Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Crime భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

by CVR NEWS
భూగర్భ సంపద దోపిడీ... ప్రభుత్వ ఖజానాకు భారీ గండి!

భూగర్భంలో లభించే విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోందా..? ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందా..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైట్ క్వార్జ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనుమతులు లేకుండానే తెల్లరాయిని తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. పాల్వంచ మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ అక్రమ వ్యవహారంపై సీవీఆర్‌ న్యూస్‌ ప్రత్యేక కథనం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని బిక్కుతండా గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెం శివారులో విలువైన వైట్ క్వార్జ్ నిక్షేపాలు ఉన్నాయి. అయితే మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తీసుకుని క్వారీ నిర్వహించాల్సి ఉండగా, కొందరు అక్రమార్కులు జేసీబీలతో తవ్వకాలు చేపట్టి తెల్లరాయిని లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైట్ క్వార్జ్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గాజు తయారీతో పాటు కంప్యూటర్ చిప్స్, పారిశ్రామిక పౌడర్లు, పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ఈ ఖనిజాన్ని వినియోగిస్తారు. నాణ్యతను బట్టి దీనికి మంచి ధర లభిస్తుండటంతో అక్రమ వ్యాపారులు దీన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం తెల్లరాయిని ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే ప్రతి టన్నుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. అయితే ఇక్కడ అలాంటి ప్రక్రియ ఏదీ కనిపించడం లేదని సమాచారం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ తవ్వకాల వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై పాల్వంచ తాసిల్దార్ వరప్రసాద్‌ను వివరణ కోరగా… తెల్లరాయి తవ్వకాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. మైనింగ్ లేదా రెవెన్యూ శాఖల అనుమతులు లేకుండా ఎలాంటి తవ్వకాలు నిర్వహించరాదని, అనుమతులు లేకుండా క్వారీ నిర్వహిస్తున్నట్లు తేలాల్సి ఉందన్నారు. విలువైన ఖనిజ సంపద అక్రమంగా తరలిపోతున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..? ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారా..? అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తారా..? అనేది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: