ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీని కోసం సన్నాహాలు చేస్తున్నామని, ఈ బడ్జెట్ లోనే వాటికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. 500కు గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇళ్లు , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , పదకాల అమలపై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. వీటిలో వెంటనే రెండింటిని అమలలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. శాసనసభ సమావేశాల్లోపు మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Revanth Reddy
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి తన అల్లుడు హరీశ్ రావుకు గడ్డి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలని చురక అంటించారు. రేవంత్ రెడ్డి చెప్పేది కొండంత కానీ చేసేది గోరంత కూడా లేదన్నారు. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని విమర్శించారు. తామే రిక్రూట్మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం వంచించిందని అబద్ధపు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు ఆయన నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు. 15వేల పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని… వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశారన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం కావాలనుకున్నామన్నారు. విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడిందని… గడిచిన పదేళ్లలో రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ ప్రయోజనాలు ఆలోచించిందని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. కూతురును నిజామాబాద్ నుంచి ఓడిస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి మాత్రం ఆలోచించలేదన్నారు.
ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి. ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెళ్లిలో సభ ఉందని నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 60 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని చెప్పారు. అయితే ఇంత వరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు అన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు. పెట్టుబడి రాక గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు పాలుపడుతన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన వరిని కూడా కేంద్రం కొనలేని స్థితిలో ఉందని విమర్శించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, వందలాది మంది రైతులు చనిపోయినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే దృష్టి సారించింది. దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022లోపు పక్కా ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. కానీ, ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. రాష్ట్రంలో కేసీఆర్ మాదిరిగానే కేంద్రంలో మోదీ భారీగా అప్పులు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అయిదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా? వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుభరోసా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పారని కానీ రైతుబంధు ఇప్పటివరకు పడలేదన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతీసి కొడతామని కాంగ్రెస్ నేతలు అన్నారన్నారు. రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్‌ను రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటుతో కొడదామని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని దానిని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నామనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పని చేసిందని అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపించామన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు మనకు మూడోవంతు సీట్లను ఇవ్వడం ద్వారా బలమైన ప్రతిపక్షంగా పని చేయమని చెప్పారని వ్యాఖ్యానించారు. మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రిపబ్లిక్ డే రోజున గవర్నర్ ప్రసంగం సామాన్య కార్యకర్త ప్రసంగం కంటే దారుణంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్ర ప్రభుత్వం ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేదా ‘ఓట్ ఆన్ అకౌంట్’ ప్రవేశపెట్టాలా? అని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితే పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతుండడంతో ఆలోపే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆ దిశగా అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని, వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని సూచించారు. స్కూల్ భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు.
పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిందని మహబూబ్ నగర్ లోక్ సభ స్థానాన్ని గెలిపించుకునేందుకు ఇంచార్జి బాధ్యత ముఖ్యమంత్రికి ఇచ్చిందని ఢిల్లీలో రేవంత్ రెడ్డి పరపతి నిరూపించుకోవాలంటే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిట శ్రీహరి, నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూరు వెంకట్, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించి పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం జరిగిందని రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలంటే మన బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరపతిని ఢిల్లీలో నిరూపించుకునే విధంగా పాలమూరు ప్రజలు అత్యధిక మెజారిటీతో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించాలని అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ముందుండి అందర్నీ గెలిపించుకుంటామని ఆయన అన్నారు. మరోవైపు జడ్చర్ల నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరో రెండు మూడు రోజుల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తో పాటు తాను కూడా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రణాళిక రూపొందించి జడ్చర్లకు రింగు రోడ్డును తీసుకువస్తామని నియోజకవర్గ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు. సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. ఆ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని ఆదేశించారు.






Total views : 90770