రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. తొలి దశలో 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న ఈ ఆసుపత్రి అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పడనుంది.
2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి.ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని ఈ రోజు పనులు ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు. ఈ రోజు స్వాతి నక్షత్రం కావడం, అదే నందమూరి తారక రామారావు జన్మ నక్షత్రం కావడం సంతోషంగా ఉందన్నారు.హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 22న భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.అలాగే హైదరాబాద్ ఆసుపత్రిలో మరో కొత్త భవనం నిర్మాణం జరుగుతోందని బాలకృష్ణ పేర్కొన్నారు.





Total views : 150182