Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

by CVR NEWS
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి

లంచం ఇస్తేనే పని జరుగుతుందనే స్థాయి నుంచి… లంచాల కోసమే పథకాలను సృష్టించే స్థాయికి కొందరు అధికారులు దిగజారిపోయారు. తాజాగా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఉదంతం దీనికి నిలువెత్తు నిదర్శనం. ఏసీబీ చర్యను స్వాగతిస్తున్నప్పటికీ… సామాన్య ప్రజల నుంచి ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. ఒక్కడిని పట్టుకుంటే వ్యవస్థ ప్రక్షాళన అయిపోతుందా…?. కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతుంటే పైఅధికారులు ఏం చేస్తున్నారు? కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు వాటాల పంపిణీ జరగకుండానే ఇదంతా సాధ్యమైందా…? నరహరి వెనుక ఉన్న శక్తులెవరు…?

అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా జరిపిన దాడిలో డిప్యూటీ డైరెక్టర్ నరహరి పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమార్కుడిని పట్టుకుని ఏసీబీ తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏసీబీ తీసుకున్న ఈ చొరవ నిజంగా అభినందనీయం. అయితే, ఇక్కడే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న తలెత్తుతోంది. కోట్లాది రూపాయల అవినీతి సామ్రాజ్యంలో కేవలం ఒక్క అధికారిపై మాత్రమే చర్యలు తీసుకుని, మిగతా వారిని వదిలేస్తున్నారా? ఒక పెద్ద వ్యవస్థలో ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే, అందులో కేవలం ఒక్కరి ప్రమేయం మాత్రమే ఉంటుందా?

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైలు కదలాలన్నా, ఒక పెద్ద ప్రాజెక్టు మంజూరవ్వాలన్నా ఒక నిర్దిష్టమైన ఛానల్ ఉంటుందన్నది బహీరంగ రహస్యమే. కింది స్థాయి అటెండర్ నుంచి మొదలుకొని, సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, ఐఏఎస్ స్థాయి అధికారులైన కలెక్టర్ల వరకు అందరి సంతకాలు, ఆమోదాలు అవసరమవుతాయి. ఇంత పెద్ద లంచాల పర్వం, కోట్లాది రూపాయల అవినీతి కేవలం ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి ఒంటరిగా నడిపించగలరా అన్నదే అసలు ప్రశ్న. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి అనేది ఒక గొలుసుకట్టు ప్రక్రియ అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు వాటాలు వెళ్లకుండా ఇంతటి భారీ స్కాములు సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. నరహరి అక్రమాలకు పాల్పడుతుంటే మిగతా అధికారులు, ఆయన పైఅధికారులు ఏం చేస్తున్నట్లు… వారికి తెలియకుండానే ఇదంతా జరిగిందా… లేక తెలిసి కూడా తలాడించారా మరి వారి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుందా లేదా…

ఏసీబీ ఒక అధికారిని పట్టుకోగానే కేసు క్లోజ్ అయిపోయినట్టు భావిస్తే అది అవినీతి నిర్మూలన అనిపించుకోదు. ఒక్క నరహరిని మాత్రమే బోనులో నిలబెట్టి, మిగతా సూత్రధారులు, పాత్రధారులను వదిలేస్తే వ్యవస్థలో మార్పు రాదు. ఒక చెట్టుకు ఉన్న కుళ్లిన కొమ్మను కత్తిరిస్తే సరిపోదు… అలా కుళ్లి పోయింది వేర్ల వరకు పాకిందేమో చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే మిగతా కొమ్మలు సైతం కుళ్లిపోతాయి. అదే మాదిరి కేవలం ఒక్కరిని అరెస్టు చేసి చేతులు దులుపుకుంటే… రేపు నరహరి స్థానంలో ఇంకొకరు వచ్చి అదే అక్రమాలకు తెరలేపుతారు. ఈ కోట్లాది రూపాయల అవినీతి వెనుక ఉన్న అసలు తిమింగలాలను… వారికి సహకరించిన కింది స్థాయి సిబ్బందిని సైతం చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏసీబీ విచారణ కేవలం నరహరి డైరీ… ల్యాప్‌టాప్‌తో ముగిసిపోకూడదు. ఆ ఫైళ్ల వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని లాగాలి. నరహరి అక్రమ సంపాదనకు సహకరించిన ఆఫీస్ సిబ్బందిని గుర్తించాలి. ఈ అవినీతిపై కళ్లు మూసుకుని ఉన్నా.. ప్రోత్సహించిన పైస్థాయి అధికారుల బాధ్యతను కూడా నిర్ధారించాలి. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారందరి ఆస్తులను జప్తు చేయాలి. ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలగాలంటే ఏసీబీ ఈ కేసుతార్కిక ముగింపునకు తీసుకువెళ్లాలి. నరహరి అరెస్టును ఒక ఆరంభంగా మాత్రమే చూడాలి. ఈ అవినీతి నెట్‌వర్క్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని ప్రజలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: