గోదావరి పుష్కరాల నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధి, ఆక్వా రైతుల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుష్కరాల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదనను తాను అభినందిస్తున్నానని, అయితే సమీక్షల్లో కేవలం టీ, బిస్కెట్లు తినడమే తప్ప గత ఏడు నెలలుగా పనులు ముందుకు సాగడం లేదని అధికారుల తీరుపై మండిపడ్డారు. పుష్కరాల నిధులు, కాలుష్య నివారణపై సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చానని తెలిపారు. ఇక ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పై సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మేధావి కాదని, కరుడుగట్టిన నక్సలైట్, తీవ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిజం సర్వనాశనమైందని, ఉనికి కోసమే తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాదరణతో అద్భుతంగా పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Tag: