భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది. సంబంధిత ఒప్పంద పత్రాలపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు, అటవీ అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం కమొడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్‌దాస్, సీఎస్ శాంతికుమారి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ పాల్గొన్నారు. వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భూముల కోసం 2010 నుంచి నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఈ విషయం తాజాగా పరిష్కారమైందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలో మొదటి వీఎల్ఎఫ్ కేంద్రం. ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలందిస్తోంది. ఈ అటవీప్రాంతంలో ఉన్న ఆలయానికి భక్తుల రాకపోకలను అనుమతించేందుకు నౌకాదళం అంగీకరించింది.
cm revanth reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నారని.. అలాంటప్పుడు మేం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా తన గన్మెన్లను కుదించడం పట్ల… వారి పనివేళల్లో మార్పుల పట్ల ఇంటెలిజెన్స్ ఐజీని కలిసినట్లు తెలిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రిని కలిశామన్నారు. ఇలా కలవడంలో తప్పేముంది? అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు కలిసినట్లు తెలిపారు. అలాగే ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. సీఎంను కలిసినంత మాత్రాన తమ నలుగురు ఎమ్మెల్యేలపై బురదజల్లడం మానుకోవాలని కోరారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని… మెదక్‌లోను పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
భారతమాల, రీజినల్ రింగ్ రోడ్ RRR భూసేకరణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ త్వరిగతిన పూర్తి చేయాలని లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు -RRR భూసేకరణ కోసం NHAI కి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి …సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. RRR భూసేకరణ కోసం నాయ్ కు 50 శాతం నిధులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు తెలిపారు. మా పార్టీకి, అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉందని… కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరేందుకేనని అనడం ఎంతవరకు సమంజసమని కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. మా నియోజకవర్గంలోని ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రిని కలిశామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరో వందసార్లు కలుస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. తాను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలో అని, చనిపోయేంత వరకూ పార్టీలోనే కొనసాగుతానని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తమకు లేవని తేల్చి చెప్పారు.
హైదరాబాద్ మెట్రో రైలు మార్గం రెండోదశ విస్తరణ రూట్ మ్యాప్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్దేశించిన రూట్‌మ్యాప్‌ను రద్దు చేయాలని, కొత్త మార్గాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు విమానాశ్రయం సహా వివిధ కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు తాజాగా ప్రభుత్వానికి సమర్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేలా కొత్త రూట్‌మ్యాప్‌ను డిజైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్న మెట్రో రైలు సేవలు మరిన్ని ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ రూట్‌మ్యాప్‌తో నెరవేరనుందని అంచనా వేస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌ను కలుపుతూ కొత్త మార్గాలను మ్యాప్‌లో అధికారులు ప్రతిపాదించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలిపారు. సరస్వతి దేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉందని, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జిల్లాల పర్యటనలో సైతం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారని తెలిపారు. హైదరాబాదులో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించామన్నారు. నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తీర్చేందుకు ముందుండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బి ఆర్ ఎస్ పార్టీదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూషించడం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరణి పై అధ్యయన కమిటీ వేసిననందుకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వి. హనుమంతరావు ధన్యవాదాలు తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములు అన్నీ అన్యాక్రాంతం అయ్యాయని వి. హనుమంతరావు అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 96 ఎకరాల భూమిని కీసరలో పేద ప్రజలకు ఇచ్చిందని గుర్తుచేశారు. ఓఆర్ఆర్తో అక్కడి పేద రైతులు భూములు కోల్పోయారన్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు అనుమతుల్లో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. దానిపై న్యాయ విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆర్డర్లు ఉన్న లే అవుట్ కోసం హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చిందన్నారు. కీసర ఓఆర్ఆర్తో భూములు కోల్పోయిన పేద ప్రజలకు న్యాయం చేయాలని అధ్యాయన కమిటీకి లేఖ రాసినట్లు తెలిపారు. ధనవంతులకే లాభం చేసే ధరణిని ఎత్తివేయాలని వి.హనుమంతరావు పేర్కొన్నారు.
ములుగు జిల్లా మండపేట మండలం కమలాపురం బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ -బిల్ట్ కంపెనీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ బిల్డ్ ప్రస్తుత నిర్వహణ సంస్థ ఫిన్ క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీతో చర్చలు జరిపారు. కర్మాగారంలోని పల్ప్ ఉత్పత్తిని మార్కెట్ లేదనే సాకుతో బిల్డ్ యజమాన్యం 2014 ఏప్రిల్ 4 నుంచి కంపెనీ షట్ డౌన్ చేసింది. దీంతో కంపెనీలో 750 మంది పర్మినెంట్ కార్మికులతో పాటు క్లరికల్, కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో పదేళ్లుగా బిల్డ్ పునరుద్ధరణ చేసి ఉపాధి కల్పించాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం బిల్డ్ యాజమాన్యంతో చర్చలు జరిపి పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పిన్ క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటిసి సంస్థలు బిల్ట్ ని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
Read Also..
సింగరేణి యాజమాన్యం స్పందించి రామగుండం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని కోసం రైతుల నుండి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పాముల పేట, లింగాపూర్, మేడిపల్లి గ్రామాలకు చెందిన రైతుల నుండి సింగరేణి సంస్థ ఓసిపి 4 ఏర్పాటు కొరకై భూములను సేకరించిన యాజమాన్యం బొగ్గు నిల్వలు పూర్తి అయి గనిని మూసివేసినప్పటికి భూములు తిరిగి ఇవ్వడం లేదని, పైగా కంచెను ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన కంచెను ట్రాక్టర్ సహాయంతో స్వయంగా ఎమ్మెల్యే తొలిగించారు. విలేజి రామగుండం, పాములపేట, లింగాపూర్, మేడిపల్లి భూనిర్వాసిత రైతులకు ఎలాంటి ఇబ్బంది తలపెట్టవద్దని, వెంటనే ఫెన్సింగ్ వేసే పనిని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
హనుమకొండ జిల్లా లో గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ కొత్తూరు సగర కమ్యూనిటీ హాల్లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందరెడ్డి. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాష, జిల్లా నోడల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ శ్రీమన్, వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాం. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి డివిజన్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసాం. అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ప్రజల వద్దకే పాలన వస్తుంది అని అన్నారు.





Total views : 90729