Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Latest News వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

by CVR NEWS
వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు

ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం కాదు… బాహ్య ప్రపంచంతో బంధాలు తెగిపోయే ఒక భయంకరమైన దిగ్బంధనం.

గతేడాది జూన్ నెలలో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల కాన్వాయ్‌ల సైరన్లతో ఆ మారుమూల ఏజెన్సీ ప్రాంతం మారుమోగిపోయింది. మూడు వంతెనల నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా వైభవంగా శంకుస్థాపన జరిగింది. శిలాఫలకంపై మంత్రుల పేర్లు మెరిశాయి. ఆ శిలాఫలకాన్ని చూసి గిరిజన బిడ్డలు మురిసిపోయారు. ఇక మన కష్టాలు తీరుతాయని… వర్షం వచ్చినా పిల్లలు బడికి వెళ్తారని.. ఊరిలోకి అంబులెన్స్ వస్తుందని సంబరపడ్డారు.

శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. కానీ అక్కడ మాత్రం తట్టెడు మట్టి కూడా తీయలేదు. రంగులద్దిన ఆ శిలాఫలకాలు నేడు ఎండకు ఎండి, వానకు నానుతూ శిథిలావస్థకు చేరుకుంటున్నాయే తప్ప, వంతెనల నిర్మాణ అడుగులు మాత్రం ముందుకు పడలేదు. లాభాలు రావనో… మరే ఇతర సాంకేతిక కారణాల వల్లో సదరు కాంట్రాక్టర్ ఈ పనులను తాను చేయలేను బాబోయ్ అంటూ చేతులెత్తేసి.. అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల లాభనష్టాల బేరీజులో ఇక్కడి గిరిజనుల ప్రాణాలు బలి అవుతున్నాయి.
మళ్లీ వర్షాకాలం వచ్చేసింది. వాగులు పొంగిపొర్లితే ఈ ఐదు గ్రామాల పరిస్థితి వర్ణనాతీతం. వాగు అవతలి ఒడ్డున ఉన్న పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాలి. చదువుకోవాలన్న వారి ఆశలు వాగు నీటిలో కొట్టుకుపోవాల్సిందే. గర్భిణీలకు నొప్పులు వచ్చినా, ముసలివారికి ప్రాణాంతక పరిస్థితి ఎదురైనా ఊరిలోకి అంబులెన్స్‌ వాహనం రాలేదు. వాగు దాటించలేక, సకాలంలో వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనా అని గిరిజనులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నాయి… పాలకులు మారుతున్నారు. కానీ తమ బతుకులు, తమ కష్టాలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయంటూ స్థానిక గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు, గెలిచాక కన్నెత్తి చూడకపోవడంపై వారిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించి… తక్షణమే ఈ మూడు హైలెవెల్ వంతెనల పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: