తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి శ్రద్ధలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో లంబోదరుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. అయితే.. భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా, సంతోషంగా సాగాల్సిన ఈ నిమజ్జన వేడుకల్లో.. ఊహించని అపశృతులు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. పండగ పూట నవ్వులతో వికసించాల్సిన ఇళ్లు.. చిన్నపాటి అజాగ్రత్తల కారణంగా కన్నీటి సముద్రాలుగా మారుతున్నాయి. నిమజ్జన వేడుకలకు వెళ్లిన కొడుకులు శవాలై వస్తుంటే.. ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కాలువలు అన్నీ కూడా గరిష్ట నీటి మట్టంతో నిండుగా ప్రవహిస్తున్నాయి. అత్యధిక ప్రాంతాల్లో నిమజ్జనానికి చెరువులతో పాటు.. నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ వంటి ఉధృతమైన నదులను, కాలువలను భక్తులు ఎంచుకుంటున్నారు. కానీ.. గతంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం వల్ల ఈ చెరువులు, ఘాట్లు చాలా చోట్ల ఊహించని విధంగా లోతుగా మారాయి. ఈ విషయం తెలియక, లోతుపై అవగాహన లేకుండా చెరువులు, నదుల గుంతల్లోకి దిగి భక్తులు జలసమాధి అవుతున్నారు. ఈత తెలిసిన వారు సైతం కేవలం ఒడ్డున ఉంటూనే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు మొత్తుకుంటున్నా.. అతి ఉత్సాహం ప్రాణాల మీదికి తెస్తోంది.
పండగ సంతోషం విషాదంగా మారకుండా ఉండాలంటే ఉత్సవ కమిటీ ప్రతినిధులు, యువత ఖచ్చితంగా కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఊరేగింపుల్లోకి మద్యం సేవించి వచ్చేవారిని పూర్తిగా దూరంగా ఉంచాలని.. ప్రాణాంతకమైన, మూగజీవులను సైతం హడలెత్తించే డీజే సౌండ్ బాక్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని స్పష్టం చేస్తున్నారు. అలాగే, రహదారులపై వాహన రాకపోకలను గమనిస్తూ ముందుకు సాగాలని, ఎత్తైన విగ్రహాలను తరలించే సమయంలో తలపై ఉండే విద్యుత్ తీగల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.నిమజ్జనోత్సవంలో చిన్నారులను నీటి పరిసరాలకు అస్సలు రానివ్వకూడదని.. మందుగుండు సామగ్రి పేల్చే సమయంలో ప్రధాన రహదారులపై కాకుండా సురక్షిత ప్రాంతాల్లో పేల్చాలని హెచ్చరిస్తున్నారు. పోలీసులు సూచించిన నిర్దేశిత మార్గాల్లోనే ఊరేగింపులు సాగాలని, వేషధారణలపై ముందస్తు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.