తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు. అయితే, బీఆర్ఎస్ సర్కారు మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించింది. అప్పటి నుంచి పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి తప్పుకోవడంపై చర్చ జరుగుతోంది.
Cvr telugu news
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దొరలకు, ప్రజలకు మధ్య జరిగిన యుద్ధంలో చివరికి ప్రజలే విజయం సాధించారని వెల్లడించారు.
కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్… బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 3,284 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈవీఎంలను లెక్కించే సమయంలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. ఈ రెండు ఈవీఎంలలో 1300 ఓట్లు ఉన్నాయి. దీంతో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రీకౌంటింగ్ జరపాలని బీజేపీ నిర్ణయించింది. కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేశారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్ 7 సీట్లలో గెలిచింది.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. నాలుగు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయింది. ఈ తీర్పుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఙతలు తెలిపారు. బీజేపీ పై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలు, సుపరిపాలన, అభివృద్ధిపైన విశ్వాసం ఉంచారనేదానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. తెలంగాణతో మా బంధం విడదీయరానిదన్నారు. తెలంగాణలో గత కొన్నేళ్లుగా మా మద్దతు పెరుగుతూనే ఉందని తెలిపారు. ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ఎదుటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తేలిగ్గా తీసుకున్నారు. రాజకీయాలన్న తర్వాత గెలుపు ఓటములు సహజం అని పేర్కొన్నారు. పార్టీ కోసం తమ నేతలు ఎంతో కష్టపడ్డారని, గతం కంటే మంచి మెజారిటీ సాధిస్తామని భావించామని వెల్లడించారు. ఫలితాలు నిరాశకు గురిచేసినా అసంతృప్తి మాత్రం లేదని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని, మాకు 70 ప్లస్ సీట్లు వస్తాయని మొన్న చెప్పాను కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, అందుకే తానేమీ బాధపడడంలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో ఉన్నది రాజకీయ అనుబంధం కాదు… కుటుంబ పరమైన అనుబంధంమన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. పార్టీ గెలవడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా సాగుతున్న నేపథ్యంలో ఠాక్రే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి విజయం అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం కలిసి వచ్చిందన్నారు.
తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పతాకం తొలిసారి రెపరెపలాడింది. ఉద్యమ పార్టీ బీ ఆర్ ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి కీలక హామీల అమలుపై ప్రజలు పెదవి విరుస్తున్న సమయంలో హస్తం పార్టీ సరికొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ విషయంలో కర్ణాటకలో విజయవంతమైన ఫార్ములానే తెలంగాణలో పునరావృతం చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేస్తామని ప్రజలను మెప్పించడంలో విజయం సాధించింది. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకుపోయింది. కాంగ్రెస్ ఇంతలా బలపడటానికి కారణం ఆ పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి రావడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ అంటే పదవుల కోసం కాదు, ప్రజలకు మంచి పాలన అందించే పార్టీగా తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నాలు కర్ణాటకలో స్పష్టమయ్యాయి. రాజస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలోనూ రిపీట్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నడూ లేనంతగా నాయకులు సైలెంట్‌గా వ్యవహరిస్తూ అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటూ ఎన్నికల్లో పని చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడం, మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారు.
తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీ అంజనీకుమార్, ఇద్దరు అదనపు డీజీలు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. ఈనేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.





Total views : 90608