ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2026ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ద్వారా 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ చేసి, రాష్ట్ర నూతన రాజధానిగా అమరావతి పేరును అధికారికంగా చేర్చనున్నారు. ఈ బిల్లు ద్వారా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ 2 కు సవరణ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సెక్షన్లో ఉన్న… రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని ఉంటుంది అనే వాక్యం స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుందని చేర్చనున్నారు. అమరావతి అనే పదంలో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం, 2014 ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయని ఈ సవరణలో స్పష్టంగా వివరించనున్నారు. ఈ సవరణ జూన్ 2, 2024 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించనున్నట్లు బిల్లులో పేర్కొనడం గమనార్హం.
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఏకైక రాజధానిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించి అమరావతి పేరును అధికారికంగా చేర్చాలని ఆ తీర్మానంలో కేంద్రాన్ని కోరింది. 2022 మార్చి 3న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సలహా మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానంలో పేర్కొన్నారు.
అసెంబ్లీలో ఆమోదించిన ఈ తీర్మానాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ బిల్లును తీసుకురానుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సవరణ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధతకు చట్టపరంగా తెరపడుతుందని, అమరావతికి తిరుగులేని చట్టబద్ధ హోదా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.





Total views : 149664