రాష్ట్రంలో ఎన్నికల పరిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మొదటి జాబితా సీట్ల ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటు టీడీపీ అటు జనసేన అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బలంగా ఉండడంతో కచ్చితంగా అవకాశం మాకే వస్తుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ, టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా తనకు అవకాశం కల్పిస్తారని జనసేన పిఎసి సభ్యుడు బాలకృష్ణ అంటున్నారు.
Janasena
తిరుమల
బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ సారథ్యంలో ఆత్మనిర్భంధన్ భారత్ దిశగా మరో సారి బీజేపీ విజయం సాధించాలి. విశ్వ గురువుగా భారత్ మారాలంటే మోదీతోనే సారథ్యంలోనే సాధ్యం. తమిళనాడు డీఏంకే పాలనలో సనాతన ధర్మంపై దాడి జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యపై దేశమంతా ధ్వజమెత్తింది. 500 ఏళ్ళ అనంతరం అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠాపన జరగటం శుభప్రదం. కేవలం భారత్ లోనే కొందరు హైందవాన్ని వక్రబుద్ధితో చూసి ఓట్లుగా మలుచుకొని ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచం హైందవాన్ని ఆహ్వానిస్తుంది. ఎల్కే అద్వానీకి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషం. వెలుగులోకి రానీ వారిని వెలుగులోకి తెచ్చి వారికి అత్యుత్తమ పురస్కారాని మోదీ ప్రభుత్వం ఇస్తుంది. అన్ని రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్న. రాష్ట్రంలో జనసేనతో పొత్తులో ఉన్నాం. కలిసి వచ్చే వారితో ప్రయాణం సాగిస్తాం. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. భారత దేశానికి ఓ సేవకునిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు. తమిళనాడులో సైతం బీజేపీకి బలం పెరిగింది. అని తెలంగాణ బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా చెప్పుకోవచ్చు. అత్యధికంగా సామాజిక వర్గంగా కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ భిన్నమైన తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2014లో ఇండిపెండెంట్ గా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ విజయం సాధించారు. ఏకంగా 50 వేల ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. 2019 లో మాత్రం జగన్ గాలికి ఆయన కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం జనసేన టిడిపి బలంగా ఉన్న వర్గాల్లో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెప్పాలి అయితే ఇక్కడ వర్మ సీటు ఆశిస్తున్నారు. కానీ జనసేనకు పిఠాపురం తప్పనిసరి అని వాదన బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానికత అంశం కూడా తెరపైకి రావడం రాజకీయంగా కలవరం సృష్టిస్తుంది. ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా ఉన్న ఉదయ శ్రీనివాస్ రాజమండ్రి దగ్గర కడియంకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని జనసేన నాయకుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దేందుకు మాత్రమే ఉదయ్ శ్రీనివాసన్ పంపించారనేది మరొక వాదన అయితే ఉదయ శ్రీనివాస్ కు సీటు పక్కా అని పవన్ కళ్యాణ్ ఇంట్లో మనిషిగా ఉదయ శ్రీనివాస్ కు పేరు ఉందని ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పిఠాపురం ప్రత్యేక స్థానంలో ఉంది. ఇందుకు గతంలో తెలుగుదేశానికి పడ్డ ఓట్లే ఉదాహరణగా చెబుతున్నారు. జనసేన బలంగా ఉన్నప్పటికీ లోకల్ ఫీలింగ్ బయటకు రావడంతో ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఇక్కడ సీటును తెలుగుదేశానికి కేటాయించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క అధిష్టానం కూడా ఎటు తేల్చకపోవడంతో ఈ సీటు ప్రస్తుతం గందరగోళ పరిస్థితిని నెలకొల్పిందనే చెప్పాలి. ఆఖరి నిమిషం వరకు పిఠాపురం సీటు తేల్చాలని ప్రతిసారి ఇలాగే చేసి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఆయా పార్టీల అభిమానులు ఎవరో ఒకరికి సీటు వస్తుందని పక్కాగా చెబితే ఆ దిశగా మేము కార్యక్రమాలు చేస్తామని అప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదని జనసేన టిడిపి కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క వైసీపీ ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దొరబాబును పక్కనపెట్టి కాకినాడ ఎంపీ వంగ గీతకు ఇన్చార్జ్ పగ్గాలు అప్పగించారు. పిఠాపురం సీటు విషయంలో ఎమ్మెల్యే మరో దారి లేక పార్టీ వెంటే ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం రాజకీయ పరిస్థితి చూస్తే జనసేన టిడిపి పోటాపోటీగా సీటు కోసం పాకులాడుతున్నాయి. మరోపక్క పిఠాపురం స్థానం నుండి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే ఎవరికీ గొడవ ఉండదని నెగ్గించుకుంటామని టిడిపి జనసేన అభిమానులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పిఠాపురం సీటు విషయంలో చివరి వరకు డైలమా తప్పదని ఇది గతం నుండి ఆనవాయితీగా వస్తుందని స్థానికులు అంటున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంగాను, రాజకీయ దురందుల కోటగాను పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మెట్ట ప్రాంతంలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. తాజాగా మారుతున్న కాలాన్ని బట్టి పెరుగుతున్న రాజకీయ పార్టీల తాకిడితో మెట్ట ప్రాంతమైన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట లో రాజకీయం రసవత్తరంగా మారింది. CVR న్యూస్ ప్రత్యేక కథనం మెట్ట ప్రాంతంగా పిలవబడే జగ్గంపేటలో ఆది నుంచి పంతం, తోట, జ్యోతుల కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. ఈ మూడు కుటుంబాలకు ఉభయగోదావరి జిల్లాలోని అన్ని పార్టీల నాయకులతో కుటుంబ బాంధవ్యాలు పెనవేసుకుని ఉన్నాయి. దీనితో రాజకీయంగా ప్రధాన పార్టీలు ఆయా కుటుంబాలను కాదని గత ఐదు దశాబ్దాలుగా మరొకరికి ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. తాజాగా కొత్త పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయా కుటుంబాలకు దగ్గర బంధువులే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.
జగ్గంపేట రాజకీయం ఒక చిత్రం పరిశీలిస్తే ప్రస్తుత శాసనసభ్యుడిగా వైకాపా నుంచి జ్యోతుల చంటిబాబు ఎన్నికయ్యారు. ఈయన రాజకీయ దురంధరుడు గా పేరుగాంచిన తన పెదనాన్న జ్యోతుల నెహ్రూ పై పోటీ చేసి గెలుపొందారు. మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఆరితేరిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట సెగ్మెంట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇబ్బడి ముబ్బడి సంక్షేమ పథకాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగనన్న పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విధంగా జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబునీ కాదని అధికార వైసిపి మాజీ మంత్రి తోట నరసింహంను జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. ఆయన పాత క్యాడర్ ను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని పటిష్టవంతం చేసే చర్యల్లో ఆయన తనదైన శైలిలో పావులు కదుపుతూ ముందుకు పోతున్నారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన కొంత క్యాడర్ మాత్రం ఎటువైపు వెళ్లకుండా గుంభనంగా ఉన్నారు. అధికార వైసిపి టికెట్ జ్యోతుల చంటి బాబు కాదని మాజీ మంత్రి తోట నరసింహం పేరు ప్రకటించగానే పార్టీలో అసంతృప్తులు పెరిగాయనే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా నియోజకవర్గ పరిధిలో వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు జోరుగానే సాగుతున్నాయి. కిర్లంపూడి ఎంపిపి,జెడ్పీటీసీ, గండేపల్లి జెడ్పీటీసీ, గోకవరం ఎంపిపి లు తమ అనుచర వర్గంతో వైసిపి నీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీటికి తోడు గ్రామస్థాయిలో కూడా టిడిపి నేత జ్యోతుల నెహ్రూ పార్టీలో చేరికలు జోరుగా సాగిస్తూ తన మార్క్ రాజకీయాలు సాగిస్తూ బలం పుంజుకుంటున్నారు.
నియోజకవర్గ స్థాయిలో వైసిపి నుండి టిడిపి లోకి జోరుగా చేరికలు పెరగడంతో అధికార వైసిపి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసంతృప్త వాదులను పార్టీలోకి తీసుకుని బలం పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి తోడు పార్టీకి దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబును సైతం దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు అధిష్ఠానం చేపట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయన కాకినాడ ఎంపిగా జనసేన పార్టీ తరుపున బరిలోకి దిగనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. పొత్తులో బాగంగా బరిలోకి జ్యోతుల కుటుంబాలు కలిసి దిగితే అధికార వైసిపి ఓటు బ్యాంక్ గండి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు పార్టీలకు సమాంతరంగా జనసేన పార్టీ జగ్గంపేట ఇన్చార్జి పాఠం శెట్టి సూర్యచంద్ర గత ఏడాదికాలంగా తన భార్యతో కలిసి ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఒక దఫా మొక్కల పంపిణీ అంటూ మరో దఫా పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు పంపిణీ చేస్తూ నిత్యం ప్రజల్లోనే పర్యటిస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. పొత్తు లో భాగంగా జగ్గంపేట టికెట్ టిడిపికి కేటాయిస్తే సూర్యచంద్ర పయనం ఎటు అనే విషయం ఆలోచింప చేస్తుంది. అధికార వైసిపి లో ఉన్న లుకలుకలు మాదిరిగానే పొత్తు కుదిరితే జనసేన లోను లుకలుకలు బహిర్గతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడలో పొలిటికల్ బ్యానర్ల వార్ కొనసాగుతూ ఉంది. మంగళవారం వైసీపీ నేతలు సిద్ధం పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేయగా, జనసేన నేతలు మేము సైతం సిద్ధమంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి వైసీపీ నేతలు మరొక బ్యానర్ ఏర్పాటు చేశారు. 175 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీనిపై జనసేన నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
విజయవాడలో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఎన్టీఆర్ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోరు కొనసాగుతుంది. టీడీపీ – జనసేన పొత్తుతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పశ్చిమ నుంచి బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బేగ్ వంటి నేతలు రేసులో ఉన్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చర్చ తీవ్రమైంది.
పీలేరులో టీడీపీ రా కదలిరా కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు తరలి వచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేణిగుంట నుండి హెలికాప్టర్లో పీలేరు కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పీలేరు సభాస్థలి వద్దకు జనసేన, టీడీపీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. పీలేరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని, జనసేన నాయకులు టీడీపీ కార్యకర్తలు, కలసి గెలిపించుకుంటామని అంటున్నా పీలేరు జనసేన నాయకులు కామిసెట్టి సుధాకర్.
రాష్ట్రంలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెపుతారు. నిజంగా పార్టీ ఇక్కడ బలంగా ఉంది. కానీ గత కొంతకాలంగా అసమ్మతి పెరిగింది. తొలుత పిఠాపురం ఇన్చార్జిగా మాకినీడి శేషు కుమారి వ్యవహరించారు. హఠాత్తుగా ఆమెను తొలగించి పార్టీ అధినేత పవన్ కు సన్నిహితుడైన టీడీపీ అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాసును నియమించారు. ఆయన రావడంతోనే ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొంత కాలం పాటు ఉదయ శ్రీనివాస్ కార్యక్రమాలు సాఫీగానే జరిపారు. ఇదే పార్టీలో సీనియర్లను గుర్తించడం లేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ పిల్లా శ్రీధర్, అదే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు వచ్చినప్పుడు గొల్లప్రోలులో ఆయన బస చేసిన ఇంటి అధినేత, విద్యావేత్త, సీనియర్ నేత ఇలా ఎందరినో తంగిళ్ళ పట్టించుకోవడం లేదు. వారంతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ ప్రాధాన్యత లేదని వాపోతున్నారు. మరోపక్క టీడీపీ ఇన్చార్జి వర్మ తానే అభ్యర్థని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవలసిన ఉదయ శ్రీనివాస్ ఏకపక్షధోరణి పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన నాయకులు పిఠాపురం సమావేశంలో కుర్చీలతో కొట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా జనసేనకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి.
కాగా రెండు రోజుల క్రితం పిఠాపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు జనసేనలో కలవరాన్ని పుట్టిస్తున్నాయి. జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ స్థానికేతుడు అంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తంగేళ్ల అనుచరులు దీనిపై మండిపడుతున్నప్పటికీ ఆయన వ్యతిరేకవర్గం మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది. అయ్యన్నపాత్రుడు నిజమే చెప్పాడని వారు వ్యాఖ్యనిస్తున్నారు. జనసేన రెండో వర్గం అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను సమర్ధించడం మరో వివాదాస్పదమైంది.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా? సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సాంసృతి మీ పరిపాలనలో జరగటంలేదా? గొంతు ఎత్తిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుట్రల రాజకీయాలతో బానిసలగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజులలో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణి చేసినట్లు పైకి చెప్తూ లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఇవాళ ఉదయం 11 గంటలకు కలవనున్నారు. ఈ సందర్బంగా ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేయనున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, బాలశౌరి గారి అభిమానులు, అనుచరులు. గుంటూరు పట్టణంలోని లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం 6 గంటలకు దాదాపు 20 డివిజన్లకు చెందిన నాయకులు కలిసి పెద్దఎత్తున ఎంపీ బాలశౌరి గారికి మద్దతుగా బాణసంచా కాల్చనున్నారు.






Total views : 91058