గణతంత్ర దినోత్సవ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సుమతి శతకం లో భాగంగా బద్దెన రాసిన పద్యం ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టిన శుభలగ్నమునం దొనగర బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ అంటూ కామెంట్స్ పెడుతుండగా మరికొంత మంది మాత్రం పదేళ్లు అధికారంలో కూర్చున్న మీకే ఈ పద్యం సరిపోతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గొయ్యి తీసి బొంద పెడతామని, కేసీఆర్ కాస్కో అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు.
Revanth Reddy
భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది. సంబంధిత ఒప్పంద పత్రాలపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు, అటవీ అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం కమొడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్‌దాస్, సీఎస్ శాంతికుమారి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ పాల్గొన్నారు. వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భూముల కోసం 2010 నుంచి నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఈ విషయం తాజాగా పరిష్కారమైందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలో మొదటి వీఎల్ఎఫ్ కేంద్రం. ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలందిస్తోంది. ఈ అటవీప్రాంతంలో ఉన్న ఆలయానికి భక్తుల రాకపోకలను అనుమతించేందుకు నౌకాదళం అంగీకరించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నారని.. అలాంటప్పుడు మేం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా తన గన్మెన్లను కుదించడం పట్ల… వారి పనివేళల్లో మార్పుల పట్ల ఇంటెలిజెన్స్ ఐజీని కలిసినట్లు తెలిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రిని కలిశామన్నారు. ఇలా కలవడంలో తప్పేముంది? అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు కలిసినట్లు తెలిపారు. అలాగే ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. సీఎంను కలిసినంత మాత్రాన తమ నలుగురు ఎమ్మెల్యేలపై బురదజల్లడం మానుకోవాలని కోరారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని… మెదక్‌లోను పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
భారతమాల, రీజినల్ రింగ్ రోడ్ RRR భూసేకరణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ త్వరిగతిన పూర్తి చేయాలని లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు -RRR భూసేకరణ కోసం NHAI కి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి …సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. RRR భూసేకరణ కోసం నాయ్ కు 50 శాతం నిధులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు తెలిపారు. మా పార్టీకి, అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉందని… కార్యకర్తలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరేందుకేనని అనడం ఎంతవరకు సమంజసమని కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. మా నియోజకవర్గంలోని ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రిని కలిశామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరో వందసార్లు కలుస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. తాను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలో అని, చనిపోయేంత వరకూ పార్టీలోనే కొనసాగుతానని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తమకు లేవని తేల్చి చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు తరలి వచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని… తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు. చిన్నచిన్న కారణాలతో దాదాపు పదిహేను వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. రేవంత్ ఇంటి వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు… సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతిని ఇచ్చారు.
మేడిగడ్డపై తెలంగాణ విజిలెన్స్ సంచలన నివేదిక ఇచ్చింది. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక సిఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా స్కామ్ జరిగిందని నివేదిక తేల్చి చెప్పింది. దాదాపు 3 వేల 200 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందని మండిపడింది.. నిర్మాణంలో భాగస్వాములంతా దోషులేనని విజిలెన్స్ తెలిపింది. వరదల గురించి అంచనా వేయకుండానే డిజైన్ చేశారని ఆరోపించింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ అకస్మాత్తుగా కుంగలేదని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టం చేసింది.
భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటించిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ గూండాలు దాడి చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసోంలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బతద్రువ సత్ర ఆలయానికి వెళ్లాలని భావించారని.. అయితే అధికారులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ స్పాన్సర్డ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని… రాహుల్ భద్రత విషయంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవని గుర్తుంచుకోవాలన్నారు. మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ దేశ ప్రజల మద్ధతు ఆయనకు ఎప్పుడూ ఉందన్నారు. తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉందని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా నిలవాలని, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో కార్యాలయంలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ కు రేవంత్ రెడ్డి సర్కార్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. కొత్త బాధ్యతలు స్వీకరించిన స్మితా సబర్వాల్ ఆఫీస్‌లో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న సర్పంచ్‌లు వారి సూచనలు, సమస్యల కోసం కలవాలనుకునే వారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయానికి రాగలరు అని ట్వీట్ చేశారు. అపాయింట్ మెంట్ కోసం కార్యాలయం నెంబర్‌ను సంప్రదించాలని, ఎర్రమంజిల్‌లో చిన్న కార్యాలయం ఉందని పేర్కొన్నారు. ఆఫీస్ గూగుల్ మ్యాప్‌ను సైతం షేర్ చేశారు.
రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదికలు అందించనున్నట్లు ధరణి కమిటీ సభ్యులు తెలిపారు. తుది నివేదిక ఇచ్చే వరకు వేచి చూడకుండానే ఎప్పటికప్పుడు సూచనలు, సిఫార్సులను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ధరణి కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. అనంతరం సచివాలయం మీడియా కేంద్రంలో కమిటీ సభ్యులు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, న్యాయవాది సునీల్‌కుమార్‌లు సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ మ్యానిఫెస్టోలోనూ ధరణి అంశాన్ని చేర్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆయన నిశితంగా దృష్టిసారించారు. కమిటీ ఏర్పాటు చేశారు. వాస్తవానికి నిజాం కాలంలోనూ రెవెన్యూ వ్యవస్థ ఎంతో బాగుంది. అనంతరం కూడా రికార్డుల నిర్వహణ సజావుగా కొనసాగింది. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చింది. పట్టాభూములు, భూదాన్, ఎసైన్డ్, వక్ఫ్, అటవీ భూముల్లోనూ సమస్యలు ఏర్పడ్డాయి. పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. సాగులో ఉన్నప్పటికీ ఆన్లైన్లో భూ సమాచారం లేక ఎన్నో ఏళ్లుగా హక్కులు కోల్పోయి ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. భూ సమస్యల వివాదాలతో హైదరాబాద్ నగర శివారులో ఒక మహిళా తహసీల్దారును సజీవ దహనం చేసిన సంఘటన చోటుచేసుకుంది. హక్కుల కోసం తిరుగుతూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. రెండో విడత సమావేశం ఈ నెల 17న జరుగుతుందని లచ్చిరెడ్డి తెలిపారు.
Read Also..






Total views : 90813