‌పై యుద్ధాన్ని 5 రోజుల పాటు ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజులుగా ఇరాన్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో తాము శాంతికోసం కృషి చేస్తామన్నామని.. మరోవారం రోజుల పాటు చర్చలు జరిగే అవకాశం ఉందని అన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో విధించిన 48 గంటల గడువు ముగుస్తుండటంతో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
అయితే యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేమని కొట్టిపారేసింది. ఆ వ్యాఖ్యలను ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించే కుట్రగా అభివర్ణించింది. ట్రంప్‌తో తాము ఎలాంటి చర్చలూ జరపలేదని, తమ హెచ్చరికలతోనే ఆయన వెనక్కి తగ్గారని స్పష్టం చేసింది. చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు అని విమర్శించింది. యుద్ధ నివారణ కోసం గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని, అయితే తాము చర్చల ప్రతిపాదను తిరస్కరించామని ఇరాన్ స్పష్టం చేసింది. అసలు యుద్ధ విరమణ ప్రతిపాదన చేయాల్సింది, యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెలేనని ఇరాన్ కుండ బద్దలు కొట్టింది.
మరోవైపు గతనెల 28వ తేదీ నుంచి కొనసాగుతోన్న యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం సంక్షోభం దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై భూతల దాడులకు అమెరికా రెడీ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై భూతల దాడులకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటన చేశారు. అయితే, దీనిపై ఇరాన్ మాత్రం భిన్నంగా స్పందించడం గమనార్హం. అసలు ఎటువంటి చర్చలు జరగడం లేదని, ట్రంప్‌ను నమ్మలేమని ప్రకటన చేయడంతో అసలేం జరగుతోందనే టెన్షన్ మిడిల్ఈస్ట్లో నెలకొంది.
మరోవైపు, ట్రంప్ ప్రకటన ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. 110 డాలర్లకు పైగా పలికిన బ్రెంట్ క్రూడాయిల్ ధర ట్రంప్ ప్రకటన తర్వాత 96 డాలర్లకు పడిపోయింది. ట్రంప్ ప్రకటించిన నిమిషాల్లోనే క్రూడాయిల్ 10 శాతానికి పైగా క్షీణించింది.